Begin typing your search above and press return to search.

ఏపీ కోసం 'మేజర్' భారీ ప్లాన్..!

By:  Tupaki Desk   |   26 May 2022 2:04 PM GMT
ఏపీ కోసం మేజర్ భారీ ప్లాన్..!
X
వర్సటైల్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ రిలీజ్ కు రెడీ అయింది.

జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 'మేజర్' సినిమా విడుదల కాబోతోంది. అయితే అంతకంటే ముందే మే 24 నుంచి ఈ మూవీ ప్రివ్యూలు ప్రదర్శించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఈ ప్రివ్యూలు ప్లాన్ చేయగా.. ఇప్పటికే పూణె - అహ్మదాబాద్‌ లలో వేసిన షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శుక్రవారం లక్నో లో 'మేజర్' చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ - ఢిల్లీ - జైపూర్ - బెంగళూరు - ముంబై - కొచ్చి వంటి నగరాల్లో ప్రివ్యూలు వేయనున్నారు. తెలంగాణాలో హైదరాబాద్‌ ఏఎమ్‌బీ మాల్ లో ప్రివ్యూ ప్రదర్శించనుండగా.. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి షోలు ప్లాన్ చేయలేదు.

ఆంధ్రా ను విస్మరించారంటూ దీనిపై పలువురు సినీ అభిమానులు హీరో అడివి శేష్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. విజయవాడ లేదా వైజాగ్ లలో 'మేజర్' ప్రివ్యూ వెయ్యాలని రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఏపీని మర్చిపోలేదని.. అక్కడ సంథింగ్ భారీగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

''ఏపీని మరిచిపోయామని కొందరు అంటున్నారు. కానీ నేను దాని కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాను. నేను పెరిగిన ప్రదేశం వైజాగ్. నేను సెయింట్ మేరీస్ కాలేజీ అబ్బాయిని. మేము హోమ్ కోసం బెస్ట్ ని సేవ్ చేసి పెట్టాం. వైజాగ్ కోసం రేపు మాసివ్ ప్రకటన రాబోతోంది'' అడివి శేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

వైజాగ్ లో ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నామని శేష్ చెప్పడంతో ఆంధ్రా సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది 'మేజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ను చీఫ్ గెస్టుగా తీసుకురావాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి రేపు వచ్చే ప్రకటన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించా కాదా అనేది వేచి చూడాలి.

'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. దీనికి శేష్ స్టోరీ - స్క్రీన్ అందించారు. ఇది యువ హీరోకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

ఇందులో అడవి శేష్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే 'మేజర్' మేకర్స్ వదిలిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.