Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ఆటాడుకుందాం రా’

By:  Tupaki Desk   |   19 Aug 2016 10:50 AM GMT
మూవీ రివ్యూ :  ‘ఆటాడుకుందాం రా’
X
చిత్రం : ‘ఆటాడుకుందాం రా’

నటీనటులు: సుశాంత్ - సోనమ్ - మురళీ శర్మ - పోసాని కృష్ణమురళి - బ్రహ్మానందం - పృథ్వీ - వెన్నెల కిషోర్ - రఘుబాబు - సుధ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: దాశరథి శైలేంద్ర
కథ - మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాతలు: నాగసుశీల - చింతలపూడి శ్రీనివాసరావు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

హీరోగా నిలదొక్కుకోవాలని దశాబ్దం నుంచి ప్రయత్నిస్తున్నాడు నాగార్జున మేనల్లుడు సుశాంత్. కానీ హీరోగా అతడి తొలి మూడు సినిమాల్లో ఏదీ అతడి కోరిక తీర్చలేదు. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని కామెడీ చిత్రాల స్పెషలిస్టు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా’ చేశాడు. మరి ఈ చిత్రమైనా సుశాంత్ కోరిక తీర్చేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

విజయ రాజారాం (మురళీ శర్మ) వ్యాపారంలో మంచి స్థాయిలో ఉండగా శత్రువులు కొట్టిన దెబ్బకు కుదేలవుతాడు. తన మిత్రుడు ఆనంద ప్రసాదరావు (ఆనంద్) కూడా శత్రువులతో కలిసి తనను మోసం చేశాడని అపార్థం చేసుకున్న రాజారాం.. అతణ్ని అసహ్యించుకుంటాడు. వ్యాపారంలో నష్టపోయాక ఓ రైస్ మిల్ మీద ఆధారపడి కుటుంబాన్ని నడుపుతున్న రాజారాం.. కొన్నేళ్ల తర్వాత తన తమ్ముడి కూతురి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. అందుకోసం రైస్ మిల్ అమ్మడానికి రెడీ అయిన రాజారాం.. తన మాట వినకుండా వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన చెల్లెలి కొడుకును సంతకం కోసం ఇంటికి రప్పిస్తాడు. అతనే కార్తీక్ (సుశాంత్). అతనొచ్చాక రాజారాం కుటుంబంలో సమస్యలన్నీ ఒక్కొక్కటే పరిష్కారమవుతాయి. రాజారాం కూతురు (సోనమ్) అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే ఓ సందర్భంలో ఆమెకు కార్తీక్ అసలు తన మేనత్త కొడుకే కాదని తెలుస్తుంది. ఇంతకీ కార్తీక్ ఎవరు.. అతనెందుకు రాజారాం కుటుంబంలోకి వచ్చాడు.. రాజారాంను మోసం చేసిన వాళ్లకు అతను ఎలా బుద్ధి చెప్పాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హిట్టు కోసం డిప్రెషన్లో ఉన్న హీరోలు సాహసాలు చేయడానికి సిద్ధపడరు. హిట్టు ఫార్ములాను పట్టుకుని సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తారు. సుశాంత్ కూడా అదే చేశాడు. కాకపోతే అతను పట్టుకున్న ‘ఫార్ములా’ మరీ ఔట్ డేట్ అయిపోయింది. తనను అసహ్యించుకునే కుటుంబంలోకి హీరో వచ్చి.. వాళ్ల సమస్యలన్నింటినీ తీర్చి వాళ్లతో కలిసిపోవడం అన్నది ఎప్పుడో ‘కలిసుందాం రా’ నుంచి చూస్తున్న ఫార్ములా. విలన్ దగ్గర అతడి రహస్యాలన్నీ తెలిసిన అసిస్టెంటు ఉంటే.. అతణ్ని బకరాను చేసి విలన్ ఆటకట్టించే ఫార్ములా ‘రెడీ’ నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ రెండు ఫార్ములాల్ని ఇటు అటు తిప్పికొడితే.. అదే ‘ఆటాడుకుందాం రా’.

కథ విషయంలోనే కాదు.. పాత్రల చిత్రణ.. కామెడీ.. పాటలు.. రొమాన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ అనుకరణే కనిపిస్తుంది ‘ఆటాడుకుందాం రా’లో. కామెడీ అయితే మరీ రొటీన్. ప్రథమార్ధంలో పృథ్వీని వాడేసుకున్న హీరో.. ద్వితీయార్ధంలో ‘వాడకానికి’ బ్రాండ్ అంబాసిడర్ అయిన బ్రహ్మీని బుట్టలో వేస్తాడు. ఎప్పట్లాగే ముందు బ్రహ్మిని మేధావిలాగా పరిచయం చేయడం.. ఆ తర్వాత అతణ్ని ఫుల్లుగా వాడేసుకోవడం.. ఇలా పరమ రొటీన్ గా సాగిపోతుంది కామెడీ వ్యవహారమంతా. కాకపోతే టైమ్ మెషీన్ పేరుతో కొంచెం కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు.

టైమ్ మెషీన్లో ప్రయాణం చేయడం అన్నది పాయింట్ పక్కనబెట్టేస్తే ఆ ప్రయాణం తర్వాత వచ్చే కామెడీ అంతా ప‌ర‌మ‌ రొటీన్ గానే సాగిపోతుంది. పృథ్వీ విషయంలో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ క్యారెక్టర్ స్ఫూర్తి కనిపిస్తుంది. ‘లౌక్యం’లో పృథ్వీ సీరియల్ నటుడైతే.. ఇందులో డైరెక్టర్.. అంతే తేడా. ఐతే పృథ్వీ.. బ్రహ్మి ఇద్దరూ కూడా తమ స్థాయిలో విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు కానీ... న‌వ్వులు పండ‌లేదు. కమెడియన్లు సపోర్టిచ్చినంతగా కూడా సినిమాకు హీరో బలంగా నిలవలేకపోయాడు. ఆ పాత్రను మ‌రీ పేల‌వంగా తీర్చిదిద్దారు.

హీరో హీరోయిన్ల ట్రాక్ పూర్తిగా మొక్కుబడి వ్యవహారం. వారి మధ్య గిల్లికజ్జాలు.. రొమాన్స్.. పాటలు.. అన్నీ స్టీరియో టైపులో ఉంటాయి. ఆ సమయానికి పాట రావాలంటే పాట రావాలి.. దాని కోసం ఇద్దరి మధ్య ముందో రొమాంటిక్ సీన్ ఉండాలి అన్నట్లు సాగుతుంది వ్యవహారం. సినిమాలో అక్కినేని ఫ్యామిలీ లెగసీని కూడా ఫుల్లుగా వాడుకోవడానికి ప్రయత్నించాడు సుశాంత్. మామూలుగా ఈ విషయంలో అక్కినేని మిగతా హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు కానీ.. సుశాంత్ మాత్రం ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకు అక్కినేని ఫ్యామిలీ హీరోలందరినీ తెరమీదికి తెచ్చాడు. చాలా సన్నివేశాల్లో వారి ప్రస్తావన వస్తుంది. అఖిల్ ఓ పాట స్టెప్పులతో అలరిస్తే.. చైతూ ఓ చిన్న క్యామియో రోల్ చేశాడు. అవి అక్కినేని అభిమానులకు ఆనందాన్నిస్తాయి. ఐతే సినిమాకు ఏమాత్రం అస్సెట్ కాదు. కొన్ని ప‌దుల సార్లు చూసిన కామెడీ అయినా ప‌ర్వాలేదు స‌ర్దుకుంటాం అంటే ఓకే కానీ.. లేదంటే మాత్రం ఆటాడుకుందాంరా ఆద్యంతం స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంది.

నటీనటులు:

సుశాంత్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం భిన్నంగా కనిపించాడు. అతను లుక్ మార్చాడు కానీ.. నటన విషయంలో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ రెండూ అంతంతమాత్రమే. చాలాచోట్ల తన మావయ్య నాగార్జునను అనుకరించడానికి ప్రయత్నించాడు సుశాంత్. బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన కొన్ని కామెడీ సీన్లలో సుశాంత్ పర్వాలేదు. హీరోయిన్ సోనమ్ నటన గురించి చెప్పడానికేమీ లేదు. అక్కడక్కడా కొంచెం సెక్సీగా కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఆమె సినిమాకు ప్లస్ కాలేకపోయింది. నటీనటులందర్లోకి పోసాని కృష్ణమురళి బెటర్. ఫ్రెండూ ఫ్రెండూ అనే మేనరిజంతో అక్కడక్కడా నవ్వించాడు పోసాని. బ్రహ్మానందం మరోసారి హీరో చేతిలో బకరా అయ్యే పాత్రలో తనకు అలవాటైన రీతిలో నటించాడు. పృథ్వీ పర్వాలేదు. మురళీ శర్మతో పాటు మిగతా పాత్రలన్నీ మామూలుగా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

టెక్నిషియన్స్ తమ ప్రత్యేకత చూపించే... వాల్యూ యాడ్ చేసే సినిమా ఏమీ కాదిది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలన్నీ టైంపాస్ టైపులో అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. ఛాయాగ్రహణమూ పర్వాలేదు. సుశాంత్ ట్రాక్ రికార్డును.. మార్కెట్ స్థాయిని పట్టించుకోకుండా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. లొకేషన్లు రిచ్ గా అనిపిస్తాయి. టైమ్ మెషీన్ సెట్ అదీ కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది. కథా రచయిత శ్రీధర్ సీపాన తనకు అలవాటైన రీతిలో ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్లిపోయాడు. ‘‘బ్లాంక్ చెక్ ఇస్తే బ్లైండ్ గా వెళ్లిపోతా’’.. ఇలాంటి కొన్ని కామెడీ పంచులు పేలాయి. దర్శకుడు నాగేశ్వరరెడ్డి కూడా అంతే. రొటీన్ స్క్రీన్ ప్లేను ఫాలో అయిపోయాడు.త‌న బ‌ల‌మైన కామెడీని కూడా నాగేశ్వ‌ర‌రెడ్డి పండించ‌లేక‌పోయాడు.

చివరగా: ఆటాడేసుకుంటారు.. ప్రేక్ష‌కుల‌తో

రేటింగ్: 2/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre