Begin typing your search above and press return to search.

కరోనా బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన తలా!

By:  Tupaki Desk   |   7 April 2020 3:03 PM GMT
కరోనా బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన తలా!
X
కరోనా వైరస్‌ మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు కూడా అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. ఈ విషయంలో మన టాలీవుడ్ యాక్టర్స్ ముందే వున్నారని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్ సినీ నటులు 'కరోనా క్రైసెస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అజిత్ కూడా కరోనాపై యుద్ధానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు.

తాజాగా తమిళ అగ్ర నటుడు అజిత్.. తన వంతుగా రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రకటించారు. అందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు మరియు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తమిళనాడులో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అజిత్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పతనం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ - సూర్య ఫ్యామిలీ - శివ కార్తికేయన్ మొదలైన వారు కరోనా పై యుద్ధానికి మేముసైతం అంటూ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న సమయంలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పేదలకు ఆర్థికంగాను, సామాజికంగాను సహాయం చేయడానికి సిద్దమయ్యారు. ప్రతీ రోజు ప్రజలను, అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు.