Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'ఆటగాళ్ళు'

By:  Tupaki Desk   |   25 Aug 2018 6:14 AM GMT
మూవీ రివ్యూ: ఆటగాళ్ళు
X
చిత్రం : ‘ఆటగాళ్ళు’

నటీనటులు: నారా రోహిత్ - జగపతిబాబు - దర్శన - బ్రహ్మానందం - సుబ్బరాజు - శ్రీతేజ్ - నాగినీడు - జీవా - తులసి - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: విజయ్.సి.కుమార్
నిర్మాతలు: వడ్లపూడి జితేంద్ర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పరుచూరి మురళి

నారా రోహిత్-జగపతిబాబుల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. గతంలో ‘పెదబాబు’.. ‘ఆంధ్రుడు’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి మురళి.. చాలా గ్యాప్ తర్వాత తీసిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆటగాళ్ళు’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సిద్దార్థ్ (నారా రోహిత్) ఒక పేరు మోసిన సినిమా దర్శకుడు. అతనెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అంజలి (దర్శన) హత్యకు గురవుతుంది. భార్యను సిద్దార్థే హత్య చేశాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. ఏ కేసు టేకప్ చేసినా గెలుస్తాడని పేరున్న లాయర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్దార్థ్ కు వ్యతిరేకంగా వాదించడానికి సిద్ధమవుతాడు. మొదట సాక్ష్యాలన్నీ సిద్దార్థ్ కు వ్యతిరేకంగానే కనిపిస్తాయి. మరి ఈ స్థితిలో సిద్దార్థ్ కేసు నుంచి బయటపడ్డాడా.. నిజంగా అతను భార్య హత్య చేశాడా.. ఈ కేసు చివరికి ఏ మలుపు తిరిగింది.. అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఒక మామూలు కథను కూడా ఆసక్తికర కథనం జోడించి మెప్పించే సినిమాగా మలచొచ్చు. అలాగే వినడానికి బాగా అనిపించే కథను కూడా పేలవమైన కథనంతో చెడగొట్టొచ్చు. ఏదైనా కథను చెప్పే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ‘ఆటగాళ్ళు’ రెండో కోవకు చెందే సినిమా. ఇందులోని బేసిక్ ఐడియా ఓకే అనిపిస్తుంది. బహుశా ఆ ఐడియా వినే.. పరుచూరి మురళి ట్రాక్ రికార్డును కూడా పట్టించుకోకుండా నారా రోహిత్.. జగపతిబాబు ‘ఆటగాళ్ళు’ సినిమా చేసి ఉండొచ్చు. కానీ షూటింగ్ టైంలోనే ఈ సినిమా చేస్తున్నందుకు రోహిత్.. జగపతిబాబు చింతించి ఉంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సిినిమా మొత్తంలో పర్వాలేదు అనిపించే సీన్ ఉంది అని చెప్పడానికి కూడా ఆలోచించాలంటే అర్థం చేసుకోండి ఇది ఎలాంటి సినిమానో?

మిగతా వ్యవహారమంతా పక్కన పెట్టి బ్రహ్మానందం పాత్రతో కామెడీ పండించే ఉద్దేశంతో తీసిన సన్నివేశాలు చూస్తే చాలు... ఈ ‘ఆటగాళ్ళు’ ఆడుకునేది ప్రేక్షకులతో అని తెలియడానికి. ఈ సన్నివేశాలతో తెలుగు సినిమాను దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు పరుచూరి మురళి. అసలే బ్రహ్మానందం ట్రాక్ రికార్డు దారుణంగా తయారై ఉంటే.. అది చాలదన్నట్లు ఆయన మీద ఏదో కక్ష ఉన్నట్లు.. జనాలతో తిట్టించడమే ఉద్దేశమన్నట్లుగా సాగుతుంది కామెడీ ట్రాక్. బ్రహ్మానందం కెరీర్లోనే అత్యంత చెత్త కామెడీ ఏది అంటే ఉదాహరణగా ఈ ఎపిసోడ్ నిరభ్యంతరంగా చూపించేయొచ్చు. ఆ సన్నివేశాల్లో రోహిత్ హావభావాలు చూస్తే అతనెంత అయిష్టంగా ఈ సీన్లలో నటించాడో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక ఈ కామెడీ ట్రాక్ తో పాటే సాగే లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

తాను నిర్దోషి అని వాదించి బయటికి తెచ్చిన వ్యక్తే హంతకుడని తర్వాత తెలుసుకుని ఓ లాయర్ అతడిని టార్గెట్ చేయడం.. ఆ ముద్దాయి కూడా తన గేమ్ తాను ఆడటం.. ఈ నేపథ్యంలో సాగే కథ ‘ఆటగాళ్ళు’. ఈ పాయింట్ ఆసక్తికరంగానే అనిపించినా.. దాన్ని సినిమాగా మలిచిన తీరు పేలవం. ఎప్పుడో ఆరేళ్ల కిందట ‘అధినాయకుడు’ అనే డిజాస్టర్ మూవీ తీసిన పరుచూరి మురళి.. ఇన్నేళ్ల ఖాళీలో అసలు తెలుగు సినిమాలు చూడటమే మానేశాడా అనిపించేట్లుగా సాగుతుంది అతడి నరేషన్. ప్రారంభ సన్నివేశాల్లోనే అతనెంత ఔట్ డేట్ అయిపోయాడు తెలిసిపోతుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే బి-గ్రేడ్ సినిమాలు గుర్తుకొస్తాయంటే పెద్ద మాట కాదు. బ్రహ్మానందం కామెడీ.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాకే హైలెట్లుగా సాగే ప్రథమార్దం ప్రేక్షకులతో హాహాకారాలు పెట్టించే నేపథ్యంలో..రోహిత్-జగపతి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సాగే ద్వితీయార్ధం కొంచెం మెరుగనిపించవచ్చు. కానీ అదేమీ సినిమా మీద ప్రేక్షకుల ఇంప్రెషన్ మాత్రం మార్చదు.

నటీనటులు:

ఫలితంతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుని.. సిన్సియర్ గా నటించే రోహిత్.. సినీ దర్శకుడు అనేసరికి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్ లో ఆ పాత్ర తేలిపోవడంతో రోహిత్ కూడా నటన పరంగా ఏమీ చేయలేకపోయాడు. రోహిత్ కెరీర్ లో అత్యంత పేలవమైన పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. జగపతిబాబు పాత్రకు మొదట్లో చాలా బిల్డప్ ఇచ్చారు. దీంతో చాలా ఊహించుకుంటాం. కానీ పోను పోను ఆ పాత్ర కూడా తేలిపోయింది. ఆయన నటన ఓకే అనిపిస్తుంది. అందరూ ఊహించినట్లు రోహిత్-జగపతి పాత్రల మధ్య గొప్ప సన్నివేశాలేమీ ఉండవు. వీళ్లిద్దరూ కలిసి చేసేంత విషయమున్న సినిమా కాదిది. హీరోయిన్ దర్శన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఆమె లుక్ పేలవంగా ఉంది. నటన పర్వాలేదు. బ్రహ్మానందం కామెడీ పేరుతో ఏదో చేసి వెళ్లిపోయారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా కూడా ‘ఆటగాళ్ళు’ అ:థమ స్థాయిలో ఉండటం విచిత్రం. సాయికార్తీక్ పాటలు కానీ.. నేపథ్య సంగీతం కానీ ఎలాంటి ప్రత్యేకత చాటుకోలేదు. చాలా మొక్కుబడిగా అతను పని చేసినట్లు అనిపిస్తుంది. విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణమూ అలాగే ఉంది. సినిమా చాలా రిచ్ గా తీశారని జగపతిబాబు అన్నాడు కానీ.. ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. ఒక బి-గ్రేడ్ సినిమా చూస్తున్న కలుగుతుంది నిర్మాణ విలువలు చూస్తే కొన్ని చోట్ల. ఇక పరుచూరి మురళి రైటింగ్ గురించి కానీ.. డైరెక్షన్ గురించి కానీ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పది పదిహేనేళ్ల కిందట తీసిన ‘నీ స్నేహం’.. ‘ఆంధ్రుడు’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మురళి.. ఆ తరహాలో సినిమాను నడిపించినా ఓకే అనిపించేది. కానీ అతను కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయాడు. ఇలాంటి స్క్రిప్టుతో అసలు రోహిత్.. జగపతిలను ఆయనెలా మెప్పించి ఒప్పించగలిగారో అర్థం కాదు.

చివరగా: ఆటగాళ్ళు.. రఫ్ఫాడుకుంటారు

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre