Begin typing your search above and press return to search.

పోలీస్‌ స్టోరి అగ్ని నిన్ను పూనాలి ఆది!!

By:  Tupaki Desk   |   4 March 2019 9:27 AM GMT
పోలీస్‌ స్టోరి అగ్ని నిన్ను పూనాలి ఆది!!
X
ఆది సాయికుమార్... డైలాగ్ కింగ్ వార‌సుడు.. కెరీర్ ప్రారంభించి ఇప్ప‌టికే ఏడేళ్లు అవుతోంది. 2022 నాటికి ద‌శాబ్ధం కెరీర్ పూర్త‌వుతుంది. ఇన్నేళ్ల‌లో ఈ యంగ్ హీరో సాధించింది.. ఏంటి? తాత శ‌ర్మ గారి పేరును - డాడ్ సాయి కుమార్ పేరును నిల‌బెట్టాడా? అంటే .. ఇంకా సందిగ్ధ‌త నెల‌కొంది. అత‌డేమీ సినీ నేప‌థ్యం లేకుండా అనామ‌క కుటుంబం నుంచి రాలేదు. త‌న‌కంటూ ఓ స్టామినా ఉంది. లెగ‌సీ ఉంది. అయితే కాపాడాల్సిన బాధ్య‌త కూడా అంతే ఇదిగా ఉంది. ఎంచుకునే స్క్రిప్ట్.. న‌టించే స్టైల్ లో గ్రేస్ .. ప్ర‌తిదీ ప్ర‌త్యేకంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డితే ఆ ఒక్క లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మేమీ కాదు. ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తున్నాడు.. ఫెయిల‌వుతున్నాడు.. రైజ్ అన్న‌దే క‌నిపించ‌డం లేద‌న్న బెంగ అభిమానుల్లో ఉంది.

సాయికుమార్ ఫ్యామిలీకి డ‌బ్బింగ్ క‌ళాకారులుగా - న‌టులుగా బోలెడంత గ్రిప్ ఉంది. ఆ ఫ్యామిలీకి ఇండ‌స్ట్రీలో 30 ఏళ్ల చ‌రిత్ర ఉంది. కేవ‌లం తెలుగు లోనే కాదు క‌న్న‌డ‌ - త‌మిళంలోనూ చ‌క్క‌ని పేరు ఉంది. బాలీవుడ్ లోనూ గుర్తు ప‌డ‌తారు. పోలీస్ స్టోరి వంటి ఛాలెంజింగ్ మూవీలో సాయికుమార్ ఎమోష‌నల్ పెర్ఫామెన్స్ ప‌దే ప‌దే అభిమానులు ప్ర‌స్థావిస్తారు. 2011లో ప్రేమ కావాలి చిత్రంతో సినీఆరంగేట్రం చేసిన ఆది ల‌వ్ లీ - గాలిప‌టం వంటి చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. కానీ ఎక్క‌డో ట్రిగ్గ‌ర్ నొక్కినా బుల్లెట్టు మిస్స‌వుతోంది. టార్గెట్ ని ఛేధించ‌లేక‌పోతున్నాడు. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌.. ఎన్ ఎస్‌ జీ క‌మెండో అంటూ బ‌రిలో దిగాడు. ఈ ఆప‌రేష‌న్ ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస‌వుతుంది? ఆది పాత్ర ఎలా ఉంటుంది? సాయికిర‌ణ్ అడివి ఈ చిత్రాన్ని ఎలా రూపొందించాడు? అన్న‌ది తెలియాలంటే మ‌రికాస్త స‌మ‌యం ఆగాల్సిందే.

టీజ‌ర్ లాంచ్ చేసి మ‌హేష్ ప్ర‌మోష‌న‌ల్ సాయం చేశాడు. క్రాస్ జోన‌ర్‌ లో యాక్ష‌న్ - రొమాంటిక్ కామెడీ అంశాల‌ను మేళ‌వించి ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని సాయికిరణ్ తెలిపారు. భార‌తీయ తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ క‌థ‌ను ట‌చ్ చేయ‌లేద‌నేసారు. ఎన్‌.ఎస్‌.జీ క‌మెండో పాత్ర‌కు ఆది ఒప్పుకుంటాడో లేదోన‌ని భ‌య‌ప‌డ్డామ‌ని అన్నారు. మొత్తానికి ఆది ఒప్పుకున్నాడు. ల‌వ‌ర్‌ బాయ్ పాత్ర‌లు చేసిన నాకు ఎన్ ఎస్‌ జీ క‌మాండో లుక్ సెట్ అవుతుందో లేదో అనిపించింది. నాన్న ఈ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేశారు. ఆయ‌న క‌థ విని నాకు ఈ పాత్ర బాగుంటుంద‌ని చెప్పారు. లుక్ టెస్ట్ చేయ‌గానే ధైర్యం వ‌చ్చింది. ఈ పాత్ర నాకు స‌రిపోతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నా పాత్ర‌కు హీరోయిన్‌ - పాట‌లు ఏవీ ఉండ‌వు. క‌శ్మీర్ పండిట్‌ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా క‌నిపిస్తాను. య‌థార్థ అంశాల స్ఫూర్తితో నిజాయితీగా ఈ సినిమా చేశాం. న‌వ్య‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన చిత్రాల్ని ప్రేక్ష‌కులు విజ‌య‌వంతం చేస్తున్నారు. మా సినిమాను ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. 1980 నాటి కాలంలో క‌శ్మీర్ పండిట్ కుటుంబాల‌కు జ‌రిగిన అన్యాయాన్ని చ‌ర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవ‌ల అలాంటి ఘ‌ట‌న‌లే మ‌ళ్లీ క‌శ్మీర్‌లో జ‌ర‌గ‌డం బాధ‌ను క‌లిగించింది అని ఆది అన‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఆది ఆప‌రేష‌న్ ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌ల‌మ‌వుతుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. క‌మెండో పాత్ర అంటే సాయికుమార్ హై ప‌వ‌ర్ పిచ్ వాయిస్ లో.. న‌ట‌న‌లో.. ఎమోష‌న్స్ లో చూపించాల్సి ఉంటుంది. లేదంటే అభిమానులు నిర‌భ్యంత‌రంగా తిర‌స్క‌రించ‌డం ఖాయం. మ‌రి ఆది ఎంత జాగ్ర‌త్త తీసుకున్నాడో చూడాలి. పోలీస్‌ స్టోరి అగ్ని నిన్ను పూనాలి ఆది!!