Begin typing your search above and press return to search.

అరే.. ఐశ్వర్యా రాజేష్ మనమ్మాయే..?

By:  Tupaki Desk   |   23 Aug 2019 7:30 AM GMT
అరే.. ఐశ్వర్యా రాజేష్ మనమ్మాయే..?
X
గ్లామర్ కథానాయికి అస్సలే కాదు. కాకుంటే నటన విషయంలో వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ రోజున విడుదలవుతున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ చిత్రంలో లీడ్ రోల్ చేసిన ఆమె మీద పెద్ద బజ్ కూడా లేదు. చాలామంది గ్లామర్ హీరోయిన్ల మాదిరి సోషల్ మీడియాలోనూ.. ఇతరత్రా వేదికల మీద చిట్టి పొట్టి డ్రెస్సులతో.. ఎక్కడ ఏది చూపిస్తే వర్క్ వుట్ అవుతుందో.. చాలామందికి కనెక్ట్ అవుతుందో లాంటి వాటి మీద పెద్దగా ఇంట్రస్ట్ లేనట్లుగా ఉండటం ఆమెకు అలవాటు.

ఈ కారణంతోనే కావొచ్చు.. పాతిక తమిళ చిత్రాలు.. రెండు మలయాళం.. ఒక హిందీ సినిమా చేసి.. ప్రస్తుతం మరో పద్నాలుగు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ.. పెద్దగా హడావుడి చేయని తత్త్వం ఐశ్వర్యలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమిళంలో పాతిక సినిమాలు చేసిన అనుభవం ఉన్నప్పుడు.. తాను నటించిన తొలి తెలుగు చిత్రం విడుదల అవుతున్న వేళ.. తనను తాను కాస్త హడావుడి చేసుకోవచ్చు. కానీ.. అలాంటివి పెద్దగా ఇంట్రస్ట్ లేదన్నట్లుగా ఉంది ఐశ్వర్య వ్యవహారం చూస్తే.

తమిళంలో తాను నటించిన కణ చిత్రానికి తెలుగు రూపమే ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఐశ్వర్య అసలు ఎవరు? ఆమెకు తెలుగు నేలకు ఉన్న లింకు.. ఆమెకున్న బంధురికం గురించి తెలుగు మీడియా అస్సలు పట్టించుకున్నది లేదు. కాస్త లోతుల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఆమె అసలు సిసలు తెలుగమ్మాయి. కాకుంటే మద్రాస్ లో పెట్టి.. పెరిగింది. దీంతో తమిళమ్మాయ్ అయిపోయింది.

ఇంతకీ ఐశ్వర్య నాన్న ఎవరో తెలుసా? రాజేష్. డెబ్బై.. ఎనభైల్లో పుట్టిన వారికి బాగా సుపరిచితుడు. మల్లె మొగ్గలు.. రెండు జెళ్ల సీత.. అలజడి చిత్రాల్లో నటించారు. విలన్ గా మంచి పేరే తెచ్చుకున్నారు. ఆమె అత్త ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మీ. ఆమె తాత ఎవరో కాదు.. ప్రముఖ నటుడు.. అప్పట్లో అందగాడి పేరున్న అమర్ నాథ్. ఇలా తెలుగమ్మాయ్.. తెలుగు మూలాలు పెద్ద ఎత్తున ఉన్న మనమ్మాయ్.. తమిళ పొన్నుగా పరిచయం కావటం..అయినప్పటికీ ఆమె ఎవరన్న విషయం బయటకు రాకపోవటం.. మనమ్మాయ్ అన్న విషయం తెలీకపోవటం చూస్తే.. తెలుగోళ్ల అసలుసిసలు దరిద్రం అర్థమైపోతుంది.