Begin typing your search above and press return to search.

ఆదా.. నీ కామెంట్ మరీ అతిగా ఉందమ్మా

By:  Tupaki Desk   |   23 Aug 2015 2:14 PM GMT
ఆదా.. నీ కామెంట్ మరీ అతిగా ఉందమ్మా
X
రోమ్ కు వెళ్తే రోమన్ లా ఉండాలని అని ఓ సామెత. దీన్ని మహబాగా వంటబట్టించేసుకున్నట్లుంది ఆదా శర్మ. ‘హార్ట్ అటాక్’ లాంటి హిట్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టినా అమ్మడి కెరీర్ అంతగా ఊపందుకోలేదు. ప్రస్తుతం ఆది సరసన చేస్తున్న సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ ముంబయి పిల్ల. ఐతే మంచి ఛాన్సులొస్తే తెలుగు సినిమాను ఏలేయాలని కలలు గంటున్న ఆదా.. ఓ ఇంటర్య్యూ లో కాబోయే వాడి గురించి చేసిన ఓ కామెంట్ వింటే డంగైపోవాల్సిందే. నీక్కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పమ్మా అని ఆదాను అడిగితే.. ‘‘అతను కచ్చితంగా మూగజీవాల్ని ప్రేమించేవాడై ఉండాలి. సున్నిత మనస్కుడై ఉండాలి. ఇంకా హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్ని కూడా సమానంగా ఇష్టపడేవాడై ఉండాలి’’ అని సెలవిచ్చింది.

అయినా కాబోయే వాడికి తెలుగు సినిమాల పిచ్చి ఉండాలని అనడంలో లాజిక్ ఏంటో జనాలకు అర్థమై చావట్లేదు. ఎంత టాలీవుడ్ సినిమాలు చేస్తుంటే మాత్రం కాబోయే వాడికి తెలుగు సినిమాలు నచ్చాలని కండిషన్ పెట్టడేమేంటో చిత్రంగా. ఆ మాటకొస్తే బాలీవుడ్ సినిమాలు మాత్రం ఎందుకు నచ్చాలి? ఎవరి టేస్టు వాళ్లది. మనకు నచ్చేవన్నీ మన జీవిత భాగస్వామికి కూడా నచ్చాలని ఏముంది? ఈ డిస్కషన్ పక్కనబెడితే.. తెలుగు సినీ జనాల్ని బుట్టలో వేయడానికే ఏదో అలా ఓ కామెంట్ విసిరినట్లుంది ఆదా. ఈ కామెంట్ విని.. తెలుగు సినిమాలంటే అమ్మడికి ఎంత ప్రేమో అని అవకాశాలు కురిపించేస్తారనుకుంది కాబోలు!