Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' విషయంలో అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ అసహనం!

By:  Tupaki Desk   |   20 Nov 2021 4:01 AM GMT
ఆర్ ఆర్ ఆర్ విషయంలో అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ అసహనం!
X
బాలీవుడ్ హీరోల్లో అజయ్ దేవగణ్ స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. తన సినిమాలను ఆయన చాలా సైలెంట్ గా చేసుకుంటూ వెళుతుంటాడు. ఎక్కడా .. ఏ వేదికలపై కూడా ఆయన తన సినిమాలకి సంబంధించిన హడావిడి చేయడు. తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో కూడా ఆయన అంచనాలు పెంచేసే స్థాయిలో మాట్లాడడు. సినిమాలో విషయం ఉంటే అదే థియేటర్లకు రప్పిస్తుందనే సిద్ధాంతాన్నే ఆయన ఫాలో అవుతుంటాడు. ఇక ఆయన ఇతర భాషల్లో నటించడానికి కూడా పెద్దగా ఆసక్తిని చూపంచడు. చాలా అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటాడు.

కానీ ఈ సారి ఆయనను రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఒప్పించారు. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు .. ఒకటికి రెండుసార్లు రాజమౌళి రిక్వెస్ట్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించగా, ఒక కీలకమైన పవర్ఫుల్ రోల్ ను అజయ్ దేవగణ్ పోషించాడు. ఒక రకంగా ప్రధాన పాత్రధారులలో పోరాటపటిమను పెంచేది ఆయన పాత్రేనని చెప్పారు. అజయ్ దేవగణ్ లుక్ .. ఈ సినిమా నుంచి వచ్చిన ఆయన ప్రచార చిత్రాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

అయితే తాజాగా ఒక రూమర్ ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అజయ్ దేవగణ్ పాత్ర ఈ సినిమాలో కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉంటుందనేది ఆ రూమర్ సారాంశం. తమ హీరో ఈ సినిమాలో చాలాసేపు కనిపిస్తాడని ఆయన అభిమానులు భావించారు. అలాంటిది ఇప్పుడు ఆయన తెరపై కనిపించేది 8 నిమిషాలు మాత్రమే అనే ప్రచారంతో వాళ్లు చాలా అసహనానికి లోనవుతున్నారు. ఈ విషయం అధికారికం కాకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతపెద్ద స్టార్ కి అంత తక్కువ స్పేస్ ఇస్తారా? అంటూ చిటపటలాడుతున్నారు.

అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే .. ఎవరూ ఎక్కడా ఎలాంటి సందర్భంలోను ఈ విషయాన్ని గురించి ప్రస్తావించలేదు. ఇటీవల ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్ర విషయంలోను ఇలాంటి ప్రచారమే జరిగింది. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పాత్రను తక్కువ సేపు చూపించనున్నామనే ఆ వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు అజయ్ దేవగణ్ పేరు తెరపైకి వచ్చింది. ఒక పాత్ర ఎంత కీలకం? .. ఆ పాత్రకి ఏ స్థాయి ఆర్టిస్ట్ కావాలి? ఆ పాత్ర నిడివి ఎంతసేపు ఉండాలి? అనే విషయాలు రాజమౌళికి బాగా తెలుసు గనుక, ఇలాంటి పుకార్లను నమ్మకపోవడమే మంచిది.