Begin typing your search above and press return to search.

అదిరే ఆన్స‌ర్‌: స‌హ‌జీవ‌నం చేస్తే స‌పోర్ట్ ఇవ్వాలా?

By:  Tupaki Desk   |   8 Oct 2017 6:54 AM GMT
అదిరే ఆన్స‌ర్‌: స‌హ‌జీవ‌నం చేస్తే స‌పోర్ట్ ఇవ్వాలా?
X
కొంత‌మంది ఎంత క్లారిటీగా ఉంటారో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ముక్కుసూటి.. ముక్కుసూటి అంటారు కానీ.. ఈ మ‌ధ్య‌కాలంలో అలాంటి ముక్కుసూటిగా ఉండేవారు రాజ‌కీయ‌.. సినిమా రంగాల్లో త‌గ‌ల్లేద‌ని చెప్పాలి. ఆ కొర‌త‌ను తీర్చేలా ఉన్నాయి సీనియ‌ర్ న‌టి గౌత‌మి మాట‌లు.

ప్ర‌ముఖ న‌టుడితో కొన్నేళ్లు స‌హ‌జీవనం చేసిన ఆమె.. కార‌ణం చెప్ప‌కుండానే విడిపోయారు. వారిద్ద‌రి మ‌ధ్య ఏ కార‌ణం చేత విడిపోయారు? అన్న దానికి ఎవ‌రి ద‌గ్గ‌రా స్ప‌ష్ట‌మైన స‌మాధానం క‌నిపించ‌దు. అమ్మ అనారోగ్యం.. మ‌ర‌ణం త‌ర్వాత గౌత‌మి రాజ‌కీయ అంశాల విష‌యంలో యాక్టివ్ గా ఉండ‌టం.. బీజేపీకి ద‌గ్గ‌ర కావ‌టం క‌నిపిస్తుంది. ఒక‌ద‌శ‌లో ఆమె ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతార‌న్న మాట బ‌లంగా వినిపించింది.

అయితే.. భారీ ఎత్తున సాగిన అక్ర‌మాల నేప‌థ్యంలో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవ‌టంతో ఆ ఎన్నిక ముచ్చ‌ట వెన‌క్కివెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు విశ్వ క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ సంద‌ర్భంలో క‌మ‌ల్ తో ఒక‌ప్పుడు స‌హ‌జీవ‌నం చేసిన న‌టి గౌత‌మిని చెన్నైలోని స్థానిక మీడియా ఒక ఆస‌క్తిక‌ర క్వ‌శ్చ‌న్ వేసింది.

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న క‌మ‌ల్ హాస‌న్‌కు మీరు మ‌ద్ద‌తు ఇస్తారా? అని ప్ర‌శ్నించింది. దీనికి ఊహించ‌ని రీతిలో బ‌దులిచ్చింది గౌత‌మి. అలాంటి రూల్ ఏమైనా ఉందా? అని అడ‌గ‌ట‌మే కాదు.. కొంత‌కాలం స‌హ‌జీవ‌నం చేసినంత మాత్రాన రాజ‌కీయాల్లో క‌లిసి న‌డుస్తామ‌ని భావించ‌న‌క్క‌ర్లేదని తేల్చేశారు. క‌మ‌ల్ కానీ ర‌జ‌నీకాంత్ కానీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. పార్టీలు పెట్టినా అవి వారి సొంత నిర్ణ‌యాలుగా భావిస్తాన‌న్నారు. ఎవ‌రైతే ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి.. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాడ‌తారో వారికే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ఇవ‌న్నీచెబుతూనే త‌న‌కిప్పుడు రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక లేద‌న్న స్ప‌ష్ట‌త ఇచ్చేశారు. ఏమైనా ఇంత క్లారిటీగా మాట్లాడిన వాళ్లు ఈ మ‌ధ్య‌న లేర‌నే చెప్పాలి క‌దూ?