Begin typing your search above and press return to search.

ప్రతి శనివారం సాయంత్రం సోని ధాబాకు నాని!

By:  Tupaki Desk   |   7 July 2019 2:30 PM GMT
ప్రతి శనివారం సాయంత్రం సోని ధాబాకు నాని!
X
సహజ నటుడు నాని మరోసారి హోస్ట్‌ అవతారం ఎత్తాడు. గత ఏడాది బిగ్‌ బాస్‌ కోసం హోస్ట్‌ గా మారిన నాని తాజాగా ప్రముఖ మార్మిక యోగి సద్గురు తో టాక్‌ షో నిర్వహించారు. హైదరాబాద్‌ లో నాని విత్‌ సద్గురు కార్యక్రమంలో పలు విషయాలను సద్గురుతో నాని చర్చించడం జరిగింది. తనకు సంబంధించిన విషయాలను చెప్పడంతో పాటు కొన్ని ప్రశ్నలకు సద్గురు నుండి సమాధానాలు చెప్పించాడు నాని.

నాని కార్యక్రమం ఆరంభంలోనే అందరిని నవ్వించాడు. నా జీవితంలో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అలాంటి నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగల గొప్ప వ్యక్తిని నేను ఇప్పుడు ప్రశ్నించబోతున్నాను అన్నాడు. నేను సద్గురు గారిని ప్రశ్నలు అడిగేందుకు గ్రౌండ్‌ వర్క్‌ ఏమీ చేయలేదు.. ట్విట్టర్‌ లో ప్రశ్నలను సేకరించలేదు అన్నాడు. నాకు ఎప్పటి నుండో ఉన్న ప్రశ్నలను ఇప్పుడు నేను ఆయన ముందు ఉంచబోతున్నాను. నా ప్రశ్నలు చాలా సిల్లీగా అనిపించవచ్చు.

నాని మొదటి ప్రశ్న.. నాకు బాగా గుర్తు నా మొదటి జీతం రూ. 4000. మొదటి జీతంను అన్ని వందల నోట్లు ఇచ్చారు. ఆ నోట్లను పాయింట్‌ వెనక జేబులో పెట్టుకుని బండిపై వెళ్తున్నాను. అప్పుడు నా వద్ద అంతులేని డబ్బుందన్నట్లుగా సంతోషం. ఆ సంతోషంలో హైదరాబాద్‌ సగాన్ని కొనేయాలన్నంత ఫీల్‌ కలిగింది. కాని ఇప్పుడు నేను నా మొదటి సంపాదనకు వేల రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నా కూడా అప్పటి ఫీలింగ్‌ మాత్రం ఇప్పుడు కలగడం లేదు. అప్పట్లోనే ప్రతి శనివారం సాయంత్రం సోని ధాబాకు వెళ్లి ఒక క్వార్టర్‌.. మళ్లీ ఆ క్వార్టర్‌ కోసం సోమవారం నుండి శనివారం వరకు వెయిట్‌ చేసేది. శనివారం ఉదయం రాగానే అందరం కలవబోతున్నాం అనే సంతోషం.. సోని ధాబాకు వెళ్లవచ్చు అని ఆనందంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ ఆనందం అనుభవించలేక పోతున్నాను. మనం అంతా కూడా విజయం కోసం ఎదురు చూస్తాం. మనం అంతా కూడా విజయంకు ఎక్కువ విలువ ఇస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఉందని నాని అన్నాడు.

సద్గురు నాని ప్రశ్నకు స్పందిస్తూ.. మీరంతా ఒక మార్గంను పట్టుకుని అదే గమ్యం అని అపార్ధం చేసుకున్నప్పుడే ఇలా జరుగుతుంది. మనం ఏది చేయాలనుకున్నా దానికి డబ్బు అనేది అవసరం. అంతా కూడా డబ్బు పోగేసుకోవడానికి కారణం రేపు పొద్దున్న భోజనం కోసం వెదుక్కోనక్కర్లేకుండా ఉండాలి. మనుగడ గురించి ఆందోళన అక్కర్లేదు అనిపించుకోవడానికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. చాలా మంది డబ్బు సంపాదనే తమ లక్ష్యంగా భావిస్తారు. కాని అసలు డబ్బు లక్ష్యం కాదు మార్గం మాత్రమే. మీ దగ్గర ఒక కారు ఉంది. ఆ కారులో ఎక్కడకు వెళ్లాలో తెలియనప్పుడు కారు ఉండి ఏం ప్రయోజనం. ఎక్కడకు వెళ్లాలో తెలిసినప్పుడు బస్సులో అయినా వెళ్లవచ్చు. కాకుంటే బస్సులో గంట పడితే కారులో అర్ధ గంటలో వెళ్లవచ్చు. ఎక్కడకు వెళ్లాలి అనే స్పష్టత ఉన్నప్పుడే మీకు కారు ఉంటే ఓ అర్థం ఉంటుంది. డబ్బు ఉంది కదా అని సగం హైదరాబాద్‌ ను కొనుగోలు చేస్తే మీకు కావాల్సిన సంతోషం మిగిలి ఉన్న ఆ సగం హైదరాబాద్‌ లోనే ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి అన్నారు.