Begin typing your search above and press return to search.

మలయాళ హీరోలని 'టాలీవుడ్ స్టార్స్' ని చేస్తున్న 'ఆహా'

By:  Tupaki Desk   |   26 May 2021 5:30 AM GMT
మలయాళ హీరోలని టాలీవుడ్ స్టార్స్ ని చేస్తున్న ఆహా
X
ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలయ్యాక, ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ని ఆదరిస్తున్నారు. అనేక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉండటంతో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లతో పాటుగా వివిధ భాషల్లోని చిత్రాలను కూడా చూస్తున్నారు. దీంతో ఇతర ఇండస్ట్రీలోని హీరోలు అందరికీ పరిచయం అవుతున్నారు.

నిజానికి ప్రస్తుతం ఓటీటీ వేదికలలో ఎక్కువగా సందడి చేస్తున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మలయాళ ఇండస్ట్రీకి చెందినవని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఇంతకముందు మోహ‌న్ లాల్ - మ‌మ్ముట్టి - సురేష్ గోపి - పృథ్వీరాజ్ - దుల్కర్ సల్మాన్ వంటి కొందరు మలయాళ హీరోలు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్య‌మా అని అక్క‌డి సినిమాలతో పాటుగా హీరోలంద‌రి గురించి కూడా తెలుస్తోంది.

ముఖ్యంగా 100 శాతం తెలుగు ఓటీటీ అంటూ వచ్చిన 'ఆహా' కార‌ణంగా మ‌ల‌యాళ సినిమాల‌కు ఇక్కడ2 మంచి ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ప్రారంభం నుంచి కూడా అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా స్ట్రీమింగ్ కి పెడుతోంది. ఇప్పటికే ఈ యాప్ లో విడుదలైన డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ తెచ్చుకున్నాయి.

అందులోనూ ఫహాద్ ఫాజిల్ - టొవినో థామ‌స్ - కుంచాకో బోబన్ వంటి మలయాళ హీరోల సినిమాల మీద 'ఆహా' ప్ర‌త్యేకంగా దృష్టిసారించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా మలయాళ వర్సటైల్ యాక్టర్ టోవినో థామ‌స్ హీరోగా నటించిన మలయాళ సినిమాలను ఆహా అనువాదం చేసి విడుదల చేస్తోంది. 'ఫోరెన్సిక్' 'మాయానది' 'లూకా అలియాస్ జానీ' 'వ్యూహం' 'అండ్ ది ఆస్కార్ గోస్ టూ' వంటి చాలా సినిమాల‌ను ఆహా తెలుగులోకి డ‌బ్ చేసి స్ట్రీమింగ్ కి పెట్టింది. ఈ క్రమంలో థామ‌స్ నటించిన మరో సినిమా 'కాలా' ని జూన్ 4న విడుదల చేస్తున్నారు.

అలానే మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన 'ట్రాన్స్' చిత్రాన్ని ఆహా డబ్ చేసి రిలీజ్ చేయగా.. విశేష స్పందన తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఫహాద్ - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన 'అథిరన్' సినిమాని ''అనుకోని అతిధి'' అనే పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. మే 28 నుంచి ఈ సినిమా ఆహా లో అందుబాటులోకి రానుంది. ఇక కుంచాకో బోబన్ హీరోగా నటించిన 'మిడ్ నైట్ మర్డర్స్' వంటి సినిమాలు కూడా తెలుగు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

ఆహా ఓటీటీ వల్లే మలయాళంలో ఇలాంటి హీరోలు ఉన్నారని చాలామంది తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిందని అనడంలో అతిశ‌యోక్తి లేదు. ఇప్పుడు ఆహా యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వారందరికీ వీళ్ళందరూ స్టార్ హీరోలు అయిపోయారని చెప్పవచ్చు. అందుకే వీరు నటించిన సినిమాలు ఏవైనా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ ను 'పుష్ప' సినిమాలో విలన్ గా తీసుకోడానికి ఒక రకంగా ఆహా కూడా కారణమని అనొచ్చు. ఫహాద్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కాబట్టే.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ వచ్చింది. ఏదేమైనా ఆహా పుణ్యమా అని మలయాళ హీరోలందరూ టాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు.