Begin typing your search above and press return to search.

యాక్షన్ కి కొత్త భాష్యం చెప్పిన అర్జున్

By:  Tupaki Desk   |   15 Aug 2021 6:30 AM GMT
యాక్షన్ కి కొత్త భాష్యం చెప్పిన అర్జున్
X
తెలుగు తెరకి యాక్షన్ కథలను పరిచయం చేసిన హీరోగా అర్జున్ గురించి చెప్పుకోవచ్చును. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్న కారణంగా ఆయన పూర్తి ఫిట్నెస్ తో ఉండేవారు. అందువలన యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయారు. దాంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇక అర్జున్ తను చేసే యాక్షన్ చుట్టూ ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు. దాంతో సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఆయన చేరువైపోయారు.

కన్నడ .. తమిళ సినిమాలను ఎక్కువగా చేసుకుంటూ వెళుతున్న అర్జున్ ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కోడి రామకృష్ణ. గ్రామీణ నేపథ్యంలో కథలను ఆయన అర్జున్ తో తెరకెక్కించారు. అలా వచ్చిన 'మా పల్లెలో గోపాలుడు' .. 'మన్నెంలో మొనగాడు' .. ' మా ఊరి మారాజు' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. అర్జున్ ఇక్కడ హీరోగా నిలదొక్కుకోవడంలో ఈ మూడు విజయాల పాత్ర కీలకమనే చెప్పాలి.

ఇక బంగారు చిలక .. ప్రతిధ్వని .. కోనసీమ కుర్రోడు సినిమాలు కూడా తెలుగులో ఆయన కెరియర్ కి చాలావరకూ హెల్ప్ అయ్యాయి. ఇవి కథాబలం .. యాక్షన్ కి బాగా స్కోప్ ఉన్న సినిమాలు కావడం ఆయనకి కలిసొచ్చింది. అలా తెలుగులో వరుస విజయాలను అందుకున్న ఆయన, ఆ తరువాత కాలంలో తమిళంలో బిజీ అయ్యారు. తమిళంలో హిట్ అయిన సినిమాలు తెలుగు అనువాదాలుగా ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టాయి. 'జై హింద్' .. 'జెంటిల్ మేన్' వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి.

ఒకానొక సమయంలో అర్జున్ కూడా వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన కూడా అవకాశాలు కోసం ఎదురుచూడవలసి వచ్చింది. ఆ సమయంలో నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో, అప్పటివరకూ సంపాదించిన డబ్బుతో తనే నిర్మాతగా మారిపోయి .. ఒక మంచి కథను సెట్ చేసుకుని రంగంలోకి దిగారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆయనకి మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. కథాకథనాలపై ఆయనకి పట్టు పెరగడానికీ, దర్శక నిర్మాతగా మారడానికి ఆ సినిమానే కారణమైంది.

తమిళ .. కన్నడ సినిమాలతో తీరిక లేకపోవడం వలన ఆయన తెలుగుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయారు. కృష్ణవంశీ చేసిన 'శ్రీ ఆంజనేయం' నుంచి ఆయన ఇక తెలుగులో కనిస్తూనే ఉన్నారు. కథ - పాత్ర బాగున్నాయనిపిస్తే విలన్ గా చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలా 'లై' .. 'నా పేరు ఇండియా' సినిమాలు చేసిన ఆయన, ప్రస్తుతం 'రవితేజ 'ఖిలాడి' సినిమాలోను ఒక కీలకమైన రోల్ చేస్తున్నారు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుందాం.