Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోకు ఇది గట్టి దెబ్బే..!

By:  Tupaki Desk   |   23 May 2022 3:30 PM GMT
సీనియర్ హీరోకు ఇది గట్టి దెబ్బే..!
X
యాంగ్రీమ్యాన్ గా ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్.. ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రల్లో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 'గరుడవేగ' 'కల్కి' సినిమాతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్.. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ''శేఖర్'' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఆయన సతీమణి జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''శేఖర్''. ఇందులో వారి కుమార్తె శివాని కీలక పాత్ర పోషించింది. సినిమా నిర్మాణంలోనూ జీవిత రాజశేఖర్ భాగమయ్యారు. ఇది మలయాళ సూపర్ హిట్ 'జోసెఫ్' మూవీకి తెలుగు రీమేక్.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన 'శేఖర్' చిత్రాన్ని శుక్రవారం (మే 20) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజు టాక్ పర్వాలేదనిపించుకోవడంతో.. వీకెండ్ లో రాజశేఖర్ సినిమా మంచి వసూళ్ళు రాబడుతుందని అందరూ భావించారు.

అయితే కోర్టు కేసులు ఈ సినిమాపై పెద్ద దెబ్బ వేశాయి. డిస్ట్రిబ్యూటర్ నిర్మాతల మీద కోర్టుకు వెళ్ళడంతో.. రూ.65 ల‌క్ష‌ల డిపాజిట్ చెల్లించ‌ని కార‌ణంగా ఈ చిత్రాన్ని నిలిపివేస్తూ నాయస్థానం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో 'శేఖర్' చిత్రాన్ని థియేటర్లలో నుంచి తీసేయాల్సి వచ్చింది.

ఇప్పుడు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డ‌రుని వెన‌క్కి తెచ్చుకుని సినిమాని ఎప్పటిలాగే కొన‌సాగించినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏ సినిమా అయినా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వీకెండ్ లోనే అంతో ఇంతో వసూలు చేసేది.

కానీ కోర్టు ఉత్తర్వులు కారణంగా 'శేఖర్' కు వీకెండ్ వృధాగా పోయింది. వీక్ డేస్ లో ప్రదర్శించినా అధిక కలెక్షన్స్ అయితే ఎక్సపెక్ట్ చేయలేం. అందులోనూ ఇప్పుడున్న 'సర్కారు వారి పాట' కు తోడుగా వచ్చే వారం 'ఎఫ్ 3' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అప్పుడు రాజశేఖర్ చిత్రాన్ని పట్టించుకునేవారు ఉండకపోవచ్చు.

నిజానికి 'శేఖర్' సినిమాపై జీవిత రాజశేఖర్ దంపతులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. రీమేక్ రైట్స్ తీసుకొని నిర్మాణంలో పెట్టుబడులు కూడా పెట్టారు. సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఓటీటీ ఆఫ‌ర్లు వచ్చినా ఇవ్వలేదనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.

ఈ నేపథ్యంలో హీరో రాజశేఖర్ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు. సినిమాయే తమకు లోకమని.. ముఖ్యంగా 'శేఖర్' చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి.. థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయించారని ఆరోపించారు.

"శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువచ్చేందుకు మేం చాలా కష్టపడ్డాం. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా మూవీని అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని.. ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను" అంటూ రాజశేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇకపోతే రాజశేఖర్ ఆ మధ్య పలు ఆసక్తికరమైన సినిమాలు అనౌన్స్ చేశారు. 'గ‌తం' ఫేమ్ కిర‌ణ్ కొండ‌మ‌డుగ‌లతో '#RS92' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని ప్రకటించారు. అలానే 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహాతో 'మర్మాణువు' అనే మూవీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత వీటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు.