Begin typing your search above and press return to search.

పెళ్లికాని ఫస్ట్రేటెడ్ మగాళ్ల కోసం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ సాంగ్

By:  Tupaki Desk   |   4 Feb 2022 11:24 AM GMT
పెళ్లికాని ఫస్ట్రేటెడ్ మగాళ్ల కోసం ఆడవాళ్ళు మీకు జోహార్లు టైటిల్ సాంగ్
X
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న యువ హీరో శర్వానంద్ ఇప్పుడు ''ఆడవాళ్లు మీకు జోహార్'' అనే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ ట్రాక్‌ ని విడుదల చేయడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. ''హే లక్ష్మమ్మో పద్మమ్మో.. శాంతమ్మో శారదమ్మో.. గౌరమ్మో కృష్ణమ్మో.. నా పాటే వినవమ్మో..'' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. హీరో తన వైఫల్యాలకు కారణమైన ఆడవాళ్లందరిపై తన నిరాశను వ్యక్తం చేయడం ఈ పాటలో కనిపిస్తుంది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఆడవాళ్లే కారణమని ఆరోపిస్తున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ ను కంపోజ్ చేయడమే కాదు.. తనదైన శైలిలో ఆలపించారు. లిరిసిస్ట్ శ్రీమణి ఆడవాళ్లను నిందిస్తూ చమత్కారమైన సాహిత్యం అందించారు. ఈ పాటలో శర్వానంద్ వేసిన కొన్ని మాస్ డ్యాన్స్‌ లు ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఇందులో రష్మిక మందన్నతో సహా సినిమాలోని ప్రధాన మహిళా పాత్రధారులను చూడొచ్చు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకోగా.. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ ట్రాక్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. మరి ఈ నెల చివరి వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.