Begin typing your search above and press return to search.

హిందీ వాళ్ల మ్యూజిక్ మ‌న‌కు ఎక్కుతుందా?

By:  Tupaki Desk   |   1 Nov 2019 1:30 AM GMT
హిందీ వాళ్ల మ్యూజిక్ మ‌న‌కు ఎక్కుతుందా?
X
ఇటీవ‌ల మ‌న ద‌ర్శ‌కుల‌కు బాలీవుడ్ స్టైల్ మ్యూజిక్ పై మ‌న‌సు పారేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వ‌రుస‌గా బాలీవుడ్ పాపుల‌ర్ సంగీత ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఫ‌లితంగా మ‌నదైన‌ ట్యాలెంటుకు అవ‌కాశాలు మిస్స‌వుతున్నాయి. దేవీశ్రీ‌-మ‌ణిశ‌ర్మ‌-థ‌మ‌న్ లాంటి ట్యాలెంటెడ్ సంగీత ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులు ప‌రిమితం అయిపోతున్నాయి. ఆ త‌ర్వాతి త‌రం సంగీత ద‌ర్శ‌కుల‌కు స‌రైన ఛాన్సులు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. వీళ్ల కంటే వాళ్లు ఇర‌గ‌దీస్తారా? అంటే ఇటీవ‌ల బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల మ్యూజిక్ వింటున్న వాళ్ల అభిప్రాయం వేరుగా ఉంది. సాహోకి ఒక్కో పాట‌కు ఒక్కొక్క‌రిని తీసుకున్న‌ప్పుడు.. బాణీల్లో కాంబినేష‌న్ ట‌చ్ మిస్స‌య్యింది. ఘిబ్రాన్ తో పాటుగా హిందీ వాళ్లు సంగీతం అందించారు. సైరాకు అమిత్ త్రివేది అద్భుత‌మైన రీరికార్డింగ్ అందించాడు. పాట‌ల ప‌రంగా అసాధార‌ణ మ్యాజిక్ ఏమీ జ‌ర‌గ‌లేదు. ఫ‌ర్వాలేద‌నిపించాయి.

అయినా ఇప్పుడు ఇంకా మ‌న ద‌ర్శ‌కులు బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం చ‌ర్చ‌కొస్తోంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించే 152వ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ద‌ర్శ‌కుడు కొర‌టాల న‌టీన‌టుల‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడిపైనా దృష్టి సారించారు. బాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన‌ అజీ-అతుల్ సంగీత ద‌ర్శ‌క ద్వ‌యం ఈ చిత్రానికి ఫైన‌ల్ అయ్యార‌ని తెలుస్తోంది. హృతిక్ అగ్నిప‌థ్ చిత్రానికి ఈ జోడీ సంగీతం అందించారు. చికిని ఛ‌మేళి అంటూ సాగే చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ క్రియేట‌ర్లు వీళ్లు. వాస్త‌వానికి సైరా సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేదిని తీసుకోవాల‌ని భావించినా అజీ-అతుల్ ద్వ‌యానికే ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని తెలుస్తోంది. కొర‌టాల వ‌రుస‌గా నాలుగు సినిమాల‌కు దేవీశ్రీ‌ని తీసుకుని ఈసారి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల్ని ఎందుకు ఎంచుకున్నాడు? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల రాక‌తో సంగీతంలో టోన్ మారుతున్న మాట వాస్త‌వం. అయితే మ‌న నేటివిటీ సినిమాల‌కు త‌గ్గ శైలి కూడా అవ‌స‌రం. మ‌న శ్రోత‌లు వేరు. ఉత్త‌రాది జిగిబిగి బాణిలో విప‌రీత‌మైన ఇన్ స్ట్రుమెంట‌ల్ హోరు ఇక్క‌డ అంత‌గా ఎక్కుతుందా? అంటే చెప్ప‌లేం. అప్ప‌ట్లో సందీప్ చౌతా లాంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రావ్య‌మైన సంగీతం అందించారు. నాగార్జున‌- కృష్ణ‌వంశీ- పూరి వంటి వారికి బాగా సింక్ అయ్యి ప‌ని చేశాడు. కానీ మ‌ళ్లీ ఇటీవ‌ల అలా ప‌ని చేయ‌గ‌లిగిన వారు త‌క్కువ‌. మ‌రి ఈ బ్లాంక్ ని ఫిల్ చేసేందుకు కొర‌టాల వంటి ద‌ర్శ‌కులు ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది చూడాలి. సౌత్ లో ఏ.ఆర్.రెహ‌మాన్ - హ్యారిస్ జైరాజ్- యువ‌న్ శంక‌ర్ రాజా- ర‌ధ‌న్ వంటి సంగీత ద‌ర్శ‌కులు ఇక్క‌డ అద్భుతాలు చేశారు. అయితే రెహ‌మాన్ చిక్క‌డం కానీ సింక్ అవ్వ‌డం కానీ అంత సులువేమీ కాదు. ఇత‌రులు కూడా బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్. బ‌హుశా ప్ర‌తిసారీ దేవీశ్రీ‌తోనే ప‌ని చేస్తే మోనోప‌లి అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయ‌ని కొర‌టాల ఆలోచ‌న మారిందా? రొటీన్ కి భిన్నంగా సంగీతం కావాల‌నుకోవ‌డం వ‌ల్ల‌నే ఇలా చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక మెగాస్టార్ న‌టిస్తున్న 152వ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ - నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. 2020 స‌మ్మ‌ర్ చివ‌రిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.