Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: ఇంత‌మంది ఆడాళ్ల మ‌ధ్య ఎలా వేగావ‌య్యా?

By:  Tupaki Desk   |   27 Feb 2022 2:22 PM GMT
ట్రైల‌ర్ టాక్: ఇంత‌మంది ఆడాళ్ల మ‌ధ్య ఎలా వేగావ‌య్యా?
X
ఈరోజుల్లో పిల్ల‌ను వెత‌క‌డం అంటే ఆషామాషీ కాదు. స‌రైన ఈడు జోడు ఉన్న పిల్ల దొర‌కాలి అంటే చాలా గొప్ప క్వాలిటీస్ కావాలి. తెలివి తేట‌ల్లో ప‌ద్ధ‌తిలో మంచిత‌నంలో అన్నిటిలో మెరుగ్గా ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్న వ‌రుడిగా క‌నిపిస్తున్నాడు శ‌ర్వానంద్. అత‌డు త‌న బ్యాచిల‌ర్ షిప్ ని ప్రెజెంట్ చేస్తూ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` అంటున్నాడు.

ఆడ‌వాళ్ల సామ్రాజ్యంలో అత‌డి పాట్లు ఏమిట‌న్న‌ది ఈ సినిమాలో చూడ‌గ‌లం. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ఫ‌న్ తో నిండి ఉంది. ఇక ప్ర‌తి ఫ్రేమ్ లోనూ డ‌జ‌ను మంది ఆడ‌వాళ్లు క‌నిపించ‌డం విశేషం.

ఈ ట్రైల‌ర్ చూశాక మూడు విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. ఏ బ్యాచిల‌ర్ అయినా ఆడ‌వాళ్ల‌ను మెప్పించ‌డం అంత వీజీ కాదు. ప‌డి ప‌డి కాళ్ల మీద ప‌డి దండాలు పెట్టినా .. అణ‌కువ‌గా ప‌ద్ధ‌తిగా క‌నిపించాల‌ని ప్ర‌యత్నించినా లేదా వీకెండ్ లో అన్న‌వ‌రం అంత‌ర్వేది వెళ్లొస్తాన‌నేంత బుద్ధిగా ఉన్నా ఆడ‌వాళ్ల‌ను న‌మ్మించేయ‌డం అంత ఈజీ కానే కాద‌ని తెలుసుకున్నాడు శ‌ర్వా.

ట్రైల‌ర్ లో ఆడావాళ్ల కాళ్ల మీద ప‌డి ప‌డి మ‌రీ ఏంటిదీ? అనే రేంజులో మంచిత‌నం కురిపించాడు. ఇంత‌మంది ఆడాళ్ల మ‌ధ్య ఎలా వేగావ‌య్యా? అంటూ జాలి కురిపించేంత మంచి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఆడ‌వాళ్ల సామ్రాజ్యంలో బ్యాచిల‌ర్ పెళ్లి పాట్లు..! ఎలా సాగాయి? అన్న‌ది కూడా మ‌రో కొస‌మెరుపు. ఇక ఇందులో గీత గోవిందంలో గీత రేంజులో ర‌ష్మిక క‌టింగులు త‌క్కువేమీ కాదు. పాపం ప‌సోడు అలా వెంట‌ప‌డుతుంటే క‌నిక‌రించ‌ని అమ్మాయిగా క‌రుకుగా క‌నిపిస్తోంది. మ‌న‌సన్న‌దే లేని మ‌గువతో అత‌డి పాట్లేమిటో కూడా సినిమాలో చూడ‌గ‌ల‌మ‌ని భ‌రోసా క‌నిపించింది.

ఇక‌పోతే అమాయ‌కుడిలా ప‌ద్ధ‌తైన వాడిగా.. తాగుడు అయినా అల‌వాటు లేనివాడిగా.. ప‌డి ప‌డి దండాలు పెట్టేవాడిగా శ‌ర్వాలోని విల‌క్ష‌ణ‌త మ‌రోసారి బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక ట్రైల‌ర్ లోనే ఇన్ని కోణాలు ఆవిష్క‌రిస్తే సినిమా ఆద్యంతం ఇంకెంత‌గా ప‌డి ప‌డి దండాలు పెడ‌తాడో ఏమిటో అనిపించేలా ఉంది.

ఇక ప్ర‌తి ఫ్రేమ్ లో సీనియ‌ర్ న‌టీమ‌ణులు రాధిక‌- ఊర్వ‌శి-ఖుష్బూ త‌దిత‌రులు ప‌దిమంది క‌నిపిస్తున్నారు. దీనివ‌ల్ల కూడా ఆడ‌వాళ్ల సామ్రాజ్యం తెర‌పై నిండుగా ఆవిష్కృత‌మైంది. ఒక ర‌కంగా శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి- గీత గోవిందం క‌లిపి కొట్టారా? అన్న‌ట్టుగా ఉంది. నేరేష‌న్ మాత్రం కాస్త స్లోగా క‌నిపిస్తోంది.

ఈ చిత్రానికి నేను శైల‌జ .. చిత్ర‌ల‌హ‌రి.. రెడ్ వంటి చిత్రాల్ని తెర‌కెక్కించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ప్రేమ‌క‌థ‌ల్ని స్పెష‌ల్ టోన్ తో తెర‌కెక్కించే కిషోర్ తిరుమ‌ల ఆడ‌వాళ్లు అంటున్నారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే మంచి ఫ్యామిలీ లేడీ సెంటిమెంట్ సినిమా చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా క‌థా కంటెంట్ పై శ‌ర్వా అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీతో శ‌ర్వా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.