Begin typing your search above and press return to search.

ప్రభాస్-గోపీ కలిస్తే..

By:  Tupaki Desk   |   25 Nov 2018 2:30 PM GMT
ప్రభాస్-గోపీ కలిస్తే..
X
టాలీవుడ్లో ఎంత ఎదిగినా చాలా ఒదిగి ఉండే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన అభిమానులతో పాటు స్నేహితుల్ని కూడా అతను ‘డార్లింగ్’ అంటుంటాడు... అతడిని కూడా అందరూ డార్లింగ్ అనే అంటారు. చాలా సిగ్గరిలా కనిపించే ప్రభాస్‌కు క్లోజ్ ఫ్రెండ్స్ మరీ ఎక్కువమందేమీ లేరు. అతడితో ఇండస్ట్రీలో చాలా సన్నిహితంగా మెలిగే హీరోల్లో గోపీచంద్ ఒకడు. వీళ్లిద్దరికీ దాదాపు 20 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించారు కూడా. ప్రభాస్ పెద్ద రేంజికి వెళ్లినా కూడా ఇప్పటికీ గోపీతో మంచి స్నేహమే ఉంది. తమ మధ్య అనుబంధం ఎలాంటిదన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ వివరించాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

‘‘చిత్ర పరిశ్రమలో నాకు బాగా సన్నిహిత మిత్రుడంటే ప్రభాసే. ప్రభాస్ నిజాయితీ కలిగిన.. మంచి మనసున్న వ్యక్తి. నేను మొదటిసారి తనని చూసింది వాళ్ల ఆఫీసులో. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ ఎదురుగా కృష్ణంరాజు గారి ఆఫీసు ఉండేది. నా తొలి సినిమా ‘తొలివలపు’ ఫ్లాప్‌ అయ్యాక అక్కడికి వెళితే ప్రభాస్‌ కనిపించాడు. ఒడ్డూ పొడుగూ బాగా ఉన్న చూడగానే పెద్ద హీరో అవుతాడనిపించింది. అప్పుడే మేం స్నేహితులం అయ్యాం. ‘వర్షం’ సినిమాతో మా మధ్య అనుబంధం పెరిగింది. ప్రభాస్ కు కూడా నాలాగే సిగ్గు ఎక్కువ. మేం స్నేహితులం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉంటారనుకుంటారు. మేం కలవడానికి ఒక్కోసారి నెల పట్టొచ్చు, నాలుగు నెలలు పట్టొచ్చు. ఎక్కువగా ఫోన్‌లోనే మాట్లాడుకుంటాం. మా ఇద్దరికీ కుదిరిన రోజు కలిసి కూర్చున్నామంటే ఇక సమయం తెలియదు. ఒకొక్కసారి రాత్రి మొత్తం గడిచిపోతుంటుంది. మేం కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలని ఇద్దరికీ ఉంది. కానీ అందుకు తగ్గ కథ కుదరాలి’’ అని గోపీచంద్ అన్నాడు.