Begin typing your search above and press return to search.

ఇది ఇండియన్ సినిమా: మేజర్ పై శేష్ కామెంట్స్

By:  Tupaki Desk   |   18 March 2021 1:30 PM GMT
ఇది ఇండియన్ సినిమా: మేజర్ పై శేష్ కామెంట్స్
X
టాలీవుడ్ యువహీరో అడవిశేష్ ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా బయోపిక్ 'మేజర్'లో నటిస్తున్నాడు. ద్విభాషాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో అడవి శేష్ బాలీవుడ్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. అయితే మేజర్ సినిమా ద్విభాషా చిత్రం మాత్రమే కాదు. నా దృష్టిలో ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నాడు హీరో. ఈ సినిమా గురించి శేష్ మాట్లాడుతూ.. 'ఎప్పుడైనా ఓ మంచి కథను జనాలకు చూపించాలని అనుకుంటాం. అలా అందరికి చూపించాలని అనుకున్న కథే మేజర్ ఉన్నికృష్ణన్. ఇది కేవలం తెలుగు, మలయాళం భాషలకే చెందింది అనేది కాదు. అసలు నిజం ఏంటంటే.. మేజర్ ఉన్నికృష్ణన్ కార్గిల్ సైనికుడు, హైదరాబాద్ లో సేవలు చేసాడు. బెంగులూరులో పెరిగాడు. కేరళలో పుట్టాడు. పాన్ ఇండియా స్టోరీ అనడానికి ఇంతకన్నా ఏముంటుంది. మేం మేజర్ స్టోరీని అందరికి చూపించాలని అనుకుంటున్నాం.

ఇదంతా పక్కనపెడితే.. నేను బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఆలోచన నాలో లేదు. ఎందుకంటే మేజర్ అనేది ఇండియన్ సినిమాగా నేను భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు అడవిశేష్. నటించడమే కాకుండా ఈ సినిమాకు శేష్ రచయితగా కూడా పనిచేసాడు. అలాగే మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ గురించి ఎంతో రీసెర్చ్ కూడా చేసినట్లు తెలుస్తుంది. శేష్ ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమాకు సంబంధించి ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో చాలా విషయాలు చర్చించాను. ఇప్పుడు వాళ్లు నాకు సెకండ్ పేరెంట్స్ లా అయిపోయారు. ఇప్పటికి నేను వాళ్లతో ఫోన్ లో మాట్లాడుతుంటాను. నాకెప్పుడైనా సన్నివేశాల మధ్యలో సందేహం వస్తే వారికీ కాల్ చేసి మాట్లాడేవాడిని. అంతేగాక మేజర్ కలీగ్స్, స్నేహితులతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే నేను మేజర్ మేనల్లుడు ఎన్నారై మృనాల్ ద్వారా మేజర్ పేరెంట్స్ ని కలవడం జరిగింది. ఆయన సందీప్ కు సంబంధించిన పాత ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో సేవ్ చేసాడు. ఆ ఫోటోలు నేను సీన్స్ రాసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి' అన్నాడు శేష్. ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ నిర్మిస్తుండగా.. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 2న ఈ సినిమా విడుదల కాబోతుంది.