Begin typing your search above and press return to search.

'పుష్ప'గా మెప్పించడం అంత ఈజీ కాదు .. ఎందుకంటే!

By:  Tupaki Desk   |   10 Dec 2021 12:30 AM GMT
పుష్పగా మెప్పించడం అంత ఈజీ కాదు .. ఎందుకంటే!
X
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రష్మిక కథానాయికగా సందడి చేయనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు .. ఫాహద్ ఫాజిల్ .. సునీల్ .. అనసూయ .. అజయ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తాజా ఇంటర్వ్యూలో అజయ్ ఈ సినిమాను గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు.

"సుకుమార్ .. అల్లు అర్జున్ గారితో 'పుష్ప' సినిమా చేయాలనుకుంటున్నారని తెలియగానే, ఈ సినిమాలో నేను కూడా ఒక పార్టు అయితే బాగుంటుందే అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాలో ఉండవలసిందే అనే ఆలోచనకి రాగానే అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేశాను .. ఉన్నాను.

ఈ సినిమాలో నేను అల్లు అర్జున్ బ్రదర్ పాత్రలో కనిపిస్తాను. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్స్ లో కనిపిస్తాను. సుకుమార్ దర్శకత్వం .. అల్లు అర్జున్ హీరో .. మైత్రీ మూవీస్ బ్యానర్ .. పాన్ ఇండియా సినిమా కావడం .. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టుపై నాకు ఆసక్తి ఏర్పడటానికి కారణమయ్యాయి.

అల్లు అర్జున్ లో నేను గమనించినదేమిటంటే సెట్స్ కి వచ్చిన దగ్గర నుంచి ఆయన కంప్లీట్ గా ఆ క్యారెక్టర్ లో ఉంటారు. ప్రతి షాట్ పై ఆయన పూర్తి ఫోకస్ పెడతారు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన పట్టించుకుంటారు .. అది పెర్ఫెక్ట్ గా వచ్చేలా చూసుకుంటారు.

ఒక వైపున ఆయన ఆ మేకప్ ను భరించాలి .. ఒక చెయ్యి కదలకుండా చూసుకోవాలి .. చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడాలి. ఈ విషయాలన్నీటినీ దృష్టిలో పెట్టుకుని నటించడమనేది చాలా కష్టమైన పనే. ఇప్పటివరకూ ఆయన చేసిన అన్ని సినిమాలలో కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన సినిమా ఇదేనని నేను అనుకుంటున్నాను.

చిత్తూరు .. శేషాచలం పరిసర ప్రాంతాలలోని వారిని చాలా దగ్గరగా సుకుమార్ గమనించారు. వాళ్ల వేషధారణ .. మాటతీరు .. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయనేది చూసిన తరువాతనే సుకుమార్ గారు ఈ సినిమాలోని పాత్రలను వాటికి దగ్గరగా డిజైన్ చేసుకున్నారు. అందువల్లనే ఆ పాత్రలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి.

నేను .. సునీల్ .. అనసూయ అందరం కూడా ఇంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించని లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తాము. నాకు తెలిసి ఫారెస్టు నేపథ్యంలో ఇంత పెద్ద సినిమా ఈ మధ్యకాలంలో రాలేదని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.