Begin typing your search above and press return to search.

సౌత్ vs నార్త్ అని విభజించడం మూర్ఖత్వం: నాని

By:  Tupaki Desk   |   14 Jun 2022 4:30 PM GMT
సౌత్ vs నార్త్ అని విభజించడం మూర్ఖత్వం: నాని
X
ఇటీవల కాలంలో 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్ 2' 'పుష్ప: ది రైజ్' 'విక్రమ్' 'మేజర్' వంటి దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను అందుకోవడంతో సోషల్ మీడియాలో నార్త్ vs సౌత్ సినిమా అనే చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదం పై నేచురల్ స్టార్ నాని స్పందించారు.

ఇండియన్ సినిమాను నార్త్ సౌత్ అంటూ విభజించి మాట్లాడటం మూర్ఖత్వమని.. మనం పెట్టుకున్న బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ పేర్లన్నీ హాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకున్నవే అని నాని అన్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆదరించే ట్రెండ్‌ ను సెలబ్రేట్ చేసుకోవాలి కానీ.. ఆ టాపిక్ పై డిబేట్ పెట్టకూడదని అభిప్రాయపడ్డారు.

"సౌత్ నార్త్ అని విభజించడం మూర్ఖత్వం. ఇప్పుడు ఏం జరిగినా సినిమా గెలుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ హాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న పేర్లతో పిలుచుకుంటున్నాం. మనల్ని మనం వేర్వేరు పరిశ్రమలుగా ఎందుకు పిలుస్తామో నాకు అర్థం కాలేదు. భాషలు వేరుగా ఉండవచ్చు కానీ మనది ఒకే దేశం" అని నాని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

“ప్రతి ఇండస్ట్రీ నుండి వచ్చే మంచి సినిమానీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. ప్రతీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు. అందరూ మంచి సినిమాని సెలబ్రేట్ చేసుకుంటే స్టార్ క్యాస్టింగ్ మీద ఫోకస్ ఉండదు.. ఒక మంచి సినిమా ఎలా తీయాలనే దానిపైనే అప్పుడు ఫోకస్ ఉంటుంది. సినిమా పరిశ్రమలో మనం చూస్తున్న మంచి మార్పు ఇది. నార్త్ వర్సెస్ సౌత్‌ అనే దానిపై చర్చ అవసరం లేదు” అని నాని చెప్పుకొచ్చారు.

ఇటీవల 'అంటే సుందరానికి' ప్రమోషన్స్ లో పాన్ ఇండియా సినిమాలపై నాని ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ''మన సినిమాని మనమే పాన్‌ ఇండియా సినిమా అనుకోకూడదని నా అభిప్రాయం. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది పాన్‌ ఇండియా సినిమా. కథ బాగుండి.. మంచిగా తెరకెక్కించాలి. అది ప్రజలకి నచ్చాలి. అంతే కానీ యూనివర్సల్‌ కథలతో తీస్తే అది పాన్‌ ఇండియా సినిమా అయిపోదు'' అని అన్నారు.

''పుష్ప సినిమానే తీసుకుంటే ఇక్కడ మన నల్లమల అడవుల్లో జరిగే కథ. దానికీ బాలీవుడ్ కి ఏమైనా సంబంధం ఉందా? కానీ మంచి సినిమా.. బాగా తీశారు కాబట్టే అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఆదరించడంతో అది పాన్ ఇండియా సినిమా అయింది. అలా ఎవరైనా కథపై దృష్టి పెట్టాలి కానీ.. పోస్టర్స్ పై పాన్ ఇండియా అని రాసుకోకూడదు. సినిమా బాగుంటే ప్రాంతాలు భాషలతో సంబంధం లేకుండా విజయం సాధిస్తున్నాయి. మన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినిమా పరిశ్రమకే ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి'' అని నాని పేర్కొన్నారు.

ఇకపోతే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ''దసరా'' అనే సినిమా చేస్తున్నారు. ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్-డ్రామాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది.