Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'అదుగో'

By:  Tupaki Desk   |   7 Nov 2018 9:34 AM GMT
మూవీ రివ్యూ: అదుగో
X
చిత్రం : 'అదుగో'

నటీనటులు: అభిషేక్ వర్మ-నభా నటేష్-రవిబాబు తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి
నిర్మాత: సురేష్ బాబు
రచన-దర్శకత్వం: రవిబాబు

దర్శకుడిగా తొలి సినిమా ‘అల్లరి’ నుంచి రవిబాబుది వైవిధ్యమైన ప్రయాణం. అతనిప్పుడు ఓ పంది పిల్లను హీరోగా పెట్టి ‘అదుగో’ అనే సినిమా తీశాడు. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఒక పిల్లాడు ఎంతో ప్రేమగా చూసుకునే బంటి అనే పంది పిల్ల అనుకోకుండా కొరియర్ రూపంలో ఓ కుర్రాడి దగ్గరికి చేరుతుంది. అది పంది పిల్ల అని తెలియక దాన్ని తన ప్రేయసి బహుమతిగా ఇస్తాడా కుర్రాడు. ఈ లోపు ఈ పంది పిల్ల కోసం రౌడీ గ్యాంగులు.. మాఫియా వాళ్లు వెంట పడటం మొదలుపెడతారు. ఈ పంది పిల్ల కోసం అంతమంది ఎందుకు వెంట పడుతున్నారు.. వీళ్ల నుంచి అదెలా తప్పించుకుని.. తన యజమాని దగ్గరికి చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

రవిబాబు కథలన్నీ కొంచెం విపరీత స్థాయిలోనే ఉంటాయి. వినోదం పండించడానికి అతను కొంచెం ఎక్స్ ట్రీమ్ ఆలోచనలే చేస్తుంటాడు. ఐతే రవిబాబు విపరీత ఆలోచనలు కొన్నిసార్లు కడుపుబ్బ నవ్విస్తాయి. కొన్నిసార్లు చాలా ఎబ్బెట్టుగా తయారవుతాయి. ‘అదుగో’ రెండో కోవకు చెందిన సినిమా. రవిబాబు లాంటి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న దర్శకుడు ఒక పంది పిల్లను పెట్టి హీరోగా తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. దీని ప్రోమోలు చూస్తే పంది పిల్ల విన్యాసాలు కడుపుబ్బ నవ్వించేసేలా కనిపించాయి. కానీ బలవంతంగా కితకితలు పెట్టుకుంటే తప్ప నవ్వులు పండని విధంగా తయారైంది ఇందులోని కామెడీ. కథలోని కీలకమైన మలుపులకు అసలు లాజిక్ అనేది ఉండదు.

కామెడీ అయినా సరే.. కొంచెం తర్కానికి అందేలా ఉండాలని.. కథలోని మలుపులు సహేతుకంగా అనిపించాలని ఆశిస్తున్నారు ఇప్పటి ప్రేక్షకులు. కానీ రవిబాబు లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్.. అసలు ఎక్కడా లాజిక్ అన్నదే పట్టించుకోకుండా.. ఎలా పడితే అలా కథను నడిపించేశాడు. కొన్ని సీన్లు చూస్తే రవిబాబు ప్రేక్షకుల్ని మరీ తక్కువ అంచనా వేశాడేమో అనిపిస్తుంది. ఇందులో రౌడీ గ్యాంగుల మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ అన్నవి మరీ సిల్లీగా అనిపిస్తాయి. కామెడీ కోసం ఉద్దేశించిన చాలా సీన్లు ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించకపోవడంతో చాలా చోట్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురవుతుంది. ట్రైలర్లో చూపించిన. రౌడీ గ్యాంగులతో పంది పిల్ల ఆడుకునే కొన్ని సీన్ల వరకు పర్వాలేదనిపించినా.. అంతకుమించి విశేషాలేమీ లేవు.

ఒక సమయంలో కొత్తగా అనిపించే విషయాలు.. కొన్నేళ్ల తర్వాత పాతగా.. రోతగా తయారవుతాయనడానికి ‘అదుగో’ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అల్లరి.. నచ్చావులే రోజుల్లో రవిబాబు కామెడీ కొత్తగా అనిపించేది. కానీ ఇప్పుడు కూడా అతను అదే తరహా కామెడీ ట్రై చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. కొన్ని సీన్లయితే మరీ భరించలేనట్లుగా తయారయ్యాయి. విలన్ మీదికి పంది పిల్ల మల విసర్జన చేయడం.. విలన్ తన అసిస్టెంట్ మీద పాన్ ఊయడం లాంటి సీన్లను రిపీట్ చేయడం చూస్తే కామెడీ కోసం రవిబాబుకు ఇంతకుమించి ఛాయిస్ కనిపించలేదా అనిపిస్తుంది. ఇలా వెగటు పుట్టించే సన్నివేశాలు సినిమాలో కోకొల్లలు. ఇక సినిమాకు హీరో అయిన పంది పిల్ల అంత సహజంగా లేకపోవడం వల్ల కూడా సినిమా అంతా కొంచెం కృత్రిమంగా తయారైంది.

కేవలం పంది పిల్ల చుట్టూనే కథ నడిపితే సరిపోదని.. ఒక అబ్బాయి-అమ్మాయి మధ్య ప్రేమకథను కూడా చూపించారు. కానీ అది కూడా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. ఉన్నంతలో పంది పిల్ల.. దాన్ని పెంచుకునే కుర్రాడి మధ్య ఎమోషన్ పర్వాలేదనిపిస్తుంది. కానీ ఇది కూడా కొంత మేరకే. ఐతే ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమా తరహాలో మనిషి-జంతువు మధ్య అనుబంధాన్ని మరింత ప్రభావవంతంగా చూపించి సెంటిమెంటు పండించే అవకాశాన్ని రవిబాబు ఉపయోగించుకోలేదు. మొత్తంగా ‘అదుగో’లో ఏ రసమూ సరిగా పండలేదు. ముఖ్యంగా దీన్నుంచి ప్రధానంగా ఆశించిన కామెడీ తేడా కొట్టేసింది. కామెడీ పండితే లాజిక్స్ గురించి కూడా ప్రేక్షకులు మరిచిపోయేవాళ్లు కానీ.. అది మిస్ కావడంతో చాలా చోట్ల లాజిక్ అన్నది పెద్ద సమస్యగా మారుతుంది. మొత్తంగా రవిబాబు చేసిన ఈ కొత్త ప్రయోగం ఎంతమాత్రమూ మెప్పించలేదు.

నటీనటులు:

సిక్స్ ప్యాక్ శక్తిగా రవిబాబు బాగానే చేశాడు. అక్కడక్కడా నవ్వించాడు. కొత్త కుర్రాడు అభిషేక్ వర్మ పర్వాలేదు. రవిబాబు హీరోల తరహాలోనే అతనూ కనిపించాడు. తడబాటు లేకుండానే నటించాడు. ‘నన్ను దోచుకుందువటే’ భామ నభా నటేష్ ఆకట్టుకుంది. మిగతా నటీనటులంతా రవిబాబు స్టయిల్లో చేసుకుపోయారు. ఇక పంది పిల్ల గురించి చెప్పాలంటే.. సినిమాలో అది ఎక్కడ ఒరిజినల్ గా కనిపించిందో.. ఎక్కడ యానిమేషనో అర్థం కాదు. కాబట్టి దాని హావభావాల గురించి మాట్లాడలేం.

సాంకేతిక వర్గం:

ప్రశాంత్ విహారి సంగీతం పర్వాలేదు. హీరో హీరోయిన్ల మీద వచ్చే పాట ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంలో ప్రశాంత్ం మార్కు కనిపించదు. రవిబాబు అభిరుచికి తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. సినిమాకు తగ్గట్లుగా ఉందది. సుధాకర్ రెడ్డి ఛాయాగ్రహణమూ అంతే. ఇది రవిబాబు సినిమా అని తెలిసేలా కెమెరా వర్క్ సాగింది. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. ఈ సినిమా ఎక్కువగా గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ ముడిపడింది. ఈ సినిమా స్థాయికి ఓకే కానీ.. గత కొన్నేళ్లలో అద్భుతమైన ఎఫెక్ట్స్ చూసిన ప్రేక్షకులకు ఇందులోని పనితనం అంత గొప్పగా అనిపించదు. ఇక దర్శకుడు రవిబాబు పంది పిల్లతో సినిమా తీయాలన్న ఆలోచన వరకు అభినందనీయుడు. కానీ కథాకథనాల విషయంలో అతను పూర్తిగా నిరాశ పరిచాడు. దర్శకుడిగా అతను ఔట్ డేట్ అయిపోయాడనిపిస్తుంది ‘అదుగో’ చూస్తుంటే. తన బలమైన కామెడీ విషయంలో రవిబాబు తేలిపోయాడు.

చివరగా: అదుగో.. పండని పంది పిల్ల కామెడీ

రేటింగ్-1/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre