Begin typing your search above and press return to search.

50 ప్ల‌స్‌ లో డిగ్రీ ప‌రీక్ష రాసిన న‌టి

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:30 PM GMT
50 ప్ల‌స్‌ లో డిగ్రీ ప‌రీక్ష రాసిన న‌టి
X
60 ఏళ్ల‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాస్తున్న వృద్ధురాలు.. 50 ఏళ్ల వ‌య‌సులో డిగ్రీ ప‌రీక్షకు హాజ‌రైన న‌డి వ‌య‌స్కుడు అని వార్త‌లు చ‌దువుతుంటాం. ఇప్పుడు ఓ న‌టి 50 ప్ల‌స్ వ‌య‌సులో డిగ్రీ ప‌రీక్ష‌కు హాజ‌రై ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌. మామూలుగా సినీ రంగంలోకి వ‌చ్చాక చ‌దువును ప‌ట్టించుకోవ‌డం చాలా చాలా త‌క్కువ. చ‌దువు స‌రిగా రాని వాళ్లే సినిమాల్లోకి వెళ్తార‌ని లేదంటే సినిమాల వైపు మ‌న‌సు మ‌ళ్లితే చ‌దువు మీద దృష్టి ఉండ‌ద‌ని అనుకుంటారు. కానీ హేమ మాత్రం 50 ప్ల‌స్ వ‌య‌సులో డిగ్రీ ప‌రీక్ష రాసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. క‌రోనా కాలంలో ఆమె న‌ల్గొండ జిల్లాకు వెళ్లి మ‌రీ ప‌ర‌క్ష రాయ‌డం విశేషం.

అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివేందుకు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న‌ హేమ‌.. ఆదివారం నల్గొండ‌ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో అర్హత పరీక్ష రాసింది. త‌న‌కు ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని - ఇప్ప‌టికి అందుకోసం ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టాన‌ని హేమ చెప్పింది. మ‌రి న‌ల్గొండకు వెళ్లి ప‌రీక్ష ఎందుకు రాశార‌ని అడిగితే.. క‌రోనా టైం కావ‌డంతో హైద‌రాబాద్‌లో కేసులు ఎక్కువ ఉండ‌టం - ట్రాఫిక్‌ ను కూడా దృష్టిలో ఉంచుకుని న‌ల్గొండ‌ను సెంట‌ర్‌ గా ఎంచుకున్న‌ట్లు హేమ వెల్ల‌డించింది. ఎవరి కంటా పడకూడదని తాను అనుకున్న‌ప్ప‌టికీ మీడియా దృష్టిలో ప‌డిపోయాన‌ని ఆమె అంది. ప్ర‌స్తుతం తాను రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాన‌ని.. అట్నుంచి న‌ల్గొండ‌కు వ‌చ్చి ప‌రీక్ష రాశాన‌ని ఆమె వెల్ల‌డించింది. ఒక‌ప్పుడు బిజీ ఆర్టిస్టుగా ఉన్న హేమ‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ వివాదాల త‌ర్వాత బాగా సినిమాలు త‌గ్గిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు చ‌దువు మీద ధ్యాస మ‌ళ్లిన‌ట్లుంది.