Begin typing your search above and press return to search.

బికినీ వేసామంటే బోల్డ్ అని అర్థం కాదు!

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
బికినీ వేసామంటే బోల్డ్ అని అర్థం కాదు!
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత ఎం.ఎస్.రాజు తెర‌కెక్కించిన `7 డేస్ 6 నైట్స్` జూన్ 24న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ రోమ్-కామ్ లో సుమంత్ అశ్విన్- మెహర్ చాహల్- రోహన్ - కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. MS రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొత్త నటి మెహర్ చాహల్ గ్లామ‌ర‌స్ పాత్రను పోషించింది. త‌న‌ పాత్ర గురించి సినిమా గురించిన విశేషాలను మెహ‌ర్ చాహ‌ల్ ప‌ది పాయింట్ల‌లో చెప్పేశారిలా.

టాలీవుడ్ కు నా పరిచ‌యం ఆస‌క్తిక‌రంగా సాగింది. నేను అస్సాంలో పుట్టాను. నాన్న‌గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నా చిన్నతనం నుండి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నివసించాను. నేను గతంలో 4-5 సంవత్సరాల పాటు ముంబైలో ఉన్నాను. ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్ కతాలో నివసిస్తున్నాను. నాకు ప్రయాణించడం .. విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడం ఇష్టం.

ముంబైలో ఉన్నప్పుడు ఓ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. నా డైరెక్టర్ (ఎంఎస్ రాజు) నా ప్రొఫైల్ చూసి నన్ను ఆడిషన్ కి పిలిచారు. అతనికి బాగా తెలుసు.. ఆడిషన్ ముగిసిన వెంటనే అతను నన్ను ఎంచుకున్నాడు. నేను ఈ పాత్రకు సరిపోతాను లేదా ఇంకేదైనా ప్ర‌త్యేక‌త నాలో ఉండి ఉండాలి. అందుకే నన్ను ఎంపిక చేసుకున్నారు.

ద‌ర్శ‌క‌నిర్మాత ఎం.ఎస్.రాజు సార్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన గతంలో ప్రభాస్ లాంటి స్టార్ తో పని చేశారని తెలిసింది. అతనితో క‌లిసి ప‌ని చేయ‌డం ఎగ్జైటింగ్ గా అనిపించింది. స్క్రిప్ట్ కూడా ఎగ్జ‌యిట్ చేసింది. ఈ మూవీ కథ యువ‌తీయువకుల చుట్టూ తిరుగుతుంది.

షూటింగ్ చేస్తున్నప్పుడు మేము చాలా కూల్ ప్లేస్ లో ఉన్నాం. దర్శకుడు తేలికగా స్నేహపూర్వకంగా క‌లిసిపోవ‌డంతో ప‌ని సులువైంది. చాలా సాధారణ వాతావరణంలో ఫ్లోలో న‌టించేందుకు ఆస్కారం క‌ల్పించారు ఆయ‌న‌. ఈ ప్రక్రియను ఆస్వాధించేలా చేసారు.

నేను గోవాలో నివసిస్తూ ఒక‌ రెస్టారెంట్ లో పనిచేసే సాధారణ టీనేజ్ అమ్మాయిగా నటించాను. త‌ను మొదట్లో సిగ్గుపడుతుంది. పురుషులు ట్రిప్ లో గోవాను సందర్శించినప్పుడు ఆమె తన మహిళా స్నేహితుల‌తో పాటు ఇద్దరు అబ్బాయిల‌తో కలిసి ఉంటుంది. కథలో ఇంకా ఏదో ట్విస్టు ఉంది. నేను దానిని బయటపెట్టలేను.. అని తెలిపింది.

ఈ మూవీ `హౌస్ ఫుల్` (హిందీ) త‌ర‌హాలో ఉండే రోమ్-కామ్. ఈ మూవీని వీక్షిస్తే చాలా బాగా నవ్వుకోవ‌చ్చు. ఈ సినిమాను పట్టాలెక్కించినప్పుడు నేను మొదట్లో కొంచెం కంగారుపడ్డాను.. కానీ చివరికి అంతా బాగానే జరిగినందుకు కృతజ్ఞతలు. నా డైరెక్టర్ టీమ్ కి ధన్యవాదాలు.

గోవా- మంగళూరులో షూటింగ్‌ చేశాం. బీచ్ లో షూటింగ్ చేయడం ఆనందంగా .. చాలా సరదాగా అనిపించింది. ప్ర‌తిదానిలో నేర్చుకునేందుకు స్కోప్ క‌నిపించింది. నేను ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చింది. ఒక్కోసారి హడావిడిగా ఉండేది. అయితే అది ఊహించ‌గ‌లిగేదే! విభిన్న నేపథ్యాల వ్యక్తులతో కలిసి పని చేయాల్సి వచ్చింది.

నేను నా వాయిస్ కి డబ్బింగ్ చెప్పనప్పటికీ షూటింగ్ ప్రారంభమయ్యే ముందు తెలుగు భాష‌ కొంత నేర్చుకున్నాను. నేను సినిమా చూశాను .. ఆద్యంతం ఆనందించాను. ఇది సరదాగా సాగే సినిమా. మొదటి సినిమా అయినా నాకు సంబంధించినంతవరకు ఇది చాలా బాగా వచ్చిందని నేను భావిస్తున్నాను.

యువ‌తీయువకులే కాదు.. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ `7 డేస్ 6 నైట్స్` మూవీని చూడగలరు. కుటుంబానికి దూరంగా ఉంటూ కొత్త చోట పని చేస్తున్న చాలా మంది యువతులలో కనిపించే లక్షణాలు ఈ సినిమాలో నా పాత్రలో ఉన్నాయి..

ఇది బోల్డ్ సినిమా కాదు. గోవాలో ఉన్నప్పుడు స్విమ్ సూట్‌ వేసుకోవడం వల్ల సినిమా బోల్డ్ గా ఉందని అర్థం కాదు. అసభ్యకరమైన లేదా సందర్భోచితంగా ఏమీ లేదు. ఇది కొత్త-యుగానికి చెందిన‌ చిత్రం. షూటింగ్ ఆద్యంతం మా దర్శకుడు యూత్ తో కలిసిపోయేందుకు ఇది సహాయపడింది. అతను ఓపికగా ఉంటారు. మ‌మ్మల్ని భయపెట్టడు. అతను అంద‌రి మాటలు వింటాడు. చాలా అనుకూలమైనవాడు. ఆ ల‌క్ష‌ణాల వ‌ల్ల‌నే ఆయనతో వర్క్ చేయడం సులువైంది.

నేను చేసిన రెండో సినిమా మిస్టరీ థ్రిల్లర్. నేను సవాల్ చేయాలనుకుంటున్నాను. నేను నటిగా ఇక నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడాలనుకుంటున్నాను. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం.

దక్షిణాది సినిమాల్లో ప్రభాస్- రానా దగ్గుబాటి- తమన్నా భాటియా- ధనుష్ నటించిన సినిమాలు చూశాను. హిందీలో నాకు పంకజ్ త్రిపాఠి - విజయ్ రాజ్ అంటే చాలా ఇష్టం.