Begin typing your search above and press return to search.

కుర్రాడి కష్టం ఫలిస్తుందా?

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:30 AM GMT
కుర్రాడి కష్టం ఫలిస్తుందా?
X
ఈ తరం యువ కథానాయకులంతా సినిమా కోసం ఎంత కష్టానికైనా వెనకాడట్లేదు. క్రికెటర్ కాబోయి సినిమా హీరో అయిన సాయికుమార్ తనయుడు ఆది కూడా అంతే. 20 ఏళ్ల వయసొచ్చే వరకు క్రికెట్లోనే కొనసాగిన ఆది.. సడెన్ గా తండ్రి వారసత్వాన్ని అందుకుని సినిమాల్లోకి అడుగుపెట్టేశాడు. ఐతే రావడం ఊరికే రాలేదు. డ్యాన్సుల్లో - ఫైట్లలో ఏ యంగ్ హీరోకూ తీసిపోని విధంగా పక్కాగా రెడీ అయి వచ్చాడు. తొలి సినిమా ‘ప్రేమ కావాలి’తోనే డ్యాన్సులు - ఫైట్లు - యాక్టింగ్ లో చాలా ఈజ్ చూపించాడు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆదికి శుభారంభమే లభించింది. రెండో సినిమా ‘లవ్లీ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆది.. ఇక తెలుగు సినిమాల్లో దూసుకెళ్లిపోతాడని అంతా అనుకున్నారు.

కానీ తర్వాత అతడికి బ్రేకులు పడ్డాయి. మంచి అంచనాలతో వచ్చిన ‘సుకుమారుడు’తో పాటు ప్యార్ మే పడిపోయానే - గాలిపటం - రఫ్ లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. ‘రఫ్’ కోసం సిక్స్ ప్యాక్ కూడా పెంచి పడ్డ కష్టం ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘గరం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఆది. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైనా కుర్రాడిలో ఏమాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదని ‘గరం’ టీజర్ - ట్రైలర్ అవీ చూస్తుంటే అర్థమవుతోంది.

బాడీతో పాటు బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ అన్నీ మార్చుకుని బాగానే కష్టపడ్డట్లున్నాడు ఆది. పెళ్లైన కొత్తలో - ప్రవరాఖ్యుడు లాంటి క్లాస్ సినిమాలు తీసిన మదన్ ‘గరం’ లాంటి మాస్ మూవీకి దర్శకత్వం వహించడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రాన్ని ఆది తండ్రి సాయికుమారే స్వయంగా నిర్మించడం విశేషం. ‘గరం’ పక్కా మాస్ మసాలా మూవీ అని.. హీరో క్యారెక్టరైజేషన్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని ప్రోమోస్ చూస్తే తెలుస్తోంది. ఆది గత సినిమాలతో పోలిస్తే ‘గరం’ మీద పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఈ శుక్రవారం భారీ స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఆదికి అత్యావశ్యమైన సక్సెస్ ను ‘గరం’ ఫలిస్తుందా?