Begin typing your search above and press return to search.

డిస్నీ ప్ల‌స్ స్ఫూర్తితో 'ఆహా' బిగ్ ప్లానింగ్?

By:  Tupaki Desk   |   10 Nov 2022 5:34 AM GMT
డిస్నీ ప్ల‌స్ స్ఫూర్తితో ఆహా బిగ్ ప్లానింగ్?
X
అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. హులు లాంటి దిగ్గ‌జ ఓటీటీలు భారీగా స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను సంపాదించుకుని ముందుకు దూసుకెళుతున్నాయి. అయితే దీనికోసం వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల‌ను వెద‌జ‌ల్లుతున్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా క్రైసిస్ ఓటీటీల‌కు ఒక రేంజులో క‌లిసొచ్చింది. థియేట‌ర్ల‌ను వ‌దిలి ఓటీటీల‌కు జ‌నం అల‌వాటు ప‌డ్డారు. అయితే ఈ రెండు విభాగాల్లో ఆద‌ర‌ణ దేనిక‌దే ప్ర‌త్యేకం అని క్రైసిస్ అనంత‌రం నిరూప‌ణ అయ్యింది. ఇది థియేట్రిక‌ల్ రంగానికి చాలా పెద్ద ఊర‌ట కాగా ఓటీటీల‌కు ఉండే ఆద‌ర‌ణ కూడా ఏమాత్రం త‌గ్గ‌లేదు.

ఇక క‌రోనా క్రైసిస్ కంటే ముందే ఆహా-తెలుగు ప్రాంతీయ ఓటీటీ ప్రారంభ‌మైంది. బాస్ అల్లు అర‌వింద్ ఎంతో తెలివిగా స‌రైన టైమింగ్ తో ఓటీటీ రంగంలో ప్ర‌వేశించారు. ఆరంభం కొంచెం నెమ్మ‌దిగా ఉన్నా కానీ కాల‌క్ర‌మంలో పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించి ఒరిజిన‌ల్ సినిమాలు.. ఒరిజిన‌ల్ షోల‌తో అనువాదాల‌తో ఆహా ఓటీటీని ప‌రుగులు పెట్టించారు. ఆహా భారీగా స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పొంద‌గ‌లిగింది అంటే యాజ‌మాన్యంతో పాటు క్రియేటివ్ టీమ్ పెట్టిన ఎఫ‌ర్ట్ అంతే గొప్ప‌ద‌ని చెప్పాలి. ఇప్పుడు ఆహా మ‌రో మెట్టు పైకి ఎక్కాల్సి ఉంది. దీనికి డిస్నీ ప్ల‌స్ లాంటి అంత‌ర్జాతీయ ఓటీటీ సంస్థ‌లు ఆలంబ‌న‌గా నిల‌వాలి. అతి త‌క్కువ స‌మ‌యంలో వేగంగా ఎద‌గ‌డం ఎలానో డిస్నీ ప్ల‌స్ స్ఫూర్తిగా నిలుస్తోంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

తాజా గణాంకాల ప్ర‌కారం..అంత‌ర్జాతీయంగా పాపుల‌రైన మూడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ రేసులో ఉన్నాయి. ఈ మూడిటి న‌డుమా పోటీ ఇప్పుడు ప‌తాక స్థాయికి చేరుకుంది. ప్రస్తుతానికి డిస్నీ- నెట్ ఫ్లిక్స్- అమెజాన్ ప్రైమ్ తర్వాత రేసులో ముందుంది.

తాజాగా FY22 Q4లో డిస్నీ చెల్లింపు చందాదారుల వివ‌రాల్ని ప్రకటించారు. ప్రస్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ 235.7 మిలియన్ల చెల్లింపు చందాదారులు ఉన్నారు. అయితే ఇందులో డిస్నీ+ హాట్ స్టార్ 164 మిలియన్లు... హులు 47 మిలియన్లు ... ESPN+ 24 మిలియన్లు చందాదారుల‌ను క‌లిగి ఉన్నాయి. కానీ ఓటీటీ దిగ్గ‌జాలన్నీ వాల్ స్ట్రీట్ 350 మిలియన్ల చందాదారుల అంచనా కంటే తక్కువలోనే నిలిచిపోయారు.

గణాంకాలను పోల్చి చూస్తే నెట్ ఫ్లిక్స్ 160 మిలియన్ చెల్లింపు చందాదారులను చేరుకోవడానికి 12 సంవత్సరాల 9 నెలలు పట్టింది. మరోవైపు డిస్నీ+ ఓటీటీకి అదే మార్కును చేరుకోవడానికి 2 సంవత్సరాల 10 నెలలు పట్టింది. డిస్నీ ప్రారంభించిన మూడు సంవత్సరాలలో అంతర్జాతీయంగా కూడా విజయవంతంగా లాభపడింది. ఆర్థిక అంచనాలు స్థిరంగా ఉన్నట్లయితే 2024లో లాభదాయకతను సాధించడానికి ప్రత్యక్ష కస్టమర్ ఆపరేటింగ్ నష్టాలను తగ్గించాలని భావిస్తోంది.

ఇక అమెజాన్- నెట్ ఫ్లిక్స్- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ల గ‌ణాంకాల‌ను కాల వ్య‌వ‌ధిని ప‌రిశీలిస్తే డిస్నీ ప్ల‌స్ అన్నిటి కంటే ముందుంది. ఇప్పుడు ఇలాంటి దిగ్గ‌జం అంద‌రికీ స్ఫూర్తి. ప్రాంతీయ ఓటీటీల‌కు కొన్ని ఫార్ములాల‌ను డిస్నీ ప్ల‌స్ అందించ‌గ‌ల‌దు. ఆహా- తెలుగు ఓటీటీ మ‌రికొన్ని వైవిధ్య‌మైన టిప్స్ ని అనుస‌రించ‌డం ద్వారా మ‌రింత‌గా స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పెంచుకుంటుందేమో చూడాలి. అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల పెట్టుబ‌డుల వ‌ర‌ద‌తో పోల్చుకోవ‌డం స‌రికాదు కానీ.. వైవిధ్య‌మైన కార్య‌క్ర‌మాల‌తో క్రియేటివిటీతో ప్రాంతీయ ఓటీటీలు మ‌రింత‌గా ఎదిగేందుకు ఆస్కారం లేక‌పోలేదని భావిద్దాం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.