Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ యాడ్ వివాదం.. ఇడియట్స్ అంటూ 'కాశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 3:15 PM GMT
అమీర్ ఖాన్ యాడ్ వివాదం.. ఇడియట్స్ అంటూ కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ట్వీట్..!
X
బాలీవుడ్ స్టార్ హీరో, అమీర్ ఖాన్ మరియు కియారా అడ్వాణీ తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకి సంబంధించిన ఈ ప్రకటన ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దీనిపై విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మండిపడ్డారు. ఇది సామాజిక క్రియాశీలత తప్పుగా ఉందనడానికి ఉత్తమ ఉదాహరణ అని ఆరోపించారు.

ఏయూ బ్యాంకు ప్రకటనలో నవ వధూవరులైన అమీర్ ఖాన్ - కీయరా జంట.. పెళ్లి తర్వాత తమ కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కొత్త జంటని కుటుంబ సభ్యులు ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అప్పుడు ఎవరు ముందు వెళ్లాలని ఆమీర్ అడుగుతాడు. దానికి ఇంటికి ఎవరు కొత్తగా వస్తే వారే అని కియారా అంటుంది. దాంతో ఆమీర్ కుడి కాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తాడు.

సాధారణంగా హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం జరిగే పెళ్లిళ్లలో వరుడి ఇంటికి వధువు వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ అనారోగ్యంతో ఉన్న కీయారా తండ్రికి సహాయం చేయడానికి వధువు ఇంటికి అల్లుడు వెళ్లినట్లు ప్రకటన చూపిస్తుంది. అతను ఇంట్లోకి తొలి అడుగు వేసే సన్నివేశం కొత్త ఇంట్లోకి వధువు అడుగుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో అంతే డ్రమాటిక్ గా డిజైన్ చేశారు.

"శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు అలా ఎందుకు కొనసాగాలి? అందుకే మేము ప్రతి బ్యాంకింగ్ సంప్రదాయాన్ని ప్రశ్నిస్తాం. తద్వారా మీకు ఉత్తమమైన సేవలు అందుతాయి" అని అమీర్ ఖాన్ బ్యాంక్ ప్రకటన ముగించారు. అయితే ఇదే ఇప్పుడు చాలా మంది కోపానికి కారణమైంది. హిందూ సంప్రదాయాలను మారుస్తారా? అంటూ అమీర్ - కీయరా లతో పాటుగా బ్యాంక్ వారిని కూడా ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘ది కాశ్మీరీ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన పై స్పందించాడు. ఏయూ బ్యాంకు యాజమాన్యంపై విమర్శలు చేశాడు. సామాజిక మతపరమైన సంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటి నుంచి బాధ్యత వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేసి హిందువులు ట్రోల్ చేస్తున్నారని దర్శకుడు అన్నారు.

''సామాజిక & మతపరమైన సంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటి నుండి బాధ్యత వహిస్తున్నాయో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను?. అవినీతి బ్యాంకింగ్ వ్యవస్థను మార్చడం ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు క్రియాశీలక పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పనికిమాలిన పనులను, మార్పులను హిందువు సంప్రదాయాల్లో చేసి ట్రోల్ చేస్తున్నారు చేస్తారు. ఇడియట్స్'' అని వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే దర్శకుడికి ప్రపంచంలోనే ఇష్టమైన నటుడు అమీర్ ఖాన్ కావడం గమనార్హం.

అయితే అగ్నిహోత్రి ట్వీట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రకటన అని.. దాని ద్వారా పితృస్వామ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం దర్శకుడికి మద్దతుగా నిలుస్తూ.. ఆమీర్ ఖాన్ - కీయరా మరియు ఏయూ బ్యాంకుపై విమర్శలు చేస్తూ ‘ఆ బ్యాంకుని బాయ్ కాట్ చేయాలి‘ అని ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ యాడ్ లో అమీర్ ఖాన్ కాకుండా మరో హీరో నటించినా ఇలానే ట్రోల్ చేసేవారా? ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమీర్ గతంలో చేసిన 'అసహనం' కామెంట్స్ కారణంగా ఇప్పటికీ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడు. దాని ఫలితంగా అమీర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఆయన నటించిన యాడ్ పై కూడా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ప్రకటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.