Begin typing your search above and press return to search.

మరీ ఇలా తయారయ్యవేంటి అమీరూ..

By:  Tupaki Desk   |   3 Aug 2015 9:30 AM GMT
మరీ ఇలా తయారయ్యవేంటి అమీరూ..
X
అమీర్ ఖాన్ కు మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు ఊరికే రాలేదు. ఆయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలే ఆయనకా పేరు తెచ్చిపెట్టాయి. గత ఐదారు సినిమాల్ని వరుసలో పెట్టి చూస్తే.. ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. ఆ సినిమాల్లో పాత్రలే కనిపిస్తాయి తప్ప, అమీర్ కనిపించడు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మలుచుకుంటాడు అమీర్. పీకేలో సరికొత్త అవతారం కనిపించిన అమీర్.. ఇప్పుడు ‘దంగల్’ అనే సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ఆరు నెలల ముందు నుంచే కసరత్తులు మొదలుపెట్టేశాడు అమీర్. కసరత్తులంటే జిమ్ కు వెళ్లి కండలు పెంచుతున్నారనుకునేరు.

ఆయన చేస్తున్న కసరత్తంతా అదే పనిగా తినడమే. దంగల్ పాత్ర కోసం అమీర్ రెండు భిన్నమైన అవతారాల్లో కనిపించాల్సి ఉంది. ఒకటి భారీ శరీరంతో, ఇంకోటి కండలు తిరిగిన రెజ్లర్ గా. దీని కోసం అమీర్ కొన్ని నెలలుగా బాగా మెక్కే పనిలో ఉన్నాడు. కొన్ని నెలల కిందటే అమీర్ బాగా బరువెక్కి కనిపించాడు. తాజాగా ప్రొ కబడ్డీ లీగ్ కోసం వచ్చినపుడు మిస్టర్ పర్ఫెక్షనిస్టుని చూస్తే జనాలకు మతిపోయింది. ముందున్న దానికంటే పాతిక కిలోల దాకా బరువెక్కి దగ్గర దగ్గర వంద కిలోలకు టచ్ అవుతున్నట్లు కనిపించాడు అమీర్. ఓవైపు పాత్ర కోసం శారీరకంగా తయారవడమే కాదు.. పొగట్ జీవితాన్ని ఆకళింపు చేసుకోవడం కోసం అతడి కుటుంబ సభ్యుల్నీ కలుస్తున్నాడు అమీర్. పొగట్ కూతుళ్లు, ప్రస్తుతం రెజ్లింగ్ లో ఉన్న బబిత, గీతలను కలిసి వారి తండ్రి గురించి, వాళ్ల కెరీర్ గురించి తెలుచుకుని వచ్చాడు అమీర్. మొత్తానికి తానేం చేసినా అందులో ఎంత కమిట్మెంట్, రీసెర్చ్ ఉంటుందని మరోసారి చాటుతున్నాడు అమీర్. ఈ బరువెక్కిన అవతారంలో నాలుగు నెలలు షూటింగ్ చేశాక.. మళ్లీ మునుపటిలా కండలతో కనిపించడానికి కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు అమీర్. అతడి కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.