Begin typing your search above and press return to search.

ఓటు వేసేందుకు అరకు షూటింగ్‌ నుండి వచ్చాను.. కాని బాధగా ఉంది

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:58 AM GMT
ఓటు వేసేందుకు అరకు షూటింగ్‌ నుండి వచ్చాను.. కాని బాధగా ఉంది
X
హైదరాబాద్‌ లో నేడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం మరీ దారుణంగా ఉంది. ఈసారి కనీసం 60 శాతం పోలింగ్‌ శాతం నమోదు అయ్యేలా ఎన్నికల సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలు సఫలం అయినట్లుగా అనిపించడం లేదు. ఈ విషయమై సీనియర్‌ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ ఆ వేదన వ్యక్తం చేశాడు. నేడు ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశాడు.

ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నేను ఏపీ అరకు నుండి వచ్చాను. గత కొన్ని రోజులుగా నేను అక్కడ షూటింగ్‌ లో పాల్గొంటున్నాను. కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నేను ఇక్కడకు వచ్చాను. కాని ఇక్కడకు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా పోలింగ్‌ బూత్‌ లు ఖాళీగా ఉండటం బాధగా ఉంది. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎలా ప్రశ్నిస్తారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మాత్రమే ప్రశ్నించే అర్హత ఉంటుంది. నగరం అభివృద్దిలో మీ ఓటు ప్రాముఖ్యత చాలా ఉంటుందనే విషయం మీరు మర్చి పోవద్దు అంటూ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఎంతో మంది ప్రముఖులు చెప్పినా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రాలేదు. కొందరు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును లైట్‌ తీసుకున్నట్లుగా అనిపించింది.