Begin typing your search above and press return to search.

ఇది బాలీవుడ్ ‘బాహుబలి’ అట..

By:  Tupaki Desk   |   21 July 2017 5:30 PM
ఇది బాలీవుడ్ ‘బాహుబలి’ అట..
X
‘బాహుబలి’ స్ఫూర్తితో మిగతా ఇండస్ట్రీల్లోనూ కదలిక వస్తోంది. వేరే భాషల్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. తమిళంలో ఇప్పటికే ‘సంఘమిత్ర’ పేరుతో బాహుబలి తరహా జానపద చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మలయాళంలో మహాభారతం కథను రూ.1000 కోట్ల బడ్జెట్ తో సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నా అందుకు స్ఫూర్తి బాహుబలే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ అలాంటి భారీ ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆ సినిమా పేరు.. ‘తానాజీ’. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

‘తానాజి’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అగ్నిలో కాలిపోతున్న యుద్ధ వీరుడి చిత్రాన్ని ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఛత్రపతి శివాజీకి ఆప్త మిత్రుడు.. ఆయన సైన్యంలో గొప్ప పోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరుడే సుబేదార్ తానాజీ మాల్సురే. 1870లో మొఘలులతో జరిగిన యుద్ధంలో ఆయన చూపించిన తెగువ చరిత్రలో నిలిచిపోయింది. తానాజీ గురించి స్కూలు పుస్తకాల్లో పాఠాలు కూడా వచ్చాయి. ఆ యుద్ధ వీరుడి కథను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ తరహాలో భారీ బడ్జెట్ తో.. ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తారట. గత ఏడాది ‘శివాయ్’ లాంటి భారీ ప్రాజెక్టు చేసి దెబ్బ తిన్నాడు అజయ్ దేవగణ్. మరి ‘తానాజీ’ అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.