Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' డైరెక్టర్ కు గిఫ్టుగా ఖరీదైన లగ్జరీ కారు..!

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:01 AM GMT
ఆదిపురుష్ డైరెక్టర్ కు గిఫ్టుగా ఖరీదైన లగ్జరీ కారు..!
X
'ఆదిపురుష్' సినిమా కారణంగా బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు లగ్జరీ కారుని బహుమతిగా పొంది మరో రకంగా వార్తల్లో నిలిచాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం "ఆదిపురుష్". రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

అయితే లేటెస్టుగా ఓం రౌత్ కు నిర్మాత భూషణ్ కుమార్ ఖరీదైన బహుమతిని అందించారు. సుమారు రూ. 4.02 కోట్ల విలువ చేసే ఫెరారీ F8 ట్రిబ్యూటో కారును 'ఆదిపురుష్' డైరెక్టర్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.

భూషణ్ కుమార్ గతంలోనూ పలువురికి కాస్టీ కార్లను గిఫ్టుగా అందించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'భూల్ భూలైయా-2' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. హీరో కార్తిక్ ఆర్యన్ కు రూ.4.70 కోట్ల విలువైన ఆరెంజ్ మెక్ లారెన్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆదిపురుష్' సినిమా చుట్టూ వివాదాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ లో వీఎఫ్ఎక్స్ పనులు మరీ నాసిరకంగా ఉన్నాయని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

మరోవైపు హిందువుల మనోభావాలను కించపరిచేలా పాత్రల చిత్రీకరణ ఉందంటూ పలువురు రాజకీయ నాయకులు - హిందీవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆదిపురుష్ మూవీపై బాయ్ కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది.

అయితే రామాయణ గాథను నేటి యువతరం, పిల్లలకు అర్థమయ్యేలా.. వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందని దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ కోసం తీశామని.. మొబైల్ ఫోన్స్ లో చూడటానికి భిన్నంగానే ఉంటుందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల 'ఆదిపురుష్' 3డీ టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించగా.. అనూహ్య స్పందన లభించింది. ఈ సినిమాలో రాఘవగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్.. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ కనిపించనున్నారు.

సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. IMAX - 3D ఫార్మాట్లలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' వంటి చారిత్రాత్మక చిత్రంతో సక్సెస్ అందుకున్న ఓం రౌత్.. "ఆదిపురుష్" తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.