Begin typing your search above and press return to search.

ఓటీటీలో రిలీజ్ కానున్న అమ్మడి బాలీవుడ్ డెబ్యూ మూవీ...?

By:  Tupaki Desk   |   5 Jun 2020 7:30 AM GMT
ఓటీటీలో రిలీజ్ కానున్న అమ్మడి బాలీవుడ్ డెబ్యూ మూవీ...?
X
హీరోయిన్ ప్రణీత పేరు వినగానే సినీ అభిమానులకు ఆమె అందమైన కళ్ళు.. పాల బుగ్గలు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే నవ్వు గుర్తొస్తాయి. 'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రణీత 'బావ' 'పాండవులు పాండవులు తుమ్మెద' 'డైనమైట్' 'రభస' 'బ్రహ్మోత్సవం' 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఏ ముహూర్తాన 'అమ్మో.. బాపుగారి బొమ్మ' అంటూ ప్రణీత కోసం పాట రాశారో గానీ అప్పటి నుంచి ఆ పేరే ఫిక్స్ అయింది అమ్మడికి. అయితే అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. కానీ కన్నడ ఇండస్ట్రీ లో మాత్రం అమ్మడు తన హవా చూపించింది. దీని గురించి ఇటీవల ప్రణీత స్పందిస్తూ కన్నడ తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయని.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఇక్కడ ఎక్కువగా చేయలేక పోయానని తెలిపింది. కాగా బాపుగారి బొమ్మ ప్రణీత బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి 'భుజ్' మరియు 'హంగామా 2' చిత్రాల్లో నటించింది.

ఇదిలా ఉండగా ప్రణీత బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన 'భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ సంజయ్ దత్ సోనాక్షీ సిన్హా నోరా ఫతేహి తో కలిసి ప్రణీత నటిస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందట. ఇప్పటికే అభిషేక్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన బాలీవుడ్ మూవీ 'గులాబో సితాబో' ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రణీత హిందీ డెబ్యూ మూవీ 'భుజ్' కూడా అదే దారిలో వెళ్లబోతోందట. ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పెద్ద మొత్తాన్ని చిత్ర నిర్మాతలకు ఆఫర్ చేసిందట. దీనికి చిత్ర నిర్మాతలు కూడా అంగీకారం తెలపబోతున్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా ప్రణీత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.