Begin typing your search above and press return to search.

ఓటీటీలోనే ఎక్కువగా ఫోకస్ అవుతున్న వర్సటైల్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   14 July 2022 8:30 AM GMT
ఓటీటీలోనే ఎక్కువగా ఫోకస్ అవుతున్న వర్సటైల్ యాక్టర్..!
X
వర్సటైల్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో అలరించిన టాలెంటెడ్ యాక్టర్.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకోడానికి కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు.

అయితే సత్యదేవ్ సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలు లేదా యూట్యూబ్ లలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవలే కాలంలో పలు చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. సత్యదేవ్ హీరోగా నటించిన '47 డేస్' మూవీ జీ 5 ఓటీటీలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.

అలానే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే.. 'గువ్వ గోరింక' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో విడుదలైంది. 'తిమ్మరుసు' 'స్కై ల్యాబ్' చిత్రాలను కూడా ఎక్కువ శాతం జనాలు ఓటీటీలోనే చూసారు.

సత్యదేవ్ డబ్బింగ్ చెప్పిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమా కూడా నేరుగా డిజిటల్ రిలీజ్ అయింది. 'బ్లఫ్ మాస్టర్' సినిమాని బిగ్ స్క్రీన్ మీద ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

'బ్లఫ్ మాస్టర్' తర్వాత సత్యదేవ్ మరియు దర్శకుడు గోపీ గణేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''గాడ్సే''. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమైంది.

'గాడ్సే' జూలై 17 నుండి ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిజెక్ట్ చేయబడిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సికె స్క్రీన్స్ బ్యానర్‌ పై సి కళ్యాణ్ నిర్మించిన ఈ థ్రిల్లర్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' అనే సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు సత్యదేవ్. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన ఈ సిరీస్ టాలెంటెడ్ యాక్టర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన 'పిట్ట కథలు' అంథాలజీ సిరీస్ లోని ఓ భాగంలో నటించాడు.

అలానే తెలుగు ఓటీటీ ఆహా కోసం 'లాక్డ్' అనే థిల్లర్ సిరీస్ చేశాడు సత్యదేవ్. ఇది సక్సెస్ అవడంతో దీనికి సీక్వెల్ గా ఇప్పుడు 'లాక్డ్ 2' సిరీస్ రూపొందిస్తున్నారు. ఇలా డైరెక్ట్ ఓటీటీ రిలీజులు - ఎర్లీ స్ట్రీమింగులు మరియు వెబ్ సిరీసులు అంటూ ఏదొక విధంగా డిజిటల్ వేదికల మీదనే సత్యదేవ్ ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు.

అందుకే రాబోయే రోజుల్లో ఓటీటీ మెగాస్టార్ - ఓటీటీ సూపర్ స్టార్ అని ట్యాగ్ లైన్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది అటుంచితే సత్యదేవ్‌ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కే 'రామ్ సేతు' అనే హిందీ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్నా భాటియా తో కలిసి చేసిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. మేకర్స్ సరైన రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' చిత్రంలో సత్యదేవ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ నిర్మాణంలో చేసిన 'కృష్ణమ్మ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక సత్యదేవ్ సొంతంగా బ్యానర్ ఏర్పాటు చేసి, 'ఫుల్ బాటిల్' అనే చిత్రం చేస్తున్నాడు.