Begin typing your search above and press return to search.

ఎక్సక్లూజివ్ : వైజాగ్ పోర్ట్ పై మహేష్ దే ఆధిపత్యం!

By:  Tupaki Desk   |   1 Feb 2020 7:34 AM GMT
ఎక్సక్లూజివ్ : వైజాగ్ పోర్ట్ పై మహేష్ దే ఆధిపత్యం!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ హాడావుడి.. ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మహేష్ అమెరికా వెళ్లారు. ఈ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మహేష్ తన తదుపరి చిత్రం పై దృష్టి సారిస్తారు.

మహేష్ తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కథ గురించి.. మహేష్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ అంతా వైజాగ్ నేపథ్యంలో జరుగుతుందని.. వైజాగ్ పోర్ట్ ను శాసించే పవర్ఫుల్ డాన్ గా మహేష్ కనిపిస్తారని సమాచారం. ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం మహేష్ కు కొట్టిన పిండే. 'అతడు' లో కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలోనూ.. 'బిజినెస్ మేన్' లో మాఫియాను కార్పోరేట్ బిజినెస్ గా మార్చే వ్యక్తిగానూ నటించారు. ఇక 'పోకిరి' లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ చివరివరకూ ఒక గ్యాంగ్ స్టర్ లాగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి అలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించడం ఆసక్తిని రేకెత్తించే అంశమే.

వంశీ పైడిపల్లి - మహేష్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం 'మహర్షి' బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం అందరినీ ఆకట్టుకుంది.. మహేష్ కాలేజి స్టూడెంట్ ఎపిసోడ్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది. ఆ సినిమాలో వంశీ పైడిపల్లి పనితనం నచ్చడంతో మహేష్ రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈసారి సూపర్ స్టార్ ను వంశీ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో వేచి చూడాలి.