Begin typing your search above and press return to search.

యువ ఫిలింమేక‌ర్స్ `ఆహా` అనిపించే డీల్స్

By:  Tupaki Desk   |   27 July 2021 7:42 AM GMT
యువ ఫిలింమేక‌ర్స్ `ఆహా` అనిపించే డీల్స్
X
ప్ర‌స్తుతం ఓటీటీదే హ‌వా. తెలుగు సినిమాకి డిజిట‌ల్ ఓ ఆల్ట‌ర్నేట్ గా మారింది. పెద్ద తెర రిలీజ్ లు క‌ష్టం అవుతుంటే ఓటీటీలే దారి చూపిస్తున్నాయి. అందుకే ఇటీవ‌ల‌ ఓటీటీ పేరుతో టాలీవుడ్ లో పెద్ద ఎత్తున బిజినెస్ జ‌రుగుతోంది. ఎవ‌రికి వారు తెలివిగా త‌మ‌ ప‌రిచ‌యాల్ని బిజినెస్ వ‌ర్క‌వుట్ చేసుకునేందుకు అస్త్రాలుగా వాడేస్తూ నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటున్నారు. ఓటీటీ కంపెనీల‌కు వెన్నుద‌న్నుగా నిలిచిన ద‌గ్గుబాటి సురేష్ బాబు ఇప్ప‌టికే త‌మ కాంపౌండ్ చిత్రాల‌కు బిగ్ డీల్స్ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిన‌దే.

ఇక ఎంతో ముందు చూపుతో మెగా నిర్మాత అల్లు అర‌వింద్ `ఆహా-తెలుగు ఓటీటీ` ని ప్రారంభించి స‌త్తా చాటుతున్నారు. ఆయ‌న రావ‌డం రావ‌డ‌మే సునామీలా ఓటీటీలోకి దూసుకొచ్చారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల అనువాదాల్ని తెలుగులోకి తేవ‌డం.. అలాగే వ‌ర్క‌వుట‌య్యే ఇత‌ర‌ కంటెంట్ ని కొనుగోలు చేయ‌డం.. ఒరిజిన‌ల్ కంటెంట్ ని సృష్టించ‌డం ఇలా ప్ర‌తిదీ ఉప‌యోగించి ఆహాని ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట‌య్యేలా తీర్చిదిద్దారు. తొలుత విమ‌ర్శించిన నోళ్లే ఇప్పుడు ఆహాను పొగిడేసే రేంజులో మెగా బిజినెస్ ప్లాన్ వ‌ర్క‌వుటైంది.

తాజాగా చిన్న నిర్మాణ సంస్థ‌ల నుంచి ఆహా కోసం కంటెంట్ ని అదే స్థాయిలో కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. యూవీ క్రియేష‌న్స్ చిన్న సినిమాల నిర్మాణం కోసం యూవీ కాన్సెప్ట్స్ అనే కొత్త బ్యాన‌ర్ ఓపెన్ చేసి మినీ సినిమాల నిర్మాణానికి ప్రాముఖ్య‌త‌నిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అలాగే ద‌ర్శ‌కుడు మారుతి సొంత బ్యాన‌ర్ `మాస్ మూవీ మేక‌ర్స్` లోనూ ఆహాకు కంటెంట్ రూపొందుతోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా `మంచి రోజులు వ‌చ్చాయి` అనే చిన్న సినిమాని తెర‌కెక్కించి ఆహా కు డిజిటల్ రైట్స్ కి అమ్మేసారుట‌. పెద్ద రేంజులోనే గిట్టుబాటైంద‌ని చెబుతున్నారు. గోపిచంద్ తో మారుతి తీస్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. సంతోష్ శోభ‌న్ సినిమాని క‌లిపేసి గంప‌గుత్త‌గా డీల్ ని సెట్ చేశార‌ని ఒక సెక్ష‌న్ లో క‌థ‌నాలొస్తున్నాయి. ఈ డీల్ విలువ సుమారు 12 కోట్లు పైమాటేన‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. యువితో .. జీఏ2 సంస్థ‌తో మారుతి ఇలాంటి జాయింట్ వెంచ‌ర్ల రూపంలో మ‌రిన్ని చిత్రాల‌ను తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. నిజానికి ల‌క్ష‌ల్లో బ‌డ్జెట్ తోనే గొప్ప యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించే స‌మ‌ర్థులైన యువ‌ద‌ర్శ‌కులు మ‌న‌కు కొద‌వేమీ లేదు. అయితే ట్యాలెంట్ ని స‌ద్వినియోగం చేయ‌డంలోనే ఉంది అస‌లు లాజిక్కు. ఇటీవ‌ల ట్యాలెంట్ కి ఓటీటీ పెద్ద దారి చూపిస్తోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

డెల్టా పేరు చెప్పి ఓటీటీల‌కు బాగు!

రెండేళ్లుగా వైర‌స్ ఓ ఆటాడుకుంటోంది. సెకండ్ వేవ్ భారీగా ప్రాణాలు తీసింది. అలాగే థ‌ర్డ్ వేవ్ అనంత‌రం వైర‌స్ ఇంకెన్ని ర‌కాలుగా రూపాంత‌రం చెందుతుందో కూడా క్లారిటీ లేదు. డెల్టా వైర‌స్ విల‌యంగా మారుతుంద‌న్న క‌థ‌నాల న‌డుమ జ‌నం బిక్కుబిక్కుమంటూ ఇండ్ల‌లోనే ఉంటున్నారు. ఇది ఓటీటీకి మ‌రింత పెద్ద ప్ల‌స్ కానుంది. ఈ నేప‌థ్యంలో సినిమా వ్యాపారానికి ఓటీటీ చ‌క్క‌ని వేదిక‌గా నిలుస్తోంది.