Begin typing your search above and press return to search.

పేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఫేట్ మారేనా..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 5:30 PM GMT
పేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఫేట్ మారేనా..?
X
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు న్యూమరాలజీకి జాతకాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొబ్బరి కొట్టే దగ్గర నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు.. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అన్నీ ముహుర్తాలను బట్టే నిర్ణయించబడుతుంటాయి. అలానే కొందరు నటీనటులు ఎంత కష్టపడినా సరైన బ్రేక్ రాకపోతే పేర్లు మార్చుకుని ఫేట్ మార్చుకోడానికి ట్రై చేస్తుంటారు. గతంలో చాలా మంది హీరోహీరోయిన్లు తమ పేర్లను మార్చుకొని కెరీర్ ని గాడిలో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలానే ఎప్పటిలాగే అదృష్టం కలిసిరాని వాళ్ళు కూడా ఉన్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇప్పుడు తన పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు. వైవిధ్యమైన సినిమాలతో సర్ ప్రైజ్ చేసే క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అదిత్ అరుణ్. ఆయన నటించిన 'కథ' 'తుంగభద్ర' 'పీఎస్వీ గరుడ వేగ' 'డియర్ మేఘ' 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' లాంటి చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే యువ హీరో టాలెంట్‌ కి తగిన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ యాక్టర్ తన పేరును 'త్రిగుణ్' గా మార్చుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

తాజాగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా అనౌన్స్ చేసారు. 'ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్' అని పేర్కొంటూ.. ఇకపై తనను మీడియా మిత్రులు - చిత్ర పరిశ్రమలోని స్నేహితులు - పెద్దలు 'త్రిగుణ్' గా పిలవాలని కోరారు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న "కొండా" చిత్రంలో నటిస్తున్నాడు త్రిగుణ్. ఈ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా 'కొండా' ట్రైలర్ విడుదలవుతున్న నేపథ్యంలో త్రిగుణ్ గా పేరు మార్చుకోవడం రైట్ టైమ్ గా భావించవచ్చు. మరి పేరు మార్చుకున్న యువ హీరోకి రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలు అందుతాయో చూడాలి.