Begin typing your search above and press return to search.

విష‌పూరిత‌మైన డివైడ్ కల్చ‌ర్ విధ్వంసకరం..ఖాన్ ఆక్రోశం!

By:  Tupaki Desk   |   16 Dec 2022 5:30 AM GMT
విష‌పూరిత‌మైన డివైడ్ కల్చ‌ర్ విధ్వంసకరం..ఖాన్ ఆక్రోశం!
X
కింగ్ ఖాన్ షారూఖ్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇటీవ‌ల హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. అతడు ఓవైపు త‌న న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. మ‌రోవైపు కుమారుడు ఆర్య‌న్ భ‌విష్య‌త్ గురించి తెలివైన ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాడు. వివాదాల నుంచి ఆర్య‌న్ బ‌య‌ట‌ప‌డ్డాక ఇప్ప‌టికి కుదుట‌ప‌డ్డాడు. త‌దుప‌రి వ‌రుస‌గా సోలో చిత్రాల‌లో న‌టిస్తున్నాడు. ఇందులో అత్యంత కీల‌క‌మైన సినిమా 'ప‌ఠాన్'. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ తేదీని ఖ‌రారు చేసారు.

ఇంత‌లోనే ప‌ఠాన్ చిత్రంపై నెగెటివిటీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై వివాదాస్ప‌ద విమ‌ర్శ‌కుడు కేఆర్కే స‌హా కొన్ని సోష‌ల్ మీడియా గ్రూపులు అదే ప‌నిగా నెగెటివిటీని పెంచి పోషిస్తున్నాయి. అమీర్ ఖాన్ న‌టించిన బాయ్ కాట్ లాల్ సింగ్ చ‌డ్డా త‌రహాలోనే బాయ్ కాట్ ప‌ఠాన్ హ్యాష్ ట్యాగులు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ప‌రిణామం ఖాన్ లో తీవ్ర క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. అయితే దీనిపై పంచ్ వేసేందుకు అత‌డికి ఇప్ప‌టికి అవ‌కాశం చిక్కింది. కోట్లాది మంది వీక్షించే ఓ బ‌హిరంగ వేదిక‌పై ప‌ఠాన్ పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని అత‌డు ప‌రోక్షంగా ప్ర‌స్థావించాడు. నెగెటివిటీ ఆలోచ‌న‌ల‌తో ఉన్న‌వాడు బ‌త‌క‌లేడ‌ని పాజిటివ్ గా ఆలోచించేవాడే బ‌త‌క‌గ‌ల‌డ‌ని త‌న‌దైన శైలిలో సెటైర్ వేసారు కింగ్ ఖాన్.

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాల‌లో విష‌పూరిత క‌ల్చ‌ర్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. పాజిటివిటీ కోసం పిలుపునిచ్చారు. తన త‌దుప‌రి చిత్రం 'పఠాన్'కి వ్యతిరేకంగా నిరసనలను అత‌డు తెలివిగా తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేసాడు.

ఇంత‌కీ బ‌హిరంగ వేదిక‌పై ఖాన్ ఏమ‌న్నారు? అంటే.. "నేటి కాలంలోని సామూహికంగా విషం నూరిపోస్తున్నారు. సోషల్ మీడియాలు దీనికోసం సిద్ధం చేసి ఉంచారు. సినిమాల‌పై ఇవ‌న్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయ‌ని నేను అనుకోను" అని 28వ కోల్ కతా అంతర్జాతీయ చలనచిత్రం (KIFF) ప్రారంభోత్సవంలో ఆయన అన్నారు.

సోషల్ మీడియా తరచుగా ఒక నిర్దిష్ట సంకుచిత దృక్కోణంతో కొన‌సాగుతోంది. అది మ‌నుషుల నీచ స్వభావాన్ని ఆవిష్క‌రిస్తోంది. సోషల్ మీడియా ల్లో ప్ర‌తికూల‌త‌ పెరుగుతోంది. అయితే ఇలాంటివి వ్యాపార‌వాణిజ్య విలువల‌ను పెంచుతాయ‌నే నేను ఎక్కడో చదివాను. అలాంటి అన్వేషణలు సామూహిక కథనాల‌కు వ్య‌తిరేకంగా సాగుతాయి. అయినా విష‌పూరిత‌మైన డివైడ్ కల్చ‌ర్ విధ్వంసకరం" అని మిస్టర్ ఖాన్ అన్నారు.

త‌న కెరీర్ గ్యాప్ గురించి అభిమానులతో త‌న మ‌నోగ‌తాన్ని కింగ్ ఖాన్ షేర్ చేసుకున్నారు. "కొంతకాలంగా మనం కలవలేకపోయాం. కానీ ఇప్పుడు ప్రపంచం మామూలుగా మారింది. మేమంతా(ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు) సంతోషంగా ఉన్నాం . నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచం ఏం చేసినా దానిని బ‌హిరంగంగా చెప్పడానికి నాకు ఎలాంటి సందేహాల్లేవ్‌! ప్రపంచంలోని సానుకూల వ్యక్తులందరూ సజీవంగా ఉన్నారు" అని న‌ర్మ‌గ‌ర్భంగా ఖాన్ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి చెందిన కొంద‌రు నాయకుల మద్దతుతో 'పఠాన్'పై రైట్-వింగ్ సోషల్ మీడియా వ్య‌క్తులు దాడి చేస్తున్న‌ నేపథ్యంలో షారూఖ్‌ వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. బేషరమ్ రంగ్' పాటపై నిరసన వ్యక్తం చేయ‌డం వెన‌క రాజ‌కీయ రంగు గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. అమీర్ ఖాన్ తర్వాత ఒక ముస్లిం సినీ నటుడిపై ఈ ఏడాది మ‌రో దుష్ప్రచార ప‌ర్వంగా దీనిని చూస్తున్నారు.

'ప‌ఠాన్' పైనే ఎందుకీ ఎటాక్ లు?

ఇటీవ‌లి కాలంలో మ‌నోభావాల పేరుతో సినీప‌రిశ్ర‌మ‌ల‌పై వేధింపులు పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ పై ఇలాంటి దాడులు రాజ‌కీయ రంగును పులుముకోవ‌డం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ ని ఈ సెగ తాకింది. ఉత్త‌రాది రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రం ఇండోర్ లో 'బ్యాన్ పఠాన్' పిలుపులు ఎక్కువయ్యాయి. నిరసనకారులు షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు 'పఠాన్'కు వ్యతిరేకంగా ఇండోర్ వీధుల్లోకి వచ్చి చిత్ర‌క‌థానాయ‌కుడు షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేయ‌డ‌మే గాక‌... వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేసారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ 'బేషారం రంగ్' పాటలోని కంటెంట్ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని నిరసనకారులు ఆరోపించారు. తాజా ఆరోప‌ణ‌ల‌తో ఈ పాట సందిగ్ధంలో పడింది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సహా పలువురు పాటలో దీపిక ధ‌రించిన‌ దుస్తులకు రంగులు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మ‌ధ్య ప్ర‌దేశ్‌ లో పఠాన్ పై నిషేధం?

అంతకుముందు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 'పఠాన్' పాటలో దీపిక‌ పదుకొనే వేషధారణపై తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదుకొణె - షారూఖ్ ఖాన్ వేషధారణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని 'సరిదిద్దాలని' పిలుపునిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుంటే సినిమాపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అంతకుముందు సంస్కృతి బచావో మంచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ కూడా 'బేషరమ్ రంగ్' పాటపై నిరసన వ్యక్తం చేశారు. అతని బృందంలోని సభ్యులు ప్రధాన తార‌లపై నిరసన వ్యక్తం చేశారు. బేషరం రంగ్ పాట‌లో దీపిక పొట్టి దుస్తులు ఎక్స్ పోజింగ్ పై సాంస్కృతిక వాదులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.

చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ, "ఇది మా కాషాయ వేషం.. దీనిని సంస్కృతి బచావో మంచ్ సహించదు. షారుక్ ఖాన్,... హిందువులు మీ చిత్రాన్ని బహిష్కరించడం ప్రారంభించినప్పుడు మీకు వైష్ణో దేవి గుర్తుకు వచ్చింది. మీ చిత్రం విడుదలకు ముందు మీరు వైష్ణోదేవి గుడికి వెళుతున్నారు. మీరు హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలి. భారతదేశ ప్రజలు మిమ్మల్ని సూపర్ స్టార్ గా మార్చారు కాబట్టి ఈ చిత్రం నుండి పాటను తొలగించాలి. షారుక్ ఖాన్ మీరు ఎల్లప్పుడూ ఇలాంటి పనులు చేస్తూ మీ ఇమేజ్ ను ఎందుకు దిగజార్చుకుంటున్నారు? మీరు సనాతన ధర్మాన్ని నమ్మే వారందరికీ క్షమాపణలు చెప్పాలి" అని వ్యాఖ్యానించారు. 'పఠాన్‌'ను చూడటానికి డబ్బు ఇవ్వడం కంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిద‌ని ఇటీవ‌ల‌ షారూఖ్ ఖాన్- దీపికపై మండిప‌డుతూ బీజేపీ ఎమ్మెల్యే దూషించ‌డం మ‌రో కొస‌మెరుపు. ప‌ఠాన్ జనవరి 25న హిందీ- తమిళం- తెలుగు భాషల్లో విడుదల కానుంది. కింగ్ ఖాన్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తుండ‌గా తాజా వివాదాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.