Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ‘ఆహా’ అనిపించే ఓ సిరీస్

By:  Tupaki Desk   |   30 Dec 2020 4:37 PM GMT
ఎట్టకేలకు ‘ఆహా’ అనిపించే ఓ సిరీస్
X
ఇండియాలో చాలా ఓటీటీలు ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఒక రీజనల్ లాంగ్వేజ్‌కు పరిమితం అవుతూ మొదలైన ఓటీటీ.. ఆహా. కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుందీ ఓటీటీలో. వేరే భాషల సినిమాలు ఉండవని కాదు కానీ.. వాటిని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఐతే కేవలం సినిమాలతో ఓటీటీలను నడిపించడం కష్టం. ఓటీటీ నుంచి ఒరిజినల్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఆశిస్తారు. ఏ ఓటీటీ అయినా సొంతంగా సాధ్యమైనంత ఎక్కువగా వెబ్ సిరీస్‌లు అందించాలి. వాటిలో మంచి క్వాలిటీ ఉండాలి. ఐతే ‘ఆహా’ ఇప్పటికే మస్తీ, లాక్డ్, సిన్, మెట్రో కథలు, కమిట్మెంట్ లాంటి ఒరిజినల్స్ చాలానే తీసుకొచ్చింది కానీ.. అవేవీ కూడా ఆశించినంత సక్సెస్ కాలేదు. ఓ మోస్తరు స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఈ సిరీస్‌ల్లో క్వాలిటీపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ఒరిజినల్స్‌లో ఇంకా క్వాలిటీ పెంచాలని, ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచాలని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఆహా ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉంది. కొత్తగా ఈ సంస్థ నుంచి ఇప్పుడు ‘కంబాలపల్లి కథలు’ అంటూ కొత్త సిరీస్ రాబోతోంది. ఇందులోంచి ‘మెయిల్’ పేరుతో తొలి చాప్టర్ రెడీ చేశారు. ప్రియదర్శి ఇందులో లీడ్ రోల్ చేశాడు. 2005 ప్రాంతంలో ఇంటర్నెట్ అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో అడుగు పెడుతున్న సమయంలో తమ ఊరిలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టి దాన్ని పాపులర్ చేసేందుకు ఓ కుర్రాడు ఎలా కష్టపడ్డాడన్నది దీని కాన్సెప్ట్. ఇంటర్నెట్ గురించి పెద్దగా తెలియని ఊరి జనాల ముందు ఆ కుర్రాడు కొట్టే బిల్డప్.. పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటం నేర్పించడం.. అలాగే యూత్‌కు మెయిల్స్ క్రియేట్ చేసి ఇవ్వడం లాంటి అంశాలపై చాలా వినోదాత్మకంగా ఈ కథను నడిపించినట్లున్నారు. టీజర్ అయితే చాలా వినోదాత్మకంగా, ఆసక్తికరంగా, కొత్తగా సాగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంది. ‘ఆహా’లో ఆహా అనిపించే సిరీస్ ఇదవుతుందనే అంచనాలు కలుగుతున్నాయి. సంక్రాంతికి ‘మెయిల్’ ప్రిమియర్స్ వేయనున్నారు. మరి టీజర్ మాదిరే ఆ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.