Begin typing your search above and press return to search.

'రాకెట్రి' సినిమాకి దక్కిన అరుదైన గౌరవం!

By:  Tupaki Desk   |   7 Aug 2022 5:30 AM GMT
రాకెట్రి సినిమాకి దక్కిన అరుదైన గౌరవం!
X
ఈ మధ్య కాలంలో చాలా బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి బయోపిక్ లలో 'రాకెట్రి' అగ్రస్థానంలో నిలిచింది. స్ఫూర్తిని నింపడం .. ఆదర్శ మార్గంలో అడుగులు వేయించడమే బయోపిక్ ల ప్రధానమైన ఉద్దేశంగా ఉంటూ ఉంటుంది. అలాంటి ఉద్దేశంతో రూపొందిన 'రాకెట్రి' ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. భారత అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్రగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి రచయితగా .. దర్శక నిర్మాతగా మాధవన్ పనిచేయడం విశేషం. ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రను పోషించింది ఆయనే.

ఇది మాధవన్ చేసిన సాహసంగా .. ప్రయోగంగా చెప్పుకోవాలి. ఆయన కెరియర్లో గర్వంగా చెప్పుకునే సినిమా అని ఒప్పుకోవాలి. జీవితమే ఒక పోరాటం అనే మాటను తరచూ వాడుతూ ఉంటాము. నంబి నారాయణన్ జీవితచరిత్రను తెలుసుకుంటే నిజమైన పోరాటం అనేది ఎలా ఉంటుందనే అర్థమవుతుంది. నిజం .. నిస్వార్ధం .. న్యాయమే చివరికి గెలుస్తాయనే ఒక విషయం స్పష్టమవుతుంది. నంబి నారాయణన్ ఆశయం .. అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయన ఎలా ఎదిగారు అనేది 'రాకెట్రి' సినిమాలో చూపించారు.

ఇక ఆ తరువాత భారత స్పేస్ రీసెర్చ్ సంస్థ నుంచి ఒక సమాచారాన్ని లీక్ చేశారనే అభియోగం ఆయనపై మోపబడింది. ఆ సమయంలో తన చుట్టూ అసలు ఏం జరుగతుందనేది ఆయనకే అర్థం కాలేదు. ఆ నింద నిజం కాదని నిరూపించుకుని ఆయన ఎలా బయటికి వచ్చారనేదే తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది జూలై లో విడుదలైన ఈ సినిమా సంచలనం విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో .. భాషల్లో కూడా ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. బెస్ట్ బయోపిక్ గా ఈ సినిమా నిలిచింది.

అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా పార్లమెంట్ లో ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను వీక్షించారు. వాళ్లంతా కూడా నంబి నారాయణ్ ను .. ఆయన పాత్రను పోషించిన మాధవన్ ఆహ్వానించి, వాళ్లతో కలిసి ఈ సినిమాను వీక్షించడం విశేషం. సినిమాను వీక్షించిన అనంతరం వాళ్లిద్దరినీ అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. ఇది ఈ సినిమాకి దక్కిన గౌరవంగా భావించవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన పిక్స్ ను మాధవన్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి.