Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

By:  Tupaki Desk   |   16 Sep 2022 8:50 AM GMT
మూవీ రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
X
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ

న‌టీన‌టులు: సుధీర్ బాబు-కృతి శెట్టి-వెన్నెల కిషోర్-రాహుల్ రామ‌కృష్ణ‌-అవ‌స‌రాల శ్రీనివాస్-శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం: పి.జి.విందా
నిర్మాత‌లు: మ‌హేంద్ర‌బాబు-కిరణ్ బొల్ల‌ప‌ల్లి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ‌

హీరో సుధీర్ బాబు-ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన 'స‌మ్మోహ‌నం' ప్రేక్ష‌కుల‌ను ఎంత స‌మ్మోహ‌న‌ప‌రిచిందో తెలిసిందే. మ‌ళ్లీ వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఏమేర అంచ‌నాల‌ను అందుకుందో చూద్దాం ప‌దండి.

క‌థ‌:

న‌వీన్ (సుధీర్ బాబు) ఫిలిం ఇండ‌స్ట్రీలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న యువ ద‌ర్శ‌కుడు. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌తో హిట్లు మీద హిట్లు కొడుతున్న అత‌ను.. అనుకోకుండా త‌న చేతికి చిక్కిన ఒక అమ్మాయి షో రీల్ చూసి ఫిదా అయిపోయి త‌న‌నే క‌థానాయిక‌గా పెట్టి ఒక బ‌ల‌మైన లేడీ ఓరియెంటెడ్ క‌థ తీయాల‌ని అనుకుంటాడు. ఐతే ఊరూ పేరు తెలియ‌ని ఆ అమ్మాయి ఎవ‌రో తెలుసుకోవాల‌ని వేట మొద‌లుపెడ‌తాడు. త‌ను డాక్ట‌ర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుస్తుంది. కానీ త‌న‌తో పాటు త‌న త‌ల్లిదండ్రుల‌కూ సినిమాలంటే అస‌హ్యం. అందుకో బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. మ‌రి ఆ కార‌ణం ఏంటి.. అదేంటో తెలుసుకున్న న‌వీన్.. అలేఖ్య‌ను త‌న సినిమాకు ఒప్పించాడా.. సినిమా తీశాడా.. ఆమెతో అత‌డి ప్ర‌యాణం ఎక్క‌డిదాకా వెళ్లింది.. అన్న‌ది తెర‌మీదే చూసి తెలుసుకోవాలి.

క‌థ‌నం-విశ్లేష‌ణ‌:

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో ఏదో అలా అలా ఆడేసి వెళ్లిపోతుంటాయి. కానీ వాటి గొప్ప‌ద‌నం అప్పుడు చాలామందికి అర్థం కాదు. త‌ర్వాత టీవీలోనో.. ఓటీటీలోనో ఆ సినిమాలు చూస్తున్న‌పుడు ఇంత మంచి సినిమాను మ‌నం థియేట‌ర్ల‌లో ఎలా మిస్స‌య్యాం.. ఈ సినిమాకు రావాల్సినంత అప్రిసియేష‌న్ రాలేదేంటి.. జ‌రగాల్సినంత చ‌ర్చ జ‌ర‌గ‌లేదేంటి అనిపిస్తుంది. సుధీర్ బాబు-అదితి రావు హైద‌రి జంట‌గా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందించిన స‌మ్మోహ‌నం అలాంటి సినిమానే. థియేట‌ర్ల‌లో ఓ మోస్త‌రుగానే ఆడిన ఈ చిత్రం.. టీవీ, ఓటీటీ ప్రేక్ష‌కుల నుంచి గొప్ప స్పంద‌న తెచ్చుకుంది. క్లాసిక్ అనిపించుకుంది. ఇలాంటి సినిమా తీసిన ద‌ర్శ‌కుడు.. అదే హీరోతో.. మ‌ళ్లీ 'సినిమా' చుట్టూ తిరిగే సినిమా తీశాడంటే.. మ‌ళ్లీ అలాంటి బ‌ల‌మైన పాత్ర‌లు.. బ్యూటిఫుల్ మూమెంట్స్.. చక్క‌టి క‌థ‌.. చిక్క‌టి క‌థ‌నం ఆశిస్తాం. ఐతే స‌మ్మోహ‌నం అనేది స‌హ‌జంగా జ‌రిగిన ఒక అద్భుతం అయితే.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఒక అనుక‌ర‌ణ‌లా అనిపిస్తుందే త‌ప్ప ఇందులో జీవం క‌నిపించ‌దు. క‌థ వ‌ర‌కు ఇంద్ర‌గంటి కాస్త భిన్నంగానే ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. సాధార‌ణంగా సాగే క‌థ‌నం.. చాలా వ‌ర‌కు సీరియ‌స్ గా.. డ‌ల్లుగా సాగే స‌న్నివేశాలు ఈ చిత్రాన్ని కిందికి లాగేశాయి.

ఒక ప్రేమ‌క‌థ నుంచి ప్ర‌ధానంగా ఆశించేది లీడ్ పెయిర్ మ‌ధ్య కెమిస్ట్రీ.. కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్. స‌మ్మోహ‌నం చిత్రానికి అవే పెద్ద ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న ప్ర‌ధాన పాత్ర‌లు.. వాటి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌.. ఆ చిత్రాన్ని మ‌రో స్థాయిలో నిల‌బెట్టాయి. కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంలో.. లీడ్ పెయిర్ మ‌ధ్య కెమిస్ట్రీ అన్న‌దే వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నవి ఇందులో బూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌వు. ఇక కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నా స‌రే.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు అంత‌గా ఆక‌ట్టుకోదు. ద‌ర్శ‌కుడైన హీరో త‌న క‌థ‌కు స‌రిప‌డే అమ్మాయి హీరోయినే అని ఆమె వెంట ప‌డుతుంటాడు. ఆమె ఓ బ‌ల‌మైన కార‌ణంతో ముందు అత‌ణ్ని దూరం పెట్టి.. ఆ త‌ర్వాత ఒక రియ‌లైజేష‌న్ వ‌చ్చి త‌న సినిమా చేయ‌డానికి ఒప్పుకుంటుంది. ఐతే హీరోయిన్ సినిమాల‌ను అస‌హ్యంచుకోవ‌డానికి కార‌ణం ఏంటి.. తిరిగి ఆమె సినిమా చేయ‌డానికి ఎందుకు ఒప్పుకుంటుంది అన్న‌దే ఈ చిత్రంలో మెయిన్ పాయింట్. క‌థంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అది పూర్తిగా సీరియ‌స్ వ్య‌వ‌హారం కావ‌డం.. ట్రాజెడీతో ముడిప‌డి ఉండ‌డంతో క‌థాక‌థ‌నాలు కూడా అందుకు త‌గ్గ‌ట్లే భారంగా గ‌డుస్తాయి.

సీరియ‌స్ క‌థ‌లైనా స‌రే.. సంద‌ర్భోచితంగా వినోదం జోడించి ఎంట‌ర్టైన్ చేసే ఇంద్ర‌గంటి.. ఈసారి మాత్రం ఎక్కువ‌గా మెలో డ్రామా మీదే ఆధార‌ప‌డ్డాడు. సినిమాలో హీరో పాత్ర‌తో చెప్పించిన‌ట్లు డ్రామా కోసం ఎక్కువ ట్రై చేసి వినోదం గురించి ప‌ట్టించుకోలేదు. ఇంట‌ర్వెల్లో హీరోయిన్ పాత్ర‌కు సంబంధించిన ట్విస్టుకు ముందు వ‌ర‌కు చాలా ఫ్లాట్ గా న‌డుస్తుంది ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫిలిం ఇండ‌స్ట్రీలో చెడు పోక‌డ‌ల మీద సెటైర్లు వేస్తూ సోకాల్డ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గా హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపించినా.. ఆ త‌ర్వాత మాత్రం క‌థ పెద్ద‌గా ముందుకు క‌ద‌ల‌దు. అసంద‌ర్భంగా అనిపించిన‌ప్ప‌టికీ హీరో పాత్ర‌ను ఎలివేట్ చేయ‌డం కోసం పెట్టిన ఒక ఎమోష‌నల్ ఎపిసోడ్ మిన‌హాయిస్తే ప్ర‌థ‌మార్ధంలో ప్ర‌త్యేకంగా అనిపించే స‌న్నివేశాలు లేవు.

ఇక హీరోయిన్ పాత్ర‌కు ఇచ్చిన ట్విస్టు ఆ స‌మ‌యానికి ఆస‌క్తిక‌రంగా అనిపించినా.. ఆ ట్విస్టు త‌ర్వాత‌ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జ‌రిగి ఉంటుందో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. విషాద‌భ‌రితంగా సాగే ఫ్లాష్ బ్యాక్ సాగ‌తీత‌గా అనిపిస్తుంది. వ‌ర్థ‌మార్ధంలోకి వ‌చ్చాక అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర నేప‌థ్యంలో కొన్ని సీన్లు రిలీఫ్ ఇస్తాయి. కానీ క‌థ మాత్రం అనాస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్ర‌య‌త్నం పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు. వాళ్లిద్ద‌రూ ప్రేమికుల‌న్న భావ‌నే క‌ల‌గ‌దు. హీరోయిన్.. ఆమె త‌ల్లిదండ్రుల చుట్టూ తిరిగే సీన్లు సీరియ‌ల్ ను త‌ల‌పిస్తాయి. ఇక్క‌డ మెలో డ్రామా శ్రుతి మించిపోయింది. ఆఖ‌ర్లో హీరోయిన్ని పెట్టి హీరో తీసిన సినిమా స్క్రీనింగ్ నేప‌థ్యంలో న‌డిపిన క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. అది కొంత‌మేర ప్రేక్ష‌కుల‌ను ఉద్వేగానికి గురి చేస్తుంది. హార్ట్ ట‌చింగ్ గా అనిపిస్తుంది. కానీ అంత‌కుముందు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన సీన్లు సినిమాకు మైన‌స్ అయ్యాయి. ఓవ‌రాల్ గా చూస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇంద్ర‌గంటి స్థాయి సినిమా కాదు.

న‌టీన‌టులు:

స‌మ్మోహ‌నంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ సుధీర్ బాబు.. మ‌రోసారి త‌న పాత్ర‌ను ప‌రిణ‌తితో పోషించాడు. కానీ ఈసారి అత‌డి పాత్ర అంత ల‌వ‌బుల్ గా అనిపించ‌దు. సుధీర్ బాబు న‌ట‌న‌కు మాత్రం వంక పెట్ట‌డానికి లేదు. ప్ర‌థ‌మార్ధంలో వ‌చ్చే ఒక ఎమోష‌న‌ల్ సీన్లో సుధీర్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కృతి శెట్టి మిశ్ర‌మానుభూతిని క‌లిగిస్తుంది. కొన్నిసార్లు త‌న క్యూట్నెస్ తో ఆక‌ట్టుకునే ఆమె.. కొన్నిసార్లు చాలా సాధార‌ణంగా క‌నిపిస్తుంది. కృతి గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో చాలా మెరుగ్గా న‌టించింది కానీ.. త‌న ముఖంలో అవ‌స‌ర‌మైన స్థాయిలో హావ‌భావాలు ప‌ల‌క‌లేదు. స‌మ్మోహ‌నంలో అదితిని గుర్తు తెచ్చుకుంటే కృతి చాలా సాధార‌ణంగా క‌నిపిస్తుంది. వెన్నెల కిషోర్ త‌న వంతుగా కొన్ని న‌వ్వులు పంచాడు. రాహుల్ రామ‌కృష్ణకు పెద్దగా స్కోప్ లేదు. హీరోయిన్ త‌ల్లిదండ్రుల పాత్ర‌ల్లో శ్రీకాంత్ అయ్యంగార్.. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని బాగానే చేశారు. మిగ‌తా న‌టీన‌టులంతా ఓకే.

సాంకేతిక వ‌ర్గం:

ప్రేమ‌క‌థ‌కు పాట‌లు చాలా కీల‌కం. ఈ విష‌యంలో సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ నిరాశ‌ప‌రిచాడు. ఒక‌ట్రెండు పాట‌లు ప‌ర్వాలేద‌నిపిస్తాయి కానీ.. మ‌ల్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే స్థాయిలో అయితే లేవు. నేప‌థ్య సంగీతం ఓకే. పి.జి.విందా ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు సినిమాకు స‌రిప‌డా ఉన్నాయి. ఇక రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌.. త‌న‌కు న‌ప్ప‌ని వి లాంటి యాక్ష‌న్ మూవీతో డిజాస్ట‌ర్ ఎదుర్కొన్నాక.. తిరిగి త‌న కంఫ‌ర్ట్ జోన్లోకి వ‌చ్చాడు. కానీ ప్రేమ‌క‌థా చిత్రాల్లో తాను నెల‌కొల్పిన ప్ర‌మాణాల‌ను అందుకోలేక‌పోయాడు. క‌థ ప‌ర‌గా ఆయ‌న భిన్నంగానే ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. క‌థ‌నంతో ఎప్ప‌ట్లా మ్యాజిక్ చేయ‌లేక‌పోయ‌డు. ఆయ‌న మార్కు బ్యూటిఫుల్ మూమెంట్స్ లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్.

చివ‌ర‌గా: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. మ్యాజిక్ మిస్సింగ్

రేటింగ్: 2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre