Begin typing your search above and press return to search.

నేను ఇప్పుడు గాల్లో తేలుతున్నాను: సమంత

By:  Tupaki Desk   |   19 Nov 2022 1:30 AM GMT
నేను ఇప్పుడు గాల్లో తేలుతున్నాను: సమంత
X
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత గత కొన్ని నెలలుగా ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొంటూ వస్తోంది. గతేడాది విడాకులు ప్రకటన చేసిన తర్వాత కెరీర్ మీదనే ఫోకస్ పెట్టిన నటి.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుంది కానీ.. సామ్ కు ఆరోగ్యం సహకరించలేదు.

సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మైయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూనో వ్యాధితో బాధ పడుతోంది. అనారోగ్యం కారణంగా ఆమె గత కొంకాలంగా అన్నిటికీ దూరంగా ఉంటూ వస్తోంది. చికిత్స తీసుకుంటూనే వైద్యుల పర్యవేక్షణలో "యశోద" సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసింది.

"యశోద" ప్రమోషన్స్ లో భాగంగా సామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి పరిస్థితులతో పోరాడుతుందో చెప్పుకొని భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం తానున్న స్టేజీ ప్రాణాపాయం మాత్రం కాదని.. కానీ తన ఆరోగ్య పరిస్థితి - వ్యాధి తీవ్రత అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉందని తెలిపింది. శక్తి వంచన లేకుండా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

హరి & హరీష్ దర్శకత్వం వహించిన "యశోద" సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన నేపథ్యంలో.. తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేసింది. కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు మరియు టీమ్ మొత్తానికి నటి కృతజ్ఞతలు తెలిపింది.

"డియర్ ఆడియన్స్.. యశోద పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణకు నా ధన్యవాదాలు. మీ ప్రశంసలు మరియు మద్దతు నేను కోరుకున్న గొప్ప బహుమతి. నేను ఆనందంతో కృతజ్ఞతతో పొంగిపోయాను. థియేటర్లలో మీ సెలబ్రేషన్స్ చూడటం.. విజిల్స్ వినడం యశోద బృందం మొత్తం పడిన కష్టానికి తగిన సాక్ష్యం"

"ఇప్పుడు నాకు గాల్లో తేలుతున్నట్లు వుంది. యశోద మేకింగ్ లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ పై నాపై నమ్మకం ఉంచిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను"

"అలాగే దర్శకులు హరి - హరీష్ లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రియమైన కో స్టార్స్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు - ఉన్ని ముకుందన్ గారు మరియు మిగిలిన నటీనటులతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతతో" అని సమంత తన పోస్టులో రాసుకొచ్చింది.

ఇకపోతే సమంత కోలుకున్న తరవాత "ఖుషి" సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అలానే సామ్ టైటిల్ రోల్ పోషించిన "శాకుంతలం" అనే పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.