Begin typing your search above and press return to search.

ఇలాంటి డైరెక్టర్ ను ఇంతవరకూ చూళ్లేదు: సునీల్

By:  Tupaki Desk   |   24 May 2022 3:07 PM GMT
ఇలాంటి డైరెక్టర్ ను ఇంతవరకూ చూళ్లేదు: సునీల్
X
కమెడియన్ గా సునీల్ చాలా ఫాస్టుగా తెరపైకి దూసుకుని వచ్చాడు. ఇక హీరోగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అది సేఫ్ జోన్ కాదని గ్రహించిన వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. కమెడియన్ గా మంచి రోల్ పడేవరకూ వేరే రోల్స్ చేసుకుంటూ వెళదామని ఆయన చేసిన పాత్రలు క్లిక్ అయ్యాయి. దాంతో విలక్షణ నటుడిగా కూడా ఆయన మంచి మార్కులను దక్కించుకున్నాడు. ఇక 'ఎఫ్ 3'లో పాత సునీల్ కనిపిస్తాడని  మొన్న స్టేజ్ పై వరుణ్ చెప్పిన దగ్గర నుంచి, ఆయన పాత్ర ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడితో కలిసి అలీ షోకి వచ్చిన సునీల్ తనదైన స్టైల్లో సందడి చేశాడు. సునీల్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడితో కలిసి 'ఎఫ్ 3' సినిమా కోసం దాదాపు 70 రోజులు పని చేశాను. ఇన్ని రోజుల్లో నేను ఆయనను చాలా దగ్గరగా చూశాను. ఎప్పుడు చూసినా చాలా ఎనర్జీతో కనిపిస్తాడు. ఆయనని చూస్తే మనకి కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది.
ఆయన కష్టపడే విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి  ఎవరూ సినిమా తీయలేరు. ఇక ఆయనలోని హాస్పిటాలిటీ కూడా నచ్చుతుంది.

సెట్లో  ఆయన ఎవరిపై  ఏ విషయంలోనూ కోప్పడటం నేను చూడలేదు. భోజనాల సమయం  కాగానే అందరం కలిసి కూర్చుని తిందామని అంటాడు. సరదాగా అందరితో కలిసి భోజనం చేస్తాడు. ప్రతి ఒక్కరికీ కూడా ఆయన తన ఫ్యామిలీలో మెంబర్ లా అనిపిస్తాడు. అందువలన నేను ఎప్పుడూ కారవాన్ కి వెళ్లేవాడిని కాదు .. ఆయనతో కలిసే భోజనం చేసేవాడిని. ఆ రోజున మరో షూటింగు ఉందనీ .. ఫలానా సమయానికి అక్కడికి వెళ్లాలని చెబితే  కొంతమంది డైరెక్టర్లు విసుక్కుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం సాధ్యమైనంత త్వరగా పంపించేయాలని చూస్తాడు.

ఇలా ఒక ఆర్టిస్ట్ ఇబ్బందిని అర్థం చేసుకుని సహకరించే దర్శకుడిగా నేను రాఘవేంద్రరావుగారిని చూశాను. ఈ జనరేషన్లో  మాత్రం అనిల్ రావిపూడిని మాత్రమే చూశాను. షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ మాదిరిగా సరదాగా సాగిపోయింది. ఒక్కోరోజు ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఐటమ్స్  షేర్ చేసుకోవడం భలేగా అనిపించేది. కారవాన్స్ అన్నీ వరుసగా ఉండటం చూస్తే ఒక బస్సు డిపోలా అనిపించేది. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. ఈ  సినిమా చేసిన తరువాత మళ్లీ అనిల్ తో కలిసి ఎప్పుడు సినిమా చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.