Begin typing your search above and press return to search.

ఆ కామెంట్లపై శ్రీవిష్ణు వివరణ

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:30 PM GMT
ఆ కామెంట్లపై శ్రీవిష్ణు వివరణ
X
గత వారం ‘పాగల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో యువ కథానాయకుడు విశ్వక్సేన్ వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాతో మూతపడి ఉన్న థియేటర్లు కూడా తెరిపించేస్తా.. లేదంటే పేరు మార్చుుకుంటూ ఓ రేంజిలో సినిమా గురించి ఎలివేషన్లు ఇచ్చాడు విశ్వక్. తీరా చూస్తే ‘పాగల్’ అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అతడి మీద ఓ రేంజిలో ట్రోలింగ్ జరిగింది. సరిగ్గా ఇదే టైంలో ఈ వారం రానున్న కొత్త చిత్రం ‘రాజ రాజ చోర’ గురించి శ్రీ విష్ణు కూడా ఓ రేంజిలో మాట్లాడేశాడు. ఈ సినిమాకు వచ్చేవాళ్లు అరడజను మాస్కులు తెచ్చుకోవాలని.. ప్రథమార్ధంలో నవ్వి నవ్వి మూడు మాస్కులు ఎగిరిపోతాయని.. మిగతా మూడు ద్వితీయార్ధంలో ఎమోషన్లతో తడిచిపోతాయని అన్నాడు. అలాగే ఈ సినిమా భారతీయ భాషలన్నింట్లో రీమేక్ అయిపోతుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు.

మామూలుగా విష్ణు ఇంత ఓవర్‌గా మాట్లాడడు కానీ.. ‘రాజ రాజ చోర’ అతడికి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లుంది. విశ్వక్ ఉదాహరణ కనిపిస్తుండగానే విష్ణు ఇలాంటి కామెంట్స్ చేయడంతో అతణ్నీ ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఐతే ‘రాజ రాజ చోర’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన విష్ణు.. ప్రి రిలీజ్ ఈవెంట్ కామెంట్లపై వివరణ ఇచ్చాడు. కథ మీద, స్టోరీ టెలింగ్ మీద ఉన్న నమ్మకంతోనే తాను ఆ కామెంట్లు చేశానని విష్ణు అన్నాడు. ఏదో మాట్లాడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోవాలని తాను అనుకోనని.. రేప్పొద్దున సినిమా అనుకున్నంతగా లేకపోతే నిరాశ చెందుతారన్న విషయం కూడా తనకు తెలుసని విష్ణు చెప్పాడు. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేశారని.. ఈ సినిమా కథ చాలా బాగుండటంతో పాటు స్టోరీ టెలింగ్ కూడా కొత్తగా ఉంటుందని.. కాబట్టే ఈ చిత్రం కూడా వేర్వేరు భాషల్లోకి వెళ్తుందనే నమ్మకంతో ఆ కామెంట్లు చేశానని అతనన్నాడు. ‘రాజ రాజ చోర’తో కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామని అతను ధీమా వ్యక్తం చేశాడు.