Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో ఆఖరోడు వచ్చాడు..

By:  Tupaki Desk   |   1 Aug 2017 12:12 PM IST
డ్రగ్స్ కేసులో ఆఖరోడు వచ్చాడు..
X
మొత్తానికి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల విచారణ ఓ కొలిక్కి వచ్చేసినట్లే. ఈ కేసులో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీల్లో చివరి వాడైన యువ నటుడు నందు కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో నందు నాంపల్లిలోని అబ్కారీ కార్యాయాలయానికి వచ్చాడు.

మీడియా వాళ్ల దృష్టిలో పడకూడదని కొంచెం తొందర తొందరగా లోపలికి వెళ్లిపోయాడు నందు. డ్రగ్స్ వాడకానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణల్ని నందు రెండు వారాల కిందట తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తాను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అంటూ టీవీ ఛానెల్ చర్చలోనే ముందుకొచ్చాడు నందు. మరి సిట్ అధికారుల విచారణ సందర్భంగా నందు ఎలా స్పందిస్తాడు.. శాంపిల్ ఇవ్వడానికి అంగీకరిస్తాడా లేదా అన్నది చూడాలి.

సిట్ అధికారులు పూరి జగన్నాథ్ తో మొదలుపెట్టి శ్యామ్ కే నాయుడు.. సుబ్బరాజు.. ఛార్మి.. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా.. ముమైత్ ఖాన్.. రవితేజ.. తనీష్ తదితరుల్ని విచారించిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజుతో సినిమా వాళ్ల విచారణ పూర్తవుతున్న నేపథ్యంలో సిట్ బృందం ఏ కంక్లూజన్ కు వచ్చిందో.. విచారణ సరళిపై వాళ్లేమంటారో చూడాలి. ఈ రోజు సాయంత్రం అకున్ సబర్వాల్ అండ్ టీం మీడియాను కలిసిన సందర్భంలో కీలక విషయాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు.