Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతున్న 'ఆచార్య'..!

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:29 AM GMT
మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతున్న ఆచార్య..!
X
మెగాస్టార్ చిరంజీవి దాదాపు మూడేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ మీద కనిపించిన చిత్రం "ఆచార్య". తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన మెగా తండ్రీకొడుకుల సినిమా.. డిజాస్టర్ గా నిలిచింది.

ఇది చిరు కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మెగాస్టార్ హాలిడే కోసం విదేశాలకు వెళ్లగా.. మెగా ఫ్యాన్స్ మాత్రం దీన్నుంచి బయటకు రాలేకపోతున్నారు. 'ఆచార్య' మూవీ ఫలితం వారికి ఒక పీడకలలా చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది.

మొదటి వారానికి మేజర్ థియేటర్లలలో 'ఆచార్య' రన్ ముగిసింది. దీంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. డిజిటల్ రిలీజ్ లో ట్రోలింగ్ స్టఫ్ గా మారింది. ఎలాగోలా అంతా మర్చిపోదాం అనుకుంటుండగా.. ఏదొక రూపంలో మెగా అభిమానులను ఇది వెంటాడుతూనే ఉంది.

చిరంజీవి సినిమా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రదర్శించబడుతుంటాయనే సంగతి తెలిసిందే. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా 50 రోజులు గ్యారంటీగా ఆడుతుంటాయి. అదీ ఆయన స్టార్ పవర్. కానీ 'ఆచార్య' సినిమా విషయంలో ఈ లెక్క తప్పింది. దీంతో కొన్ని బ్యాడ్ రికార్డ్స్ మూటగట్టుకోవాల్సి వచ్చింది.

చిరు కెరీర్ లో లీస్ట్ రన్ ఉన్న సినిమా 'ధైర్యవంతుడు'. 1986లో విడుదలైన ఈ చిత్రం హైదరాబాద్ లోని వెంకటేష్ థియేటర్లో 22 రోజుల తర్వాత తీసేశారు. ఆ తర్వాత సీనియర్ హీరోకు అంత తక్కువ రన్ ఉన్న సినిమా ఏదీ లేదు. అయితే ఇప్పుడు లీస్ట్ రన్ తో 'ఆచార్య' దాని సరసన చేరింది.

'ఆచార్య' సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడింది. ఇప్పుడు 'మేజర్' మూవీ రిలీజ్ అవ్వడంతో థియేటర్ నుంచి మెగా మూవీ వెళ్ళిపోయింది. అంటే దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇంత తక్కువ రన్ ఉన్న సినిమాగా 'ఆచార్య' నిలిచింది.

ఇక మెగాస్టార్ కెరీర్ లో 50 రోజులు కూడా ఆడని సినిమా 'రుద్రవీణ'. 1988లో రిలీజైన అర్థ శతదినోత్సవం జరుపుకోలేదు. ఆ తర్వాత చిరుకు అనేక ప్లాప్స్ వచ్చినప్పటికీ కనీసం ఏదొక కేంద్రంలో యాభై రోజులు ఆడేది. కానీ 34 ఏళ్ల తర్వాత కనీసం ఒక థియేటర్లో కూడా అర్థ శతదినోత్సవం జరుపుకోని చిత్రంగా 'ఆచార్య' మిగిలింది.

ఇలా పలు బ్యాడ్ రికార్డులు 'ఆచార్య' పేరిట ఉండటం మెగా ఫ్యాన్స్ మనసులను గాయపరుస్తోంది. అందులోనూ ఇది మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వారిని ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారాడని సంతోషించే లోపే.. డిజాస్టర్ అందుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రాబోయే సినిమాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.