Begin typing your search above and press return to search.

నాది 45ఏళ్ల సినీ ప్రయాణం.. రఘువరన్ తో అందుకే విడిపోయా.. పుట్టింది ఇక్కడే : రోహిణి

By:  Tupaki Desk   |   6 Jan 2021 11:30 AM GMT
నాది 45ఏళ్ల సినీ ప్రయాణం.. రఘువరన్ తో అందుకే విడిపోయా.. పుట్టింది ఇక్కడే : రోహిణి
X
‘రోహిణి..’ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ.. ఆమెను చూస్తే మాత్రం ‘మాకెందుకు తెలియదు?’ అంటారు. చూడగానే.. ఆ ముగ్ధమనోహరమైన రూపం మన బంధువుల్లో ఒకరిలా అనిపిస్తుంది. మన పక్కింటి ఆడపడుచులా కనిపిస్తుంది. తెరపై ఆమె పాత్రలు కూడా అలాగే ఉంటాయి. తెలుగులో కొన్ని చిత్రాల్లోనే కనిపించిన రోహిణి.. మళయాలీ నటిగా ఎక్కువగా గుర్తింపు పొందారు. లేటెస్ట్ గా ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రను పోషించడంతో అందరికీ సుపరిచితం అయ్యారు రోహిణి. అయితే.. తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా తనదైన ముద్రవేశారు. స్క్రిప్ట్ రైటర్ నుంచి డైరెక్టర్ వరకూ పలు బాధ్యతలు నిర్వర్తించారు. సినీ ఇండస్ట్రీలో నాలుగున్నర దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్న రోహిణి.. మన తెలుగువారే అంటే ఆశ్చర్యం కలగక మానదు. విశాఖ జిల్లా అనకాపల్లి రోహిణి సొంత ఊరు. తాజాగా.. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె.. మీడియాతో ముచ్చటించారు. తన సినీ ప్రస్థానం గురించి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

అనకాపల్లితో అనుబంధం..
నేను అనకాపల్లిలోనే పుట్టాను. ఐదేళ్ల వరకు ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే చనిపోయారు. మా నాన్నగారికి సినిమాలంటే ఇష్టం. అమ్మ చనిపోయాక చెన్నైకి వెళ్లిపోయాం. ఇటీవల మా నాన్నగారు చనిపోయారు. వారి కార్యక్రమం కోసమే అనకాపల్లి వచ్చాం. నా సోదరుడు సినీ నటుడు బాలాజీ కూడా ఇక్కడకు వచ్చాడు. విజయరామరాజుపేటలో నాన్నగారికి ఇల్లు ఉంది. మా మేనమామకు వేల్పుల వీధి లో ఇల్లు ఉంది.

బాలనటిగా ప్రవేశం..
నాన్నగారు పంచాయతీ అధికారిగానూ, కొద్దిపాటి వ్యాపారం ఉండడంతో ఆయనకు సినిమారంగంపై ఆసక్తి ఉండేది. అమ్మ చనిపోయిన తర్వాత.. ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడితో కలిసి నేను, నాన్న చెన్నైకు వెళ్లిపోయాం. నా తొలి సినిమా ‘యశోదకృష్ణ.’ ఈ చిత్రంలో చిన్ని కృష్ణుని పాత్ర వేశాను. ఆ విధంగా బాలనటిగా తెరంగేట్రం చేశాను. ఈ 45 సంవత్సరాల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించాను. స్క్రిప్ట్‌రైటర్‌గా, కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, కథానాయకిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు విభాగాల్లో పనిచేశాను.

పన్నెండేళ్లదాకా అక్షరాలు దిద్దలేదు..
అయితే.. చిన్న తనంలో చదువుకోలేకపోయాను. పరిస్థితుల ప్రభావం వల్ల నాకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకూ అక్షరాలు దిద్దలేకపోయాను. ఆ తర్వాతే చదువుకునే అవకాశం దక్కింది.

మంచి పేరు సంపాదించా..
నేను మలయాళం సినిమాలో హీరోయిన్‌గా పరిచయమయ్యాను. నటిగా మలయాళ సినిమా రంగంలో బాగా పేరొచ్చింది. అదే సందర్భంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించాను. ‘గీతాంజలి’ సినిమాలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. ‘శివ’ సినిమాలో అమల పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. బొంబాయి సినిమాలో మనీషా కొయిరాలాకు తగ్గట్టుగా గొంతు మార్చుకునేందుకు శ్రమపడ్డాను. ‘రావణ్‌’ సినిమాలో ఐశ్వర్యారాయ్‌కు కూడా వాయిస్ ఇచ్చాను. తెలుగు, తమిళంలో ఎక్కువగా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కొనసాగినప్పటికీ.. మలయాళంలో మాత్రం కథానాయకిగానే గుర్తింపు పొందాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సత్కరించింది.

రఘువరన్ తో ప్రేమ..
మొదటి సినిమాలో హీరోయిన్ గా చేసినప్పుడు రఘవరన్‌ ను చూశాను. అలా మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకున్నాం. అయితే.. తర్వాత ఆలోచనలు కుదరకపోవడంతో విడిపోయాం. అప్పటికే బాబు జన్మించాడు. ఇద్దరమూ ఇష్టపూర్వకంగానే విడిపోయాం.

డైరెక్టర్ కూడా అయ్యాను..
సినిమా రంగంలో బాలనటుల కష్టనష్టాలపై ‘సైలెంట్‌ హ్యూస్‌’ పేరుతో డాక్యుమెంటరీని తీశాను. ఆ తర్వాత స్క్రిప్ట్‌ రైటర్‌ గా, రచయితగా మారాను. ఆ తర్వాత దర్శకురాలిగా మారి ‘అప్పావిన్‌మీసై’ (నాన్న మీసం) అనే తమిళ సినిమా తీశానున. ‘వెల్కమ్‌ ఒబామా’ సినిమాకు దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారి వద్ద సహాయకురాలిగా పని చేసిన అనుభవం ఉపయోగపడింది.

ఆ పాత్ర మంచి అవకాశం..
డైరెక్టర్ నందిని తీసిన ‘అలా మొదలైంది’ సినిమాలో నేను చేసిన తల్లిపాత్ర ఓ మంచి అవకాశంగా భావిస్తాను. ‘బాహుబలి’లో ప్రభాస్‌ తల్లిగా నటించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను చేసిన అన్ని పాత్రలూ నాకు డ్రీమ్‌రోల్సే. 300 పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని ప్రేక్షకుల అభిమానం పొందిన నేను ఎంతో అదృష్టవంతురాలిని అనుకుంటా.

కష్టాలు దృఢంగా మార్చాయి..
నా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు నన్ను మానసికంగా దృఢపరిచాయి. చిన్నతనంలోనే అమ్మ చనిపోయినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. రఘువరన్‌ తో విడిపోయినప్పుడు కూడా మానసిక సంఘర్షణకు గురయ్యాను. ఆయన చనిపోవడానికి ముందు కొన్ని పాటలు పాడి వీడియో తీశారు. ఆ ఆల్బమ్‌ను రజనీకాంత్‌ చేతులమీదుగా ఆవిష్కరించాం.

వాళ్లే ధైర్యాన్నిచ్చారు..
నాది ఒంటరి జీవితమే అనిపించినప్పుడల్లా సినీ రంగ మిత్రులు, బంధువుల ఆప్యాయత ధైర్యాన్నిచ్చేది. ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్‌లో షూటింగ్‌లు చేస్తున్నప్పుడు అందరూ నా జీవితం గురించి.. బాబు గురించి అడిగేవారు. ఆ ఆప్యాయత నాకెంతో ధైర్యాన్ని ఇచ్చేది. సినీ రంగమే నాకు అండగా ఉంది.