Begin typing your search above and press return to search.

ఆవిడ ఏడుపు చూసి ఎంతో నేర్చుకున్నా

By:  Tupaki Desk   |   3 April 2018 11:56 AM GMT
ఆవిడ ఏడుపు చూసి ఎంతో నేర్చుకున్నా
X
‘రంగ‌స్థ‌లం’ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టిస్తుండ‌డంతో చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది చిత్ర బృందం. ఈ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు - రామ‌ల‌క్ష్మీగా స‌మంత హావ‌భావాల‌కు ఎంత మంచి పేరు వ‌చ్చిందో... చిట్టిబాబు అన్న కుమార్ బాబుగా న‌టించిన ఆది పినిశెట్టికి కూడా అదే స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

సినిమాకు వ‌స్తున్న‌స్పంద‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ... మీడియాతో స‌మావేశ‌మ‌య్యాడు ఆది పినిశెట్టి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ‘‘ఒక మ‌నిషి చ‌నిపోయినప్పుడు... అత‌ని చుట్టూ ఉండేవాళ్ల ప‌రిస్థితి ఏ విధంగా ఉంటుంద‌నే విష‌యం నాకు ఈ సినిమా చేసిన త‌ర్వాతే తెలిసింది. పెద్ద కొడుకు చ‌నిపోతే... ఎలా ఏడుస్తారో జీవించి చూపించారు న‌రేష్ గారు... రోహిణి గారు. రోహిణి గారిక‌యితే ఆ సీన్ చేస్తున్న‌ప్పుడు రెండో రోజే... ఏడిచి... ఏడిచి ఆవిడ గొంతు పోయింది. అంత‌లా ఇన్వాల్ అయ్యారామె. నాకు పాపం అనిపించి ‘ఎందుక‌మ్మా...నిజంగా ఏడుస్తారు... ఏడుస్తున్న‌ట్టు న‌టించొచ్చు క‌దా’ అని అడిగాను. దానికావిడ చెప్పిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య‌మేసింది. ర‌ఘువ‌ర‌న్ చ‌నిపోయిన‌ప్పుడు ఎలా అనిపించిందో... ఆ ఫీలింగ్‌ ని సినిమాలో చూపించారావిడ‌. మ‌నిషి చ‌నిపోయిన‌ప్పుడు, ఆ వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌గా ఉండే వాళ్లు ప‌డే బాధ క‌నిపించాల‌ని అంత క‌ష్ట‌ప‌డ్డారు...’’అంటూ చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి.

సీనియ‌ర్లు చూపించిన ఇన్వాల్ మెంట్ వ‌ల్లే న‌ట‌న‌లో మ‌రింతగా క‌ష్ట‌ప‌డ‌డం నేర్చుకున్నానని చెప్పాడు ఆది పినిశెట్టి. ‘స‌రైనోడు’ సినిమాలో త‌న‌లోని విల‌నిజం చూపించిన ఆది... ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘నిన్ను కోరి’ సినిమాలో త‌న‌లోని సాఫ్ట్ యాంగిల్ ను ప‌రిచ‌యం చేశాడు. ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా చేయ‌గ‌ల‌డ‌ని కుమార్ బాబు పాత్ర‌తో నిరూపించుకున్నాడు.