Begin typing your search above and press return to search.

ఓటీటీ కంటెంట్ పై సెన్సార్‌ తప్పనిసరి

By:  Tupaki Desk   |   20 Jun 2022 1:30 AM GMT
ఓటీటీ కంటెంట్ పై సెన్సార్‌ తప్పనిసరి
X
ఒకప్పుడు బుల్లి తెర మరియు వెండి తెరపై వచ్చే సినిమాలు మరియు సీరియల్స్ చాలా పద్దతిగా.. యువతకు ఆదర్శవంతంగా.. ఆలోచింపజేసే విధంగా ఉండేవి. కాని ఇప్పుడు సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు మరియు టీవీ సీరియల్స్ వల్ల యువత తప్పుదోవ పడుతున్నారు అంటూ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ హీరో సుమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సుమన్ ఫ్యాన్స్‌ అసోషియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్ధంతి కార్యక్రమంలో సుమన్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌ విషయం లో సెన్సార్ తప్పనిసరిగా ఉండాలి.. ప్రతి వెబ్‌ సిరీస్‌ లో కూడా అడల్ట్‌ కంటెంట్ ఉంటుందని సుమన్ అన్నారు.

ఇంకా సుమన్ మాట్లాడుతూ... కరోనా సమయంలో ఓటీటీ ల ప్రభావం ఎక్కువ అయ్యింది. అందులో వచ్చే వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాల్లో అశ్లీలత ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఈమద్య కాలంలో ఎక్కువ ఫోన్ లు చూస్తున్నారు. వారు వెబ్‌ సిరీస్ లు మరియు ఇతర కంటెంట్‌ లు చూస్తున్నారు. కనుక వెబ్‌ సిరీస్ లు మరియు టీవీ షో లు సీరియల్స్ పై సెన్సార్ బోర్డు దృష్టి పెట్టాలి.

ఈమద్య కాలంలో షార్ట్‌ ఫిల్మ్స్ చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. పెద్ద నిర్మాతలు కూడా వాటిపై దృష్టి పెడుతున్నారు. జనాల ముందుకు వచ్చే ప్రతి కంటెంట్‌ ను కూడా సెన్సార్ బోర్డు కన్నేసి చూడాలని.. లేదంటే యువత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయంటూ సుమన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో కూడా లేను అని స్పష్టం చేశాడు. అయితే రెండు మూడు సార్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేశాను. కాని అపాయింట్‌మెంట్‌ లభించలేదు అన్నాడు. ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేస్తున్నారు.. వాళ్ల మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయి. కనుక రాజకీయాల్లో ఉన్న వారు జనాలకు అనుకూలంగా ఉండాలని సుమన్ అన్నాడు.