Begin typing your search above and press return to search.

వీడియో: బార్న్ సాహ‌సాల‌ను కొట్టేలా ఏజెంట్ స‌వాల్?

By:  Tupaki Desk   |   1 Jan 2023 7:35 AM GMT
వీడియో: బార్న్ సాహ‌సాల‌ను కొట్టేలా ఏజెంట్ స‌వాల్?
X
అఖిల్ ఏజెంట్ కోసం అభిమానులు ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలి. 2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్ర‌చార‌మైన ఈ మూవీ రిలీజ్ తేదీపై ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ఠ‌త రాలేదు. మూవీ ఇప్పటికే చాలా కాలం నుండి మేకింగ్ ద‌శ‌లో ఉంది. ఇంత‌కుముందే `ఏజెంట్` కొత్త తాత్కాలిక విడుదల తేదీని లాక్ చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి.

ఈ నూతన సంవత్సరం రోజున ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేస్తామ‌ని చెప్ప‌డంతో ఏజెంట్ రిలీజ్‌ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని భావించారు. కొత్త విడుదల తేదీని ఇత‌ర‌ ప్రణాళికను అదే సమయంలో ప్రకటిస్తారా? అంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూశారు. కానీ ఇప్పుడు టీమ్ కేవ‌లం మేకింగ్ వీడియోను మాత్ర‌మే విడుద‌ల చేయ‌డం అఖిల్ అభిమానుల‌ను కొంత నిరాశ‌కు గురి చేసింది. స‌మ్మ‌ర్ 2023 అని పోస్ట‌ర్ లో వేసారు కానీ అధికారిక రిలీజ్ తేదీని అయితే ప్ర‌క‌టించ‌లేదు.

ఇక‌పోతే మేకింగ్ వీడియోలో అఖిల్ మ్యాకోమ్యాన్ లుక్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ అని చెప్పాలి. అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో భారీ కెమెరాల‌తో అసాధార‌ణ పోరాట విన్యాసాల‌ను తెర‌కెక్కించార‌ని ఈ విజువ‌ల్స్ చెబుతున్నాయి. తాజా మేకింగ్ వీడియో ఏజెంట్ పై మ‌రింత భారీ అంచ‌నాల‌ను పెంచింద‌ని చెప్పాలి. సురేంద‌ర్ రెడ్డి నిజానికి ఏజెంట్ ని పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించేందుకు పూనుకున్నార‌న్న క‌థ‌నాల న‌డుమ తాజా మేకింగ్ విజువ‌ల్ ఆ స్టాండార్డ్స్ ని ఆవిష్క‌రించింద‌ని చెప్పాలి. ముఖ్యంగా అఖిల్ మ్యాకో లుక్ .. అత‌డి అరివీర భ‌యంక‌ర పోరాటాలు బార్న్ సినిమాల‌ను త‌ల‌పించేలా తెర‌కెక్కిస్తున్నారని కూడా అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. హాలీవుడ్ లో ఏజెంట్ సినిమాల కేట‌గిరీలో బార్న్ ఐడెంటిటీ సిరీస్ గొప్ప‌ సంచ‌ల‌నం. జేమ్స్ బాండ్ 007 సినిమాల‌కు ధీటుగా ఆడాయి. అందుకే ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి ఏజెంట్ మేకింగ్ విధానం కూడా బార్న్ చిత్రాల‌ను త‌లపిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

తాజా గుసగుస‌ల ప్ర‌కారం.. ఈ చిత్రం 14 ఏప్రిల్ 2023న థియేటర్లలోకి రానుందని సమాచారం. ఏజెంట్ ప్రైమ్ సమ్మర్ స్లాట్ ను లాక్ చేయ‌డంతో ఈ తేదీనే ఖ‌రారు చేసి ఉండొచ్చ‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. కానీ తేదీపై మ‌రోసారి అధికార‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంత మిగిలి ఉంది.

ఉత్త‌రాదినా భారీ రిలీజ్ ప్లాన్?

స్పై యాక్ష‌న్ డ్రామా `ఏజెంట్` ని హిందీ బెల్ట్ లో భారీగా రిలీజ్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాటు క‌ర‌ణ్ జోహార్ అండ్ టీమ్ చేస్తున్నార‌ని ఇంత‌కుముందు గుస‌గుస‌లు వినిపించాయి. నాగ్ ఇటీవ‌లే ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీసులో కనిపించారు. తాను న‌టించిన `బ్ర‌హ్మాస్త్ర‌`ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో నాగ్ తన కుమారుడు అఖిల్ హిందీ అరంగేట్రానికి సంబంధించిన చ‌ర్చ‌లు సాగించార‌ని వార్తలు వచ్చాయి. కరణ్ జోహార్ త్వరలో అఖిల్ ని హిందీలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దాని కోసం ప్లాన్స్ జరుగుతున్నాయని హిందీ మీడియాలో గాసిప్ లు వెలువ‌డ్డాయి.

ఏజెంట్ చిత్రాన్ని హిందీలో ఘ‌నంగా విడుద‌ల చేయ‌డ‌మే గాక‌.. స్ట్రెయిట్ గా క‌ర‌ణ్ బ్యాన‌ర్ లోనే అఖిల్ త‌దుప‌రి మూవీ చేయ‌బోతున్నాడని కూడా భావిస్తున్నారు. వ‌రుస‌గా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బాక్సాఫీస్ రేంజును విస్త‌రించే ఆలోచ‌న‌లో అఖిల్ ఉన్నాడు. అక్కినేని కాంపౌండ్ లో `మ‌నం` త‌ర్వాత మ‌ళ్లీ చెప్పుకోదగ్గ రేంజు సినిమా లేదు. అన్ని లోపాల‌ను స‌రిచేస్తూ అఖిల్ జెట్ స్పీడ్ తో దూసుకొస్తాడ‌నే అంతా ఆశిస్తున్నారు. ఏజెంట్ తో అత‌డు త‌న‌కు ఎదురైన‌ చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతాడ‌నే అభిమానులు వేచి చూస్తున్నారు.