Begin typing your search above and press return to search.

నీలాంబరి అందాన్ని వర్ణిస్తున్న సిద్ధ..!

By:  Tupaki Desk   |   5 Nov 2021 6:16 AM GMT
నీలాంబరి అందాన్ని వర్ణిస్తున్న సిద్ధ..!
X
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''ఆచార్య''. దేవాదాయ భూముల కుంభకోణం నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న సందేశాత్మక సినిమా ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో తాజాగా 'నీలంబారి' అనే మరో పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

దీపావళి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విడుదల చేయబడిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా వచ్చిన పూర్తి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'నీలాంబరి నీలాంబరి.. వేరెవ్వరే నీలా మరి..' అంటూ వచ్చిన ఈ గీతానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు సమకూర్చారు. మెలోడీ బ్రహ్మ మరోసారి తన స్వరాలతో మ్యాజిక్ చేసారని చెప్పాలి. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ దీనికి 'అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి..' వంటి పద సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహరా కలిసి ఈ పాటను ఆలపించారు.

రామ్ చరణ్ - పూజా హెగ్డే లపై ఈ మెలోడియస్ డ్యూయెట్ 'నీలాంబరి' సాంగ్ షూట్ చేయబడింది. ఇందులో చరణ్ వేసిన అదిరిపోయే స్టెప్పులు.. నీలాంబరిని వర్ణించే విధానం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. అందమైన అవుట్ డోర్ లొకేషన్స్ లో స్పెషల్ సెట్ లో ఈ పాటను చిత్రీకరించారు. తిరునవుక్కరసు దీనికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చెయ్యగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి - రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది మెగాభిమానులకు మాస్ ఫీస్ట్ ను అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 2022 ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.