Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఆడవాళ్ళు మీకు జోహార్లు

By:  Tupaki Desk   |   4 March 2022 6:29 PM GMT
మూవీ రివ్యూ : ఆడవాళ్ళు మీకు జోహార్లు
X
చిత్రం : ఆడవాళ్ళు మీకు జోహార్లు

నటీనటులు: శర్వానంద్-రష్మిక మందన్నా-ఖుష్బు-రాధిక-ఊర్వశి-వెన్నెల కిషోర్-సత్య-ప్రదీప్ రావత్-రవిశంకర్-ఝాన్సీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజీత్ సారంగ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల

వరుస పరాజయాలతో సతమతం అవుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం ప్రోమోల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

చిరంజీవి అలియాస్ చిరు (శర్వానంద్) ఉమ్మడి కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగిన కుర్రాడు. తల్లితో పాటు ఆమె తోడి కోడళ్లు కూడా అతణ్ని కొడుకులాగే చేసుకుంటారు. ఒక కళ్యాణమండపాన్ని నడిపే చిరుకు వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. ప్రతి అమ్మాయికీ ఏదో వంక చెప్పి అతడి అమ్మలే పెళ్లి ఆలస్యానికి కారణమవుతుంటారు. ఆ స్థితిలో అనుకోకుండా ఆద్య (రష్మిక మందన్నా) పరిచయమై.. ఆమెతో ప్రేమలో పడతాడు చిరు. కానీ ఆద్య తల్లికి పెళ్లి పట్ల సరైన అభిప్రాయం ఉండదు. తల్లి అభీష్టానికి వ్యతిరేకంగా చిరును పెళ్లి చేసుకోలేనని చెప్పేస్తుంది ఆద్య. ఈ స్థితిలో చిరు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఆడవాళ్ళు మీకు జోహార్లు.. మామూలుగా ఈ టైటిల్ చూస్తే ఇదేదో మహిళా సాధికారత మీద తీసిన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఏమో అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో మహిళలు.. వారి కష్టాలు కన్నీళ్ల మీద సినిమాలు తీస్తే మహిళా ప్రేక్షకులే థియేటర్లకు వచ్చి చూడటం కష్టం. ఇప్పుడు కావాల్సిందల్లా ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ట్రైలర్ చూస్తే ఇది వినోద ప్రధానంగా సాగే చిత్రం లాగే అనిపించింది. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన ఒక్కగానొక్క అబ్బాయిని.. ఆ కుటుంబంలోని ఆడవాళ్ళంతా కలిసి అమ్మల్లాగే పెంచుతూ.. అతడి మీద అతి ప్రేమతో.. పెళ్ళి చూపులకు వెళ్లిన ప్రతి అమ్మాయిలోనూ లోపాలు వెతికి అతడికి పెళ్లి కాకుండా అడ్డు పడటం అనే కాన్సెప్ట్ ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని చుట్టూ ఏ స్థాయిలో వినోదం పండిస్తారో చూద్దామన్న కుతూహలం కలిగింది. ఐతే చాలా సినిమాలతో ఉన్న సమస్య ఏంటంటే.. ఇలా ట్రైలర్లో ఆకర్షించే పాయింట్ ను సినిమా ఆరంభ సన్నివేశాల వరకు చూపించి.. కొంతమేర ఎంటర్టైన్ చేసి వదిలేస్తారు. ఆపై కథ రొటీన్ గా.. ఇంకో రూట్లోకి వెళ్లిపోతుంది. తర్వాత షరా మామూలే. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో కూడా సరిగ్గా అదే జరిగింది. ఒక దశ వరకు సరదాగా అనిపించే సినిమా.. ఆ తర్వాత రొటీన్ టెంప్లేట్లోకి వెళ్లిపోయి.. ఓవర్ డోస్ మెలోడ్రామాతో నిరాశకు గురి చేస్తుంది. మంచి సినిమాలా మొదలై.. చివరికి ఒక సీరియల్ లాగా ముగియడం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో మైనస్.

‘నేను శైలజ’తో ఆశ్చర్యపరిచిన కిషోర్ తిరుమల.. ఆ తర్వాత తీసిన సినిమాలతో అంచనాలను అందుకోలేకపోయాడు. అతడి చిత్రాలు ఒక దశ వరకు పర్వాలేదనే అనిపిస్తాయి. కామెడీ-డ్రామాను బ్యాలెన్స్ చేస్తూ కొంత వరకు తన కథల్ని బాగానే నడిపిస్తాడు. కానీ కథను మధ్యలో ఒక మలుపు తిప్పాక.. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లడంలో తడబడుతుంటాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’.. ఈ రెండు చిత్రాలతోనూ ఇదే సమస్య. వాటిలో ఉన్నట్లుండి ఊపంతా తగ్గిపోయి కథనం నిస్సారంగా సాగినట్లే.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లోనూ జరిగింది. ప్రథమార్ధం వరకు ఈ సినిమా బాగానే ఎంగేజ్ చేస్తుంది. మరీ ఆశ్చర్యపరిచే.. కొత్తగా అనిపించే సన్నివేశాలు లేకపోయినా.. వినోదానికైతే ఢోకా లేదు. ట్రైలర్లో ఫన్నీగా అనిపించిన హీరో పెళ్ళిచూపుల కాన్సెప్ట్ వరకు కిషోర్ బాగానే డీల్ చేశాడు. ‘మల్లీశ్వరి’లో పెళ్ళి కాని ప్రసాద్ ను గుర్తుకు తెచ్చేలా సాగే హీరో పాత్ర ఆకట్టుకుంటుంది. తన అమ్మలతో కలిసి అతను చేసే హంగామా వినోదాన్ని పంచుతుంది. తొలి 20 నిమిషాల్లో ఈ హంగామా అయ్యాక హీరోయిన్ రంగ ప్రవేశం చేస్తుంది. అక్కడి నుంచి ప్రేమకథను సింపుల్ గా.. సరదాగా నడిపిస్తూ కాలక్షేపం బాగానే చేయించాడు దర్శకుడు. ఏ ప్రేమకథకైనా సమస్య ఎదురైతేనే కదా.. కథ ముందుకు సాగాలి. ద్వితీయార్ధంలో అదే జరుగుతుంది. పెళ్లంటే అస్సలు పడని హీరోయిన్ తల్లి రూపంలో సమస్య తలెత్తుతుంది. ఈ ట్విస్టు ఇచ్చాక కూడా ఇంటర్వెల్ దగ్గర కిషోర్ తిరుమల తనదైన చమత్కారంతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు.

ఇలా ఒక పాజిటివ్ ఫీల్ తో విరామానికి వెళ్లే ప్రేక్షకుడిలో ఆ ఫీల్ మొత్తం పోయేలా నడుస్తుంది ద్వితీయార్ధం. తన పెళ్లికి హీరోయిన్ కుటుంబంలో సమస్య తలెత్తితే.. హీరో తన ఐడెంటిటీని దాచిపెట్టి ఆ కుటుంబంలోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకునే కథలు ఎన్ని చూశామో లెక్కే లేదు. చాలా ఏళ్ల కిందటే ఈ కథలు అరిగిపోయి పక్కన పెట్టేశారు. సన్నివేశాలు ఎంత మార్చినా ఇది పరమ రొటీన్ గా అనిపించే వ్యవహారం. కానీ కిషోర్ అదే బాటలో నడిచి ‘ఆడవాళ్ళు..’ను ట్రాక్ తప్పించేశాడు. హీరో తన మంచి తనం చూపిస్తూ.. సమస్యలు పరిష్కరించే వైనం మరీ నాటకీయంగా అనిపిస్తుంది. ఎక్కడా ఎమోషన్ అనుకున్నట్లుగా పండలేదు. ఇదే నిరాశ కలిగించే విషయం అంటే.. సినిమాకు ఇచ్చిన ముగింపు అయితే మరీ డ్రమటిగ్గా అనిపిస్తుంది. మనం చూస్తున్నది సినిమానా.. సీరియలా అనిపించేలా.. విపరీతమైన నాటకీయతతో.. సెంటిమెంట్ డైలాగులతో నడిచే పతాక సన్నివేశాలు ఉస్సూరుమనిపిస్తాయి. గుండె బరువెక్కించడానికి ఉద్దేశించిన ఆ సన్నివేశాలు వెటకారపు నవ్వుల్నే మిగులుస్తాయి. అంతకుముందు వరకు రొటీన్ అనిపించిన సన్నివేశాలను కూడా తట్టుకోగలం కానీ.. వీటిని భరించడం మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ సీన్లు.. కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు.. డైలాగ్స్ సంతృప్తినిచ్చినా.. ద్వితీయార్ధంలో రొటీన్ బాట పట్టే కథాకథనాలు.. ఓవర్ డోస్ మెలో డ్రామా.. సీరియల్ తరహా ముగింపు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’కు ప్రతికూలంగా మారాయి. కుటుంబ ప్రేక్షకులు కాలక్షేపానికైతే ఒకసారి చూడొచ్చు కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టం.


నటీనటులు:

వరుసగా తన సినిమాలు నిరాశ పరుస్తున్నా శర్వానంద్ ఏమీ కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. చాలా ఉత్సాహంగా చిరు పాత్రను చేసుకుపోయాడు. ఈ పాత్ర సరదాగా సాగినంత సేపూ శర్వా ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో ‘రన్ రాజా రన్’ను గుర్తు చేసేలా నటించాడు శర్వా. సీరియస్ సన్నివేశాల్లో మాత్రం మామూలుగానే కనిపించాడు. రష్మిక మందన్నా చాలా అందంగా కనిపించిందీ చిత్రంలో. నటన కూడా ఓకే. ఖుష్బు కీలక పాత్రలో హుందాగా నటించింది. ఊర్వశి ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంది. ఆ తరహా తింగరితనంతో నవ్వించడం అంత తేలిక కాదు. సినిమాలో ఆమె పాత్ర మేజర్ రిలీఫ్ అని చెప్పాలి. వెన్నెల కిషోర్ మూణ్నాలుగు సన్నివేశాల్లో బాగానే నవ్వులు పంచాడు. రాధిక.. రవిశంకర్.. ఝాన్సీ.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సే. ఓ మై ఆద్య.. ఆసమ్.. పాటలు వినసొంపుగా అనిపిస్తాయి. టైటిల్ సాంగ్ కూడా బాగానే సాగింది. నేపథ్య సంగీతం కూడా ఓకే. సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా కలర్ ఫుల్ గా అనిపించేలా విజువల్స్ తో సపోర్ట్ చేశాడు. యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు బాగానే పాటించాడు. సినిమా మంచి క్వాలిటీతోనే తెరకెక్కింది. ఐతే అన్ని వనరులూ బాగానే సమకూరినా.. దర్శకుడు కిషోర్ తిరుమల వీటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. బలహీన కథాకథనాలతో నిరాశ పరిచాడు. కామెడీ సీన్లను బాగానే డీల్ చేసినా.. డైలాగ్స్ వరకు ఆకట్టుకున్నా.. అతడి కథాకథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఆశ్చర్యపరిచే అంశాలు లేవు. పాత కథల్నే తిప్పి తిప్పి తీసే శైలిని అతను వదిలి పెడితే మంచిది.

చిరవగా: కొన్ని నవ్వులు.. కొన్ని నిట్టూర్పులు

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre